పట్టిసీమ మీద కేసీఆర్ కు ఎందుకు దుగ్ధ?

Written by

పట్టిసీమ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 కల్లా ప్రారంభించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. గోదావరిలోని వరద నీటిని కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీకి తరలించాలని ఆయన భగీరథ సంకల్పంతో ఉన్నారు. ఇప్పటికే పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ దాకా వచ్చే కాలువ చాలా వరకు పూర్తయింది. మరికొంత దూరం కాలువు తవ్వితే పట్టిసీమ నీటిని కృష్ణా డెల్టాకు తరలించవచ్చు. కృష్ణా డెల్టా రైతులు నాగార్జున సాగర్ వైపు చూడాల్సిన అవసరం లేకుండా చేయాలన్న సంకల్పం చాలా గొప్పది. ముఖ్యంగా కరువు వచ్చిన సందర్భాల్లో సాగర్ లోకి నీరు రావడం లేదు. ఫలితంగా డెల్టా బీడుగా ఉండే పరిస్థితి ఉండేది. ఈ స్థితిని పట్టిసీమ పోగొడితే అంతకంటే కావాల్సింది ఏముంటుంది?

పోలవరాన్ని పూర్తి చేయకుండా పట్టిసీమ కట్టడం ఏమిటనే ప్రశ్న వస్తోంది? విపక్షాలు ఇదే మాట అడుగుతున్నాయి. పోలవరాన్ని అటకెక్కించడానికి చంద్రబాబు పట్టిసీమను తెరమీదకు తెచ్చారని ఆరోపిస్తున్నారు. పోలవరాన్ని పూర్తి చేయకుండా ఆపేస్తే చంద్రబాబుకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా? నష్టం మాత్రమే ఉంటుంది.

అయితే పోలవరాన్ని పూర్తి చేయడానికి సమయం పడుతుంది. వేల కోట్ల రూపాయలు అవసరమైన ప్రాజెక్టు అది. ఆ ప్రాజెక్టు పూర్తికి ఇంకో ఐదేళ్లు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈలోపు పట్టిసీమ ద్వారా కొంత వరకైనా గోదావరి వరద నీటిని వినియోగించుకుందామని ప్రయత్నించడం తప్పెలా అవుతుంది?

ఏపీలోని విపక్షాలే కాదు.. తెలంగాణ ప్రభుత్వం కూడా పట్టిసీమను వ్యతిరేకిస్తోంది. తెలంగాణ రాష్ట్రంతో సంబంధం లేని ప్రాజెక్టుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు గోదావరి నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. ఈ ప్రాజెక్టు తమ అభ్యంతకరమని ఆ లేఖలో చెప్పింది. దీని మీద ఏపీ జలవనరుల శాఖ.. ప్రతిస్పందన ఇచ్చింది. పట్టిసీమ ఏపీలో అంతర్భాగం. ఈ ప్రాజెక్టుతో తెలంగాణాకు గానీ, ఛత్తీస్ గఢ్, ఒడిశాలకు గానీ ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. కేవలం గోదావరి వరద నీటిని వినియోగించుకునేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు పట్టిసీమ అని వివరించింది.

ఏపీకి ఏదో ఒక విధంగా నష్టం కలిగించాలన్న ఆలోచన కేసీఆర్ కు ఉన్నట్లు ఉంది. ఆయన తన రాష్ట్రంతో సంబంధం లేని ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏమిటి? తెలంగాణ ప్రభుత్వం.. అసలే నీళ్లు లేని కృష్ణా నదిపై రెండు ప్రాజెక్టులకు ఒకేసారి శంకుస్థాపన చేసింది. వీటి మీద ఏపీ సర్కార్ కేంద్రానికి లేఖ రాస్తే.. టీఆర్ఎస్ ఏకంగా మహబూబ్ నగర్ జిల్లాలో బంద్ చేసింది. తెలంగాణాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పట్టించుకోకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ ను ఇరుకున పెట్టడానికి కేసీఆర్ పాలమూరు, డిండి ప్రాజెక్టులను తెరపైకి తెచ్చారన్న విమర్శ ఉంది.

రాష్ట్ర విభజన ద్వారా ఏపీకి కలిగించిన నష్టం చాలు. కేసీఆర్ అండ్ కో ఇకమీదట అయినా.. ఏపీ మీద పడి ఏడవకుండా ఉంటే అదే పదివేలు. సీమాంధ్రులు మట్టిని మాణిక్యాలు మార్చగలిగిన సత్తా ఉన్న వారు. వారితో పోటీ పడటానికి ప్రయత్నించాలి గానీ.. అసూయ వల్ల సాధించేది ఏమీ ఉండదు. కష్టపడే వాడిని ఎడారిలో పడేసినా తిమిరం నుంచి తైలం తీస్తాడనే విషయాన్ని విస్మరించొద్దు.

 

 

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title