మంగళగిరిపై మోజు పడ్డ మమతా బెనర్జీ

Written by

మంగళగిరి.. గుంటూరు జిల్లాలోని ఈ పట్టణం ఇప్పుడు సీమాంధ్రుల రాజధాని అమరావతిలో అంతర్భాగంగా ఉంది. మొదట రాజధాని కేంద్ర ప్రాంతం ఇదే అవుతుందనుకున్నారు. కానీ కృష్ణా నదికి అభిముఖంగా కేంద్ర స్థానం ఉండాల్న ఉద్దేశంతో రాయపూడి, లింగాయపాలెం ప్రాంతాలకు రాజధాని వెళ్లింది. అయినప్పటికీ మంగళగిరి ప్రాధాన్యం తరగనిది చెరగనిది. సమీపంలోకి రాజధాని రావడంతో ఈ పట్టణం బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

మంగళగిరి పేరు చెప్పగానే మనకు రెండు విషయాలు గుర్తుకు వస్తాయి. ఒకటి పానకాల స్వామి.. లక్ష్మీనరసింహ స్వామి. పానకాల స్వామి ఆలయం కొండపైన ఉంటే.. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కొండ కింద ఉంటుంది. పానకాల స్వామి ఆలయంలో విగ్రహం ఉండదు. ఒక రంధ్రం ఉంటుంది. ఇందులో పానకాన్ని పోస్తే సగం దేవుడు తాగి.. మిగిలిన సగం భక్తలకు ఇస్తాడని ఒక నమ్మకం. ఇందువల్లే ఈ దేవుడికి పానకాల స్వామి అనే పేరు వచ్చింది.

మంగళగిరిలో మనకు గుర్తుకు వచ్చే మరో మంగళప్రదమైన అంశం చేనేత వస్త్రాలు. ఇక్కడి నేతన్నల నైపుణ్యానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఫ్యాషన్ కు పుట్టినిల్లు అయిన పారిస్ కు కూడా మంగళగిరి చేనేత వస్త్రాలు ఎగుమతి అవుతాయి. ఇటీవలి కాలంలో ప్రజలు ఫ్యాషన్ దస్తులపై ఎక్కువగా మొగ్గు చూపుతూ రావడం వల్ల అన్ని ప్రాంతల్లోని చేనేత వస్త్రాల్లాగే మంగళగిరి చేనేత కూడా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఎన్ని కష్టాలున్నా.. ఇక్కడి నేతన్నలు తమ అద్భుత పనితనంలో మగువుల మనసు దోచే చీరలు నేస్తున్నారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. నేత చీరలకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి వారు. ఆమె ఎప్పుడూ చాలా సింపుల్ గా నేత చీరల్లోనే కనిపిస్తుంటారు. మంగళగిరి చీరలు కూడా ఆమెకు చాలా ఇష్టం. ఇటీవల మన మంగళగిరి చీరలు కావాలంటూ మమతా ఆర్డర్ పంపారు. అలాగే పారిస్ నుంచి కూడా ఆర్డర్లు వచ్చాయని ఇక్కడి నేతన్నలు చెబుతున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా మన నేతన్నల నైపుణ్యాన్ని గుర్తిస్తున్నారు. మనం కూడా మన వారసత్వాన్ని చాటిచెప్పేందుకు ప్రయత్నిద్దాం. మన మగువుల వార్డ్ రోబ్ ల్లో మంగళగిరి చీరలకు స్థానం కల్పిద్దాం.

మంగళగిరి చీరలకు జాగ్రఫికల్ ఐడింటిఫికేషన్(GI) ట్యాగ్ కూడా ఉంది. ఒక ప్రాంతం నుంచి వస్తున్న గొప్ప ఉత్పత్తిని ఇతర ప్రాంతాల వారు కాపీ కొట్టకుండా ఉండేందుకు ఈ GI ట్యాగ్ ను ఇస్తారు. దీనిని సరళంగా భౌగోళిక గుర్తింపు అని అంటారు. తిరుపతి లడ్డూకు GI ట్యాగ్ ఉంది.

ఇప్పుడు ఆన్ లైన్ ద్వారా అమ్మకాలు జోరుగా సాగుతున్నందున ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉంటే మంగళగిరి చేనేతకు పూర్వ వైభవం తీసుకువస్తామని నేతన్నలు చెబుతున్నారు. 1980లలో ఇక్కడి చేనేత స్వర్ణయుగాన్ని చూసింది. మళ్లీ ఆ స్థాయిని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరికి ప్రభుత్వం సాయం చేయడంతో పాటు ఉత్సాహవంతులు(ఎంటర్ ప్రెన్యూర్లు) మంగళగిరి, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ చీరలకు మార్కెట్లో డిమాండ్ పెరిగేలా చేస్తే బాగుంటుంది.

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title