తెలంగాణ సాధ్యమైనప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు అసాధ్యం?

Written by

ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఉద్యమం తీవ్రత రోజుకు రోజుకు పెరుగుతూ వస్తోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఏపీకి చెందిన విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు ధర్నాలు చేస్తున్నాయి. జగన్ కూడా ఇదే బాటలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా మీద విస్తృతంగా వార్తలు వస్తున్నాయి. ఏపీ ప్రజలు ఇంటర్నెట్ ను ఆయుధంగా చేసుకుని కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తున్నారు.

సోషల్ మీడియా ఇప్పుడు శక్తిమంతంగా ఉన్నందున నెటిజన్లు తీవ్రస్థాయిలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ మీద ప్రెజర్ తెస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ లాంటి సోషల్ మీడియా మార్గాలను బలంగా వాడుకున్నాయి. ఓటర్లను తమవైపు తిప్పుకున్నాయి. సరిగ్గా ఇదే రీతిన వివిధ సంస్థలు, వ్యక్తులు ప్రత్యేక హోదా కోసం గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి అనేక అడ్డంకులు ఉన్నాయని బీజేపీ మంత్రులు, నేతలు ప్రత్యక్షంగా, పరోక్షంగా చెబుతూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు కూడా వివిధ పార్టీలు, నాయకులు ఇలాగే చెప్పారు. తెలంగాణ ఏర్పాటు చేస్తే దేశాన్ని మళ్లీ సంస్థానాలుగా విడదీయడానికి మార్గం ఏర్పాటు చేసినట్లవుతుందని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ తెలