ప్రశ్నకే డౌటొస్తే…  

Written by

వెళ్లాలనుకున్నప్పుడు వెళ్తాం… చెప్పాలనుకున్న డైలాగ్ చెప్తాం… మూడ్ లేదూ…అంతే గాయబ్. అడిగేవాడు లేడు. మన లైఫ్. మన స్టైల్. ఇది సినిమా రాజకీయం అలా కాదు. ఇరవై నాలుగ్గంటలూ రాడార్ లోనే ఉంటాం. ఏం జరిగినా స్పందించాలి. ఓపిగ్గా ఉండాలి. ఓ మాట మాట్లాడుతున్నాం అంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోవాలి. ఇవన్నీ సూటయ్యే సంగతులేనా పవన్ కల్యాణ్ కి ! ప్రెస్ మీట్ పెట్టిమరీ మాట్లాడిన తర్వాత ఈ డౌట్ ముదిరింది.

పవన్ లాంటి గ్రావిటీ ఉన్న పర్సనాలిటీలు కచ్చితంగా మిస్ కాకూడదని క్లారిటీ. మొన్న మాట్లాడిన తీరు చూశాక… అసలు క్లారిటీ ఉందా ఏం చెప్పాలనుకున్నాడో ఏం చెప్పాడో అనే అనుమానం వచ్చేసింది అభిమానులకి కూడా ! విజయనగరం ఆనంద్ సాయిని ఆర్కిటెక్ట్ గా పెట్టి సమైక్య స్ఫూర్తికి కృష్టిచేస్తున్న తొలి వ్యక్తి కేసీఆర్ అంటూ సెటైర్ వేద్దామనుకున్నాడు పవన్. కానీ మిస్ ఫైరైంది. ఏం చెప్పాలనుకున్నాడో విషయం ఎవరికీ అర్థంకాలేదు. పైగా ఫస్ట్ డైలాగ్ తోనే ఏపీలో నెగెటివ్ కొట్టింది. మరి… రాజధాని మీద, ఆంధ్రప్రాంత విశిష్టతపైనా సుద్దాల అశోక్ తేజతో పాట రాయించింది కదా ఏపీ… ఆ సంగతి తెలియదా అంటూ సైడ్ ప్రామ్టింగ్ మొదలైపోయింది. అదిమొదలు.. ప్రతి విషయంలోనూ రెండుపక్కలా ఎడాపెడా ప్రశ్నలే ! కరివేపాకంటూ కొందరు… మాట్లాడితే మా స్థాయే తగ్గిపోతుందంటూ కొందరు ముప్పేట దాటి మొదలుపెట్టారు పొలిటికల్ లేత కల్యాణ్ మీద !

అసలు పవన్ ప్రోబ్లమేంటి ? 

మొన్నటి స్పీచ్ కాస్త పక్కన పెడదాం. అసలు పవన్ పర్సనాలిటీ సంగతి చూద్దాం ! ఆలోచన… భావోద్వేగం… మైండ్ సెట్ ఇవన్నీ ! ఎవరో ఏదో అన్నారని ఊగిపోయి… ఉత్తరీయం వేసుకొని వెళ్లి మరీ పోలీస్ స్టేషన్ లో రివాల్వర్ హ్యాండోవర్ చేసిన సీన్ గుర్తుందా ? అదీ పక్కాగా పవన్ కల్యాణ్ అంటే ! ఆవేశంతో రగిలిపోవడం…అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత ఆసంగతే వదిలేయడం కామన్ మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్ లాగా అనమాట. యువరాజ్యం అధ్యక్షుడివి నువ్వు… మరి ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయిపోతే నువ్వెక్కడ ? విలీనం మీద వైఖరేంటో చెప్పావా… నువ్వేమనుకుంటున్నావో… ఏం చేయబోతున్నావో తెలుసా ఎవరికైనా ? పంచెలూడగొడతానన్న డైలాగ్ కి…మౌనంగా అజ్ఞాతంలోకి వెళ్లి పోవడానికీ మధ్య పట్టుమని రెండేళ్ల గ్యాప్ కూడాలేదు. ఆలోచనల్లో ఇంత ఎత్తుపల్లాలున్నవాడు రాజకీయాలకి సూటవుతాడా? డౌట్ !

ఎందుకిలా ? 

పవన్ని పరిస్థితులకన్నా ఎమోషన్ ఎక్కువ కదిలిస్తుంది. కుదిపేస్తుంది. అందుకే ఉవ్వెత్తున లేవడానికి ఎంత సేపు పడుతుందో ఠపీమని పడడానికి అంతటైమ్ కూడా పట్టదు. బ్యాలెన్స్ తక్కువ. కాదుకాదు అస్సల్లేదు. ఇదేఅసలు సమస్య. రోడ్డు మీద వెళ్తున్నవాడు చెప్పిన మాటని కూడా మనసుకి తీసుకుంటే నువ్వేం రాజకీయం చేస్తావ్ ? ఈ సంగతి ఎవరో అన్నది కాదు. మొన్న మాట్లాడిన ప్రెస్ మీట్ లో పవన్ కోట్ చేసిన విషయమే ఇది.  నిన్ను డిస్ట్రబ్ చేయడం చాలా ఈజీనని అర్థమైపోయాక మనశ్శాంతి ఉండదు విమర్శల దెబ్బకి. ప్రశాంతత లేనివాడు జనం అశాంతిని అడ్రెస్ చేయడం అయ్యేపనేనా? పైగా రాజకీయం అంటే ఒక్క రోజులోనో ఏడాదిలోనో జరిగిపోయేది కాదు. మన చేతిలో గన్ కాదు సొసైటీ అంటే, పేలిస్తే పేలడానికి… వద్దంటే ఆగడానికి ! మార్పు రావాలన్నా…. నమ్మకం కుదరాలాన్నా… నువ్వు కుదురుకోవాలన్నా సమయం పడుతుంది. ఎంత అనేది మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఇలా ఎడా పెడా రాష్ డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్లు అవుతాయ్ తప్ప లాభం లేదు.

నీ సంగతి తేలుస్తా… ఏమనుకుంటున్నావ్… నేను తల్చుకుంటే ఏం చేస్తానో తెలుసా…. అంటూ ఎదుటివాడికి వార్నింగ్ ఇచ్చి… చివరికి మా ఆవిడతో చెబుతా అంటే ఎలా ఉంటుంది ? పవన్ రాజకీయం కూడా ఇంచుమించు ఇంతే ! పవన్ తో పెద్ద సమస్య… గందరగోళం. ఎందుకు మొదలు పెడతాడో ఎక్కడ ఆపుతాడో అర్థం కాదు. రాజధాని విషయమే తీసుకోండి. హడావుడిగా వెళ్లాడు. నిలదీస్తానన్నాడు. రైతుకి అన్యాయం జరిగితే ఉపేక్షించబోమన్నాడు. అభిమానంతో రైతులు పెట్టిన పెరుగన్నం తిన్నాడు. ఓకే. సాయంత్రం తీరిగ్గా ఓ మాట చెప్పాడు. మీ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని. అంతే…పొద్దున్నుంచి ఊదిన బుడగకి సాయంత్రం చిల్లు పొడిచినట్టు ఉందీ మాట. అక్కడి పరిస్థితి ప్రభుత్వానికి తెలీదా?  రైతులకి తెలియదా ? మంత్రులు కూడా అక్కడే ఉండి సమీకరణ చేశారు కదా మళ్లీ నువ్వు చెప్పేదేంటి ? నువ్వొచ్చి ఉపయోగమేముంది ? ఆ ఒక్క  డైలాగ్ తో గుంటూరు టూర్ గంగలో కలిసింది.

గెలిచేవాడు కాదు గెలిపించే వాడు నాయకుడు ! 

ఈ డైలాగ్ కొట్టిననాడే ఓ కన్నేసి ఉంచుతారు ఎవరైనా ! మనం ఏపాటి నాయకులో తేల్చడానికి. ఏం మాట్లాడుతున్నాం… ఎవరిని ప్రశ్నిస్తున్నాం… ఏమని అడుగుతున్నాం…రాజకీయాన్ని కుదిపేసే ఘటన ఒకటి జరిగినప్పుడు మన రియాక్షన్ ఎలా ఉందనేది చూస్తారు మరి. అయినా ఏడాదిగా ఏం చేశారని చూపిస్తున్నావ్ కదా వేలెత్తి. మరి నువ్వేం చేసినట్టు ? మోడీతో సాన్నిహిత్యం ఉంది కదా… ప్రత్యేకంగా ఆహ్వానించి ఎదురొచ్చి మరీ ప్రమాణ స్వీకారానికి తోడ్కొని వెళ్లారు కదా ! మరి హోదా విషయం నువ్వే వెళ్లి ఢిల్లీలో నిలదీయొచ్చు కదా ? ఎందుకు ఆ పని చేయడం లేదు ? ఏపీకి బాధ్యుడుగా ఉంటానన్నప్పుడు ఇలాంటివి చేయకుండా, సెక్షన్ 8కి వ్యతిరేకం లాంటి డైలాగ్ లు కొడితే వ్యవహారం మొదటికే చెడుతుంది.

పవన్ కి రాజకీయం అవసరమా ? రాజకీయానికి పవన్ అవసరమా ? 

స్వచ్ఛమైన మనసుంది. అంతులేని అర్ద్రతుంది. కదిలించే ఇమేజ్ ఉంది. కదిలొచ్చే తత్వమూ ఉంది. ఇన్ని ఉండి ఏం లాభం ఐదోతనం లేకపోతే ! రాజకీయాల్లో ఎవరికీ స్పందించే గుణంలేదు. సవాలక్ష లెక్కలేసుకొని అంతా అయిపోయాక బూడిద ఎత్తిపోసేందుకు యాత్రలు చేస్తున్నారందుకే ! నీకుంది. కానీ దానికి తగ్గ నిబద్ధత లేదు. నిలబడాతావన్న నమ్మకం జనానికి కాదు కదా అభిమానులకి కూడా కల్పించలేకపోతున్నావ్. గురి పెడితే ఎవరిని కొడతాడో తెలియని వాడితో అందరికీ భయమే. ఎవరికీ లాభం లేదు.

ఏపీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రశ్నించే నాయకుడు కావాలి. సాధించే యోధుడు కావాలి. పోరాడే ధీరుడు ఉండాలి. మీ వైపు నేనున్నా అనే భరోసానే కొండంత బలం. పడిలేస్తున్న సమయంలో తప్పటడుగులు కాదు కావాల్సింది కష్టాన్ని తప్పించే అడుగులు. నష్టం నుంచి గట్టెక్కించే అడుగులు. వీలైతే అలాంటి పాదముద్రలేద్దాం. నిద్రలేద్దాం ! లేదంటే మనలోకంలోకి మనం జారుకుందాం ! నిర్మాణాత్మకంగా లేనప్పుడు…. నీది యోగ ముద్రో గాఢ నిద్రో… ఏదైనా జానానికి ఒరిగేదేముంది జానీ…!!

– అభి

Comments

comments

Article Tags:
· · · · · · · ·
Article Categories:
Anything Everything

Comments

Menu Title