త్యాగరాజ సంగీతలహరి

Written by

భారత దేశం వేద భూమి ఇక్కడ కొండలు చెట్లు నదీ నదాలు అన్నీ దైవ సమానమే . గంగ, కృష్ణ , గోదావరి, యమున, సరస్వతీ, కావేరి వంటి ఎన్నో జీవనదులు ఈ నేలను సస్యశ్యామలం చేస్తున్నవి. పూర్వం నదీ నదాలలో, కొండ కోనలలోనే నాగరికత వెల్లివిరిసింది. నాగరికత ఒకటేమిటి.. సంగీత సాహిత్యాలు భక్తి అన్నీ నదీ తీరాలలోనే పురుడు పోసుకున్నాయి. “అదిగో భద్రాద్రీ గౌతమి ఇదిగొ చూడండి” అని మన రామదాసు వారు అమిత భక్తి ప్రపత్తులతో మన గోదావరీ నదీమతల్లి తీరాన ఉన్న భద్రగిరి రామయ్య మీద ఎన్ని భక్తి గీతాలు రచించారు.

బహుశా గోదావరి నదీ జలాలు అయనను , అయనలోని భక్తిని ఉత్తేజితం చేసాయేమో. ఇలాగే కావేరి నదీ తీరములో అపర విష్ణు భక్తులైన ఆళ్వారుల భక్తి గాథలు..ఆండాళ్ దివ్య భక్తి ప్రబంధ పాశురాలు.. కర్ణాటక సంగీతాన్ని సుసంపన్నం చేసిన త్యాగరాజు వారి కీర్తనలు అన్నీ ఆ నదీ తీరములోనే రచించబడ్డాయి. కావేరీ నదీ తీరం అందరిలోను భక్తి సామ్రాజ్యం నెలకొల్పి సంగీత సాహిత్యాలను అజరామరం చేసింది.సాయం సంధ్య వేళలో కావేరి నదీ తీరములో కూచుని మాయామాళవ గౌళ రాగములో త్యాగ రాజ స్వామి విరచిత కీర్తన పాడుతూ కావేరీ నదీ ప్రవాహ తరంగాలను చూస్తూ, చుట్టు ఉన్న పచ్చని చెట్ల మీద పక్షుల కిలకిల రావాలను వింటూ ఉంటే కలిగే అద్భుతమైన భావన దైవికమే.

అది మాటలకు అందని అనుభూతి కదా? ఈ జీవ నదీ తీరములోనే కదా అంతకు ముందు ఎన్నడూ లేని భక్తి సంగీతం, అద్భుతమైన సాహిత్యం వెలువడినది.. త్యాగరాజ స్వామి వారు పాడిన కీర్తనలు బహుశా ఇంకా ఈ నదీ తీర పిల్ల తెమ్మెర గాలిలో లీనమై మనకు మంద్రంగా వినబడుతూనే ఉంటాయేమో.

త్యాగరాజ స్వామి వంటి భక్తి సామ్రాజ్యమునేలే రారాజులు .. వేల వేల ఏళ్ళకు గానీ ఒకరు జన్మించరు. అదీ వారు మన తెలుగు వారు కావడం మనకు ఎంతో గర్వకారణం మరియు వారిని గూర్చి తెలుసుకోవడం మన భాగ్యవశమేమో. ఈ కావేరీ పరీవాహక ప్రాంతములోనే సుశాస్త్రీయమైన కర్ణాటక సంగీతాన్ని వారు అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్లారు తన మధుర భక్తి కీర్తనలతో. నేటికీ ప్రతి ఇంటా , వాడ వాడలా ఈ కావేరి నదీ తీరములో వినబడేవి స్వామి వారు రచించిన కీర్తనలే.

thy1 త్యాగరాజ సంగీతలహరి

నాదోపాసన చేసిన స్వామి వారు పండిత పామర జనరంజకముగా ఎన్ని అద్భుత కీర్తనలు రచించారు. వారు రచించిన అన్ని కీర్తనలు మనకు ఈనాడు అలభ్యం.. కానీ వారి శిష్య , ప్రశిష్యుల ద్వారా మనకు లభ్యమైన కీర్తనలు అన్నీ మేలిమి ముత్యాలే. కావేరీ నదిని గూర్చి వారు ఆసావేరి రాగములొ ఆది తాళములో రచించిన ఈ కీర్తన కావేరి నదీమ తల్లిని మన కళ్ళ ముందు సాక్షాత్కరింప జేస్తుంది. పల్లవి: సారి వెడలిన ఈ కావేరిని జూడరే || అనుపల్లవి: వారు వీరనుచు జూడక తా న వ్వారిగాభీష్టముల నొసగుచు చరణం దూరమున నొక తావున గర్జన భీ కరమొక తావున నిండు కరుణ తో నిరతముగ నొక తావున నడచుచు వర కావేరి కన్యకామణి || చరణం వేడుకగా కోకిలలు మ్రోయగను వేడుచు రంగేశుని జూచి మరి ఈ రేడు జగములకు జీవనమైన మూడూ రెండు నది నాధుని జూడ || చరణం రాజ రాజేశ్వరి యని పొగడుచు జాజిసుమముల ధరామర గణములు పుజ లిరుగడల సేయగ త్యాగ రాజ సన్నుతురాలై ముద్దుగ || కావేరీ నదీమ తల్లి, పండిత, పామరులను, ఉన్నవారిని లేని వారిని , పాపిని పుణ్యాత్ముని అందరినీ ఒకలాగే ఆదరించి వారి కోరికలు ఈడేరుస్తుంది. స్వామి వారు రచించిన కీర్తనలు పండితుని గొంతులో ఎంతటి మాధుర్యాన్ని ఒలికిస్తాయో.. పామరుని గొంతులో సైతం అలవోకగ భక్తి రాగం కురిపిస్తుంది.

thy4 త్యాగరాజ సంగీతలహరి

ఇక సంగీత గోష్టిలో పాడితే ఇక దైవ సన్నిధి మన చెంతకు దిగివచ్చినట్టే. అసావేరి రాగాన్ని ఈ పాటకు స్వామి వారు ఎంచుకున్న తీరు అద్భుతం. ఈ రాగం కావేరి నదీమ తల్లిని తలపింప చేస్తుంది.పుష్య బహుళ పంచమి నాడు తిరువయ్యూరు నదీ తీరములో సకల సంగీత పండితులు కలసి ఆ నదీ తీరములోని స్వామి వారి ఆరాధనోత్సవాలలో ప్రతి ఒక్కరూ చిన్నా పెద్దా తారతమ్య భేధము లేకుండా కలసి పాడే సంగీత గాన ఘోష్టి అద్భుతమే. పైన స్వామి వారు రచించిన పాటలో కావేరి నదీమ తల్లి ఒక చోట ప్రచండ గర్జన చేస్తూ.. మరొక తావున భీకరముగ ప్రవహిస్తూ , మరియొక తావున నిండు కరుణతో మెల్లగా సాగుతూ.. పక్షుల కిల కిల రావాలు వింటూ.. శ్రీ రంగని పాదాలు తాకుతూ ఈ సకల జీవులకు ఆధార భూతమైన స్వచ్చ జలాన్ని అందించే కావేరిని తొండరపూడి ఆళ్వార్ లేదా విప్రనారాయణుడు కావేరి నదీమతల్లిని “గంగయిర్ పునీతమాయ కావేరి” అన్నారు.

కావేరి సాక్షాత్ హరి పాదమున ఉద్భవింఛి , పరమ శివుని ఝటలలో మెట్టిన , గంగ కంటే పునీతమైనది అని చెప్పారు. ఎందుకంటే కావేరి శ్రీరంగని కంఠమందలి పూహారమే అని ఆర్యులు చెబుతారు. అలాగే స్వామి వారు నౌకా చరిత్రములో యమునా నది గూర్చి వ్రాసినది ఇంకో మారు చర్చించుకుందాము.

ఎందరో మహాను భావులు.. అందరికీ వందనములు. సంగీతజ్ఞులకు ఈ వ్యాసం అంకితం.

 

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title