పట్టిసీమ తొడగొడితే… దడపుట్టే దెవరికి ?

Written by

ఏడాది తిరిగే లోపు పూర్తిచేసి తీరుతామని ప్రకటించిన ప్రాజెక్ట్… పట్టి సీమ జాతికి అంకితమవుతోంది. నీళ్లు లేనప్పుడు… రానప్పుడు జాతికి అంకితం ఇచ్చి ఏం సాధిస్తారని విమర్శలు విసురుతున్నారు కొత్తగా. అసలు పట్టిసీమ పుట్టుక మొదలు ఇప్పటి వరకూ ప్రయాణం అంతా ఇలా విమర్శలకి ఎదురొడ్డుతూనే ఉంది. ఘాటుగా సమాధానం చెబుతూనే ఉంది. ఇప్పుడు వినిపిస్తున్నవి బహుశా చివరి విమర్శలు. ఎందుకంటే రేపోమాపో ప్రాజెక్టు పరవళ్లుతొక్కడం మొదలైపోతే ఇక మాట్లాడ్డానికి అవకాశం ఉండదు. నోరెళ్లబెట్టాల్సిందే !

క్రిష్ణా డెల్టా కష్టాన్ని పూడ్చేందుకు..రాయలసీమ కరువు తీర్చేందుకు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ పట్టిసీమ. క్రిష్ణానీళ్లు డెల్టా వరకూ రావడానికి సెప్టెంబర్ వరకూ సమయం పడుతోంది మామూలుగా. ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు నిండి మన దగ్గరకొచ్చాక పంటలు వేస్తున్నారు క్రిష్ణా డెల్టా రైతులు. సరిగ్గా పంట పదునుకొచ్చేసరికి నవంబర్ డిసెంబర్లలో తుఫానొచ్చి కొట్టేస్తుంది. నీరొచ్చి ఉపయోగం లేదు. పంటేసి ప్రయోజనం కనిపించదు. ఇలాంటి కష్టానికి పరిష్కారం పట్టి సీమ. గోదావరి జలాల్ని పోలవరం కోసం తవ్విన కుడికాల్వ నుంచి క్రిష్ణాడెల్టాకి ప్రకాశం బరాజ్ ద్వారా చేరేసే ఎత్తిపోతలే పట్టిసీమ. గోదావరి జిలాలొస్తే జూలై నాటికే పంటలేయొచ్చు డెల్టాలో. గోదారిలో నీళ్లుకూడా క్రిష్ణా కంటే రెండు నెలల ముందొస్తాయ్ కాబట్టి వాటంగా వాడుకోవచ్చు. ఇక శ్రీశైలం నుంచి డైల్టాకిచ్చే నీటిని రాయలసీమకి మళ్లించొచ్చు. అక్కడి కరువు తీర్చొచ్చు. అంటే మూడు ప్రాంతాల మధ్యా జలాల సర్దుబాటు జరుగుతుంది. సీమ జలాలు సీమకి… గోదావరి జలాలు అటు క్రిష్ణా డెల్టాని సస్యశ్యామలం చేస్తాయ్. వాడేది మిగులు జలాలే కాబట్టి గోదావరి డెల్టాకి వచ్చిన ఇబ్బంది కూడా లేదు. ఇదీ సింపుల్ గా పట్టిసీమ స్టోరీ.

సీమాంధ్ర జీవధార… పట్టిసీమ

పట్టిసీమ సముద్రంలోకెళ్లే వరదని కృష్ణా బేసిన్ కు మళ్ళించే ప్రాజెక్ట్, గోదావరి డెల్టాకు నీరిచ్చాకే వరదని ఎత్తిపోస్తారు. గోదావరి డెల్టాకి నో ఇబ్బంది.109 రోజులపాటు పట్టిసీమ తోడేది రోజుకు 1 టిఎంసినే. ప్రకాశం బరాజ్ తో క్రిష్ణా డెల్టాకి నీరొస్తే… తాగు, సాగు అవసరాలు తీరి… భూగర్భ మట్టమూ పెరుగుతుంది. పట్టిసీమతో కృష్ణా డెల్టా మొదటి పంటకి నీరిస్తే… డెల్టాకి శ్రీశైలం నుంచి రావాల్సిన 70టిఎంసి రాయల సీమకిస్తారు. జూలైలోనే నీటి ఎద్దడొస్తే తట్టుకోడానికి పట్టిసీమే దారి. పట్టిసీమకి విద్యుత్ కూడా పెద్దగా ఖర్చుకాదు. ఏపీలో కోతల బెంగే లేదు. 10నెలలు పుష్కలంగా నడిచే సీలేరు నుంచి 123మెగావాట్లు తీసుకోవడం పెద్దలెక్క కాదు. ఇక కుడి కాలువకు మళ్ళించే నీటిలో ఎగువ రాష్ట్రాలు హక్కుకోరితే అనేమాటే అసంబద్ధం. ఇది పోలవరంలో అంతర్భాగం. క్రిష్ణాజలాల్లో ఎగువరాష్ట్రాలకి వాటాలిచ్చాకే.. పోలవరానికి అనుమతొచ్చాయ్. అలాంటప్పుడు లేనిపోని బూచిలెందుకు ?

