పార్లమెంటులో మన ఎంపీలు డమ్మీలేనా ? ఆ ఒక్కడు తప్ప…

Written by
parlament-ap-mp-s

ప్రత్యేక హోదా రాదని కేంద్రం తేల్చిచెప్పేసింది. ఏ రాష్ట్రానికీ హోదా ఇచ్చే అవకాశమే లేదని కేంద్రం లోక్ సభలో ప్రకటన చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో… బీహార్ కే కాదు ఎవరికీ హోదా ఇవ్వలేమంది. ఎన్నికలొస్తున్నాయని బీహార్ కి ప్రత్యేక హోదా ఇస్తున్నారన్న ప్రచారంలో నిజం లేదు… ఇస్తున్నది ప్రత్యేక ప్యాకేజీ మాత్రమేనని తేల్చిచెప్పేసింది. ఓ రాష్ట్రానికిస్తే మరో రాష్ట్రం… ఆ తర్వాత ఇంకొకరు క్యూ కడతారని ప్రస్తుతానికి అలాంటి తేనెతుట్టెను కదపదల్చుకోలేదని మంత్రి ఇంద్రజిత్ సింగ్ తెగేశారు. హోదా వస్తుందా రాదా అనేది ఇన్నాళ్లూ అనుమానం. సాయం చేస్తాంగానీ అది హోదానా కాదా అనేది చెప్పలేమంటూ కేంద్రంలో మంత్రులుగా ఉన్న ఆంధ్రులు చెబుతున్న మాటల్లో అసలు నిజమెంతో ఇపుడు బైటపడింది. ఏపీ ఆశల మీద నీళ్లు చల్లింది.

ఇక్కడ అదరగొడతారు… అక్కడ బెదిరిపోతారు…

ప్రత్యేక హోదా రాదన్న పాపంలో అందరూ భాగస్వాములే. కేంద్రం మెడలు వంచుతామంటూ బెజవాడలో ప్రకటనలు చేసే టీడీపీ ఎంపీలు లోక్ సభలో నోరెత్తలేదు. కనీసం లేచి నిలబడి నిరసన తెలిపే ప్రయత్నం కూడా చేయలేదు. మనకి సంబంధం లేదన్న విషయం అన్నట్టు ఉండిపోయారు. బీహార్ రాజస్థాన్ లాంటి రాష్ట్రాల ఎంపీలన్నా కాస్త హంగామా చేశారు కానీ మన అధికార పార్టీ ఎంపీలు మాత్రం

మన్నుతిన్న పాముల్ని మించిపోయారు. తొలిసారి ఎంపీ రామ్మోహన్ నాయుడు మాత్రం మినహాయింపు. రిప్లై ఇచ్చేటప్పుడు నిలదీసే ప్రయత్నం చేసి తెలంగాణ ఏపీ ఆర్థిక పరిస్థితిని పోల్చి చూపిస్తూ మాట్లాడాడు. తర్వాత పార్లమెంటు ప్రాంగణంలోనూ వినిపించిన ఏకైక గొంతు రామ్మోహన్ దే ! అటు పదో తారీఖున జంతర్ మంతర్ దీక్ష చేస్తానంటున్న జగన్ పార్టీ కూడా మూగసినిమా చూసింది. కనీసం ఒక్కరంటే ఒక్క ఎంపీ కూడా నోరు మెదపలేదు. అధికార పార్టీ ఏం చేస్తోంది ఏం చేస్తోందంటూ ఇక్కడ గట్టిగట్టిగా పేలే మాటలన్నీ అక్కడ మాత్రం మ్యూట్ లోకి వెళ్లిపోయాయ్. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతోందే కనీసం నిరనస తెలియజేద్దాం… మేమూ ఈ సభలో ఉన్నామన్న సందేశం ఇద్దాం… మన జనం కూడా చూస్తారన్న ఇంగితం కూడా వీళ్లకి ఉన్నట్టు కనిపించలేదు ఆ సైలెన్స్ చూస్తుంటే !

దొందు దొందే !

ఏపీ గొంతు కోయడంలో బీజేపీకి కాంగ్రెస్ కి పెద్ద తేడా లేదు. ఐదేళ్ళు ప్రత్యేక హోదా అంటే ఐదు కాదు… పది అంటూ మన వెంకయ్య నాయుడే చప్పట్లు కొట్టించుకున్నారు. ఆ చప్పట్లవేడి ఇపుడు చల్లారిపోయింది. ఎన్నికల ముందరి రాజకీయం ఇపుడు చప్పబడిపోయింది. అందుకే ఆయన కూడా అసహనం చూపిస్తున్నారు ప్రత్యేక హోదా మాటెత్తితే. కాంగ్రెస్ రాజకీయం ఇంకా నెరజాణ తనం. ప్రత్యేక హోదా అంటూ ప్రకటనలు చేసి… కనీసం విభజన చట్టంలో అయినా చేర్చలేదు. మధ్యమధ్యలో ఏపీ గుర్తొచ్చినపుడు మాత్రం హోదా అంటుంది. మరి ఇవాళ ఎందుకు నిరసనకి దిగలేదు ? నిన్నగాక మొన్న అనంతపురం వచ్చినపుడు కూడా రాహుల్ పెద్దపెద్ద ప్రకటనలు చేశాడు. అదంతా ఏమైపోయింది ఇవాళ పార్లమెంటులో? ఎవరి పబ్బం గడుపుకొనేందుకు వాళ్లు హోదా గోదాని వాడుకుంటున్నారు తప్ప ఏపీ మీద ధ్యాస ఎవ్వరికుంది ?

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title