నమో… అంటే నమ్మించి మోసం చేయడమా ?

Written by

బీహార్ కి 50 వేల కోట్ల ప్యాకేజీ… మరి ఏపీ లగేజా ? స్పెషల్ ప్యాకేజీ ఇస్తాం..ప్రత్యేక హోదా ఇస్తాం అంటూ తిరుపతి లో విశాఖలో వీలైన చోటల్లా మోతమోగించిన మోడీ ఇపుడు మొహం చాటేశారు. అక్కడితో ఆగినా అదో రకం. బీహారెళ్లి 50 వేల కోట్ల ప్యాకేజీ ఇస్తానంటున్నాడు. అంటే ఎన్నికలంటే ప్యాకేజీలు తాయిలాలు ఇస్తారు. ఎన్నికలైపోతే పట్టించుకోను కూడా పట్టించుకోరా? నమో అంటే ఇదేనా ? నమ్మించి మోసం చేయడమా ? ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలు గొడవ చేస్తాయంటారు. మరి బీహార్ కి ప్రకటించేప్పుడు మాత్రం ఆల్ క్లియర్ గా ఉందా అంతా ? ఎన్నికలుంటే మాత్రం లెక్కలేమీ అడ్డం కాదా ? నూకలు చల్లి పావురాలకి ఎరవేయడమే మోడీ రాజకీయం అని పట్నా ప్రకటన ప్రూవ్ చేస్తోంది.

సొంత డబ్బాలు కొడుతోంది కాంగ్రెస్. నేను అలా కాదు. మీ బాధ నాకు తెలుసు… అన్యాయం జరిగింది ఏపీకి… ప్రసవంలో బిడ్డని కాపాడి తల్లిని చంపేశారంటూ సెంటిమెంట్ పండించిన మోడీ ఇంకా గుర్తున్నారు ఏపీకి. 14 నెలలైంది. మరి ఇటువైపు చూడను కూడా చూడరేంటి ? ప్యాకేజీ అనే మాట లేకుండా సాయం చేస్తాం… అంటూ బుజ్జగిస్తారు ఎప్పటికప్పుడు… ఏం ఏపీని ఆదుకోవడం అంటే చిన్నింటి చేసే సాయమా ? అప్పటికప్పుడు జేబులోంచి తీసివ్వడానికి ? కడుపు మండుతోంది కుళ్లు రాజకీయం చూస్తుంటే. నేను గుజరాత్ మోడల్ చూపిస్తా అంటే ఏంటో అనుకున్నాం. పనైపోయాక పరారైపోవడమే… ఎవరేమన్నా దులిపేసుకు పోవడమే గుజరాతీ నీతా అనుకోవాల్సివస్తోంది మోడీ తీరు చూస్తుంటే.

పంజాబ్ కి 20 వేల కోట్ల ప్రాజెక్టులు ప్రకటిస్తారు. వచ్చే ఏడాది ఎన్నికలు కాబట్టి. యూపీ చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రకటనలు చేస్తారు. అక్కడా ఎన్నికలు వస్తున్నాయని. ఇపుడు బీహార్. మరి ఎన్నికల ముందే ఏపీ వైపు చూస్తారా ? ఈ లోగా జనంలో సహనం నశించి… ఆశలు వదిలేసుకుంటే నేనొచ్చానంటూ శాంటాక్లాజ్ ఫోజు పెడతారన్న మాట. ఈలోగా ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత వస్తుంది కాబట్టి రాజకీయంగా కలిసొస్తుందని లెక్క. ఇదిగో ఇన్ని చేశాం… ఇంకా చేస్తాం అంటూ మళ్లీ బొచ్చతో రెడీ అవుతారనన్నమాట. ఇంతేనా ? ఏపీకి అర్థమవుతున్నాయ్ వాస్తవాలు… అందుకే ఢిల్లీ టూర్ల కన్నా విదేశాల్ని సొంత కష్టాన్ని నమ్ముకుంటోంది నిలబడేందుకు. మోడీ ట్రిక్కులు చూసి ఇకనైనా తెలుసుంటే బెటర్. అబ్రివేషన్ గోడమీద రాసుకుంటే నయం… నమో అంటే నమ్మించి మోసం చేయడం అని !

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title