ఎందుకింత పట్టు పట్టి సీమ ?

ఏటా ఉద్ధృత గోదారి సముద్రంలోకి ఉరకలేస్తోంది. వేల టీఎంసీలు సాగరంలో కలిసిపోతున్నాయ్. అది పైన దృశ్యమ్. ఇక దిగువన రాయల సీమని బైపాస్ చేసి… క్రిష్ణా నీళ్లు డెల్టాకొస్తున్నాయ్. అంటే పైన వృధా..దిగువన దగా ! ఇలాంటి పరిస్థితిని వాటంగా సర్దుబాటు చేసే ఏర్పాటిది. వదర జలాల ఆధారంగా… సాగే మళ్లింపు. పోలవరం లాంటి బడా ప్రాజెక్ట్ కట్టేందుకు ఐదారేళ్లు పడుతుంది కాబట్టి ఇప్పటికిప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఏడాదిలో పూర్తయితే కనీసం ఏడెనిమిది పంటలు కాపాడుకున్నట్టే. క్రిష్ణా డెల్టాలో సాలుకి 1500 కోట్ల పండుతుందనుకున్నా పట్టిసీమ పెట్టుబడి ఏడాదిలో తిరిగొస్తుంది. సీమ దాహం తీరుతుంది. ఇలాంటి దానికి కూడా దిక్కుమాలిన రాజకీయం కాలడ్డుపెడితే ఏం చేయాలి ? ఇదే కదా ఏపీ దౌర్భాగ్యం అనుకోవాలా ? ఏపీ కొత్తగా అడుగులేయడం మొదలు పెట్టిన తర్వాత ఓం ప్రథమంగా చేపట్టిన ప్రాజెక్ట్ పట్టిసీమ. ఇదో సెంటిమెంట్. మన సమస్యకి మనం చేసుకుంటున్న ట్రీట్మెంట్. దీన్ని కూడా అడ్డుకుంటూ లేనిపోని సందేహాలు వెజదల్లే ప్రయత్నం చేసిన వారికి పట్టిసీమ ఢంకాబజాయించి ఇదిగో సమాధానాలు చెబుతోంది.

పోలవరం కుడికాలువ పరిధిలోని కాలువ తవ్వకం పనులు వాయువేగంతో జరుగుతున్నాయ్. మరో వారం రోజులు పట్టొచ్చు. తాడిపూడి ఎత్తి పోతల నుంచి నీరు ఎటు మళ్లుతుందంటూ వ్యక్తంచేస్తున్న అనుమానాల్లో కూడా క్లియర్ అవుతున్నాయ్. గోపాలపురం మండలం గుడ్డిగూడెం వద్ద పైపు కల్వర్ట్ క్లియరెన్స్ దశకొచ్చిందంటున్నారు. పశ్చిమ రైతులకి అన్యాయం జరగదని.. అక్కడివాడకం పూర్తయ్యాక నీరు దిగువకంటున్నారు. అంటే అడ్డంకులు దాటి… అవరోధాలు అధిగమించి… అంచనాలను మించి… శివుడి జటాజూటం నుంచి గంగ దూమికినట్టు పట్టిసీమ నీరు క్రిష్ణా డెల్టాకి పోటెత్తబోతోంది. రాష్ట్రమంతా పండగ చేసుకోవాల్సిన తొలి విజయం ఇది. ఇది కొత్త ఏపీ చేస్తున్న తొలి సంతకం.

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title