బాబు మళ్లీ బ్యాటింగ్ చేస్తారట !

Written by

ఏడాదిన్నర కాలంగా మునివేళ్ల మీద నిలబడిన ఏపీ ఇప్పుడిప్పుడే నిలకడ నేర్చుకుంటోంది. వాస్తవాలు తెలిసొస్తున్నాయ్. సాయం లాంటివి ఎంత వరకూ కలిసొస్తాయో అర్థమవుతోంది. రాజకీయం..ఎవరి బలాబలాలు బలహీనతలు ఏంటో బైటపడుతున్నాయ్. ఇపుడు పాలన కూడా విజయ వాడకి వచ్చేసింది కాబట్టి మ్యాచ్ మొదలౌతోంది. బౌలర్లు బంతి ప్యాంట్ కి రుద్దుకుంటూ సిద్ధమైతే… ప్యాడ్లు కట్టుకొని బ్యాటింగ్ కి రెడీ అంటున్నారు చంద్రబాబు.

ఐదు రోజుల యాక్షన్ ప్లాన్ :
మ్యాచ్ స్టార్ట్ అయిపోయినట్టే. బస్సుయాత్రలు పార్టీల ప్రయాసలు ఓ పక్క… నేను ఏం చేస్తున్నాను ఏం చేయాలనేది చెప్పేందుకు చంద్రబాబు ఇంకో పక్కన రెడీ. ఈక్వేషన్స్ క్లియర్ అయిపోయాయ్. ఇవాల్టి నుంచి వరసగా ఐదురోజుల పాటు ఏపీలో ఎవరి రంగు ఏంటో బైట పెడతా అంటూ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు సీఎం. విభజన సమయంలో ఎవరు ఏం మాట్లాడారు… ఇప్పుడేం చేస్తున్నారు… రాష్ట్రానికి జరిగేదేంటి ? ఇలాంటి కోణాలన్నీ ఈ ఐదు రోజుల్లో వివరించాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నారు చంద్రబాబు. ఇన్నాళ్లూ రాజధాని వ్యూహం… నిధులు పెట్టుబడి, పర్యటనలు వీటితోనే సరిపోయింది. అందుకే 15 నెలల్లో బాబు రాజకీయాలపై ప్రత్యేకంగా మాట్లాడినట్టులేరు. ఇప్పుడిక వరస మారబోతోందని చెబుతున్నారు.

పరిపాలన కూడా పట్టువిడుపులతో సాగింది. రివ్యూలు, ప్రివ్యూలు చూపించినా… ఆదాయం లేదంటూ కొన్ని, యంత్రాంగం మీద పట్టుకుదరక ఇంకొన్ని డిలే అవుతూ వచ్చాయ్. ఇప్పుడు మాత్రం సీన్ మారింది. మన రాష్ట్రానికి మనం వచ్చేశాం… ఆగస్ట్ 15 అసెంబ్లీ సమావేశాలు అన్నీ ఇక్కడే. పరిపాలన కూడా ఇక్కడ నుంచే. ఇక ప్రత్యర్థుల వ్యవహారం తేల్చుకోవడం కూడా ఇక్కడ నుంచే అనే వ్యూహం అమలవుతోంది అని చెబుతున్నారు. కేబినెట్ లో మార్పులు చేర్పులు లాంటివి కూడా ముందు ముందు ఉంటాయని… దానికి వార్మప్ గానే ఇపుడు రాజకీయ హీట్ పెరగబోతోందని చెబుతున్నారు.

మళ్లీ ఆ బాబు కనిపిస్తాడా ?
చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు వ్యవహారం వేరు. రాజకీయంగా దూకుడు ఉండేది. ప్రత్యర్థులకి సమాధానం చెప్పడం ఓ పక్క… ఇంకోవైపు అధికార వ్యూహాల్లో ఆయన ముందుండేవారు. ఈ మధ్య విపక్షాన్ని పూర్తిగా పట్టించుకోవడం మానేసినట్టుగా కనిపిస్తున్నారు. ఎక్కడా వాళ్ల ప్రస్తావన రావడం లేదు. ముందు రాష్ట్రం సంగతి తర్వాత రాజకీయం చేయడం అనే మాట విని… చుట్టూ ఉన్నవాళ్లు కూడా కదిపే ప్రయత్నం చేయలేదంటారు. ఇప్పుడంటే హోదా పేరుతో విపక్షాలు మళ్లీ నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయ్. ఇలాగే ఊరుకుంటే లేనిపోని రాజకీయాలతో నష్టం జరుగుతుందనే నిర్ణయానికి బాబు వచ్చారని చెబుతున్నారు. మరి రాజకీయంగా కూడా సీఎం యాక్టివేట్ అయితే… ఏపీలో రాజకీయం మారుతుందా ? హీట్ పెరుగుతుందా అనేది చూడాలి !

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title