దొరగారి బంపర్ ఆఫర్… 24గంటలు హ్యాపీ అవర్

Written by

ముందుకెళ్లి కుడిపక్కకి తిరుగు అని చెప్పడానికి వెనకవైపు… ఎడంపక్కకి చూపిస్తాడు ఎమ్మెస్ ఓ సినిమా. అదేంటి బాబాయ్ రివర్స్ లో చెప్పావ్ అంటే… అదో టెక్నిక్ రా ! తాగుబోతులకీ ఓ భాష ఉంటుంది. ఇలా రివర్స్ లో చెబితేనే ఎక్కుతుందంటాడు. ఔనా అనిపించింది కానీ ఇపుడు కొత్త పాలసీ చూస్తే డౌట్ లేదు నిజమే అనిపిస్తోంది. తాగుడు తగ్గిస్తానన్న వాగుడు విన్నాక… అవునా ఎలాగా అనుకున్నారు. కానీ ఇపుడు తెలుస్తోంది ఆయన తగ్గిస్తానన్నది తాగుడు కాదు రేటు అని. అందుకే చెప్పిన మాటకి కచ్చితంగా రివర్స్ లో రేటు తగ్గించాడు. కిక్కు పెంచాడు. డౌట్ ఇపుడు ఆల్ క్లియర్ అయిపోయింది.

30 రూపాయలకే అరచేతిలో స్వర్గం !

ఎవడైనా అలవాటు మాన్పించాలంటే… నష్టాన్ని తగ్గించాలంటే కంట్రోల్ చేయాలనుకుంటాడు. ఎమ్మెస్ చెప్పినట్టు ఈయనది రివర్స్ గేర్. కంట్రోల్ ఎత్తేశాడు. చీప్ గా చీప్ లిక్కర్ ఇస్తానంటూ 30 రూపాయలకే స్వర్గాన్ని నేలకి దించుతానంటున్నాడు. దీనబాంధవుడు అవ్వాలంటే ఈ మాత్రం ఉండాలి. రెండు రూపాయలకి బియ్యం ఇచ్చినోళ్లని చూశాం..పండగ చేసుకోమంటూ పప్పూఉప్పూ పంచినోళ్లని చూస్తున్నాం. ఈయన మాత్రం ఆ రెండూ కాకుండా కామన్ మేన్ కి కెనెక్ట్ అయ్యేందుకు షార్ట్ కట్ ఎంచుకున్నాడు. జస్ట్ 180ఎల్ ఇచ్చి సంతోషంలో ముంచుతానంటున్నాడు.

గొప్పోడండీ !

30రూపాయలకే మూడు పెగ్గులంటూ పేదల్ని ఉద్ధరించేందుకు పరమాత్ముడు ప్రవేశపెట్టిన స్కీమ్ నిజానికి ఆయన డ్రీమ్. నిజంగానే ! మనం ఒక్కళ్లమే సుఖపడితే సరిపోయిందా… జనాన్ని కూడా అలా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా అనే ఆలోచన నుంచి పుట్టిందే ఈ పాలసీ.
ఇప్పటి వరకూ వంద రూపాయలు ఖర్చుపెట్టాల్సొచ్చిన చీపుసరుకు ఇపుడు 30 రూపాయలకే దొరుకుతుంది. అంటే వందకి మూడింతలు. కిక్కు డబుల్ కాదు ఏకంగా ట్రిపుల్ అవుతుంది. అంటే తాగుడు ట్రిపుల్… వాగుడు ట్రిపుల్. ఒళ్లు గుల్లైపోవడం… పని పక్కకిపోవడం లాంటివి సరే. పాపం వీటితోపాటు ప్రాణం మీదకి తెచ్చుకునే డేంజర్ కూడా ట్రిపుల్. సారు మాత్రం ఇవేం పట్టించుకోరు. నిజానికి ఆయన కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయనకి రేటు, పాలసీతో సంబంధం లేకుండా రోజూ కిక్కేకిక్కు కదా !

ఎవడన్నా కోపంగా చర్య తీసుకుంటాడు. కసిగా కంట్రోల్ చేస్తాడు. కానీ వీడేంట్రా… ఏదో పోలియో డ్రాపులు వేసినట్టు… నీరసంలో ఉన్నవాళ్లకి ఓఆరెస్ (అరె పార్టీ పేరు కూడా ఇలాంటి రిథమ్ లోనే ఉంటుంది లెండి !) పట్టించినట్టు… చాలా శ్రద్ధగా దృష్టిపెట్టాడ్రా ! ఎంతైనా ఆడు మన టైపేరా బుజ్జా ! అని సరిపెట్టుకోవాలి… పాకల్లో కూచ్చొని పాడైపోతున్నోళ్లు.

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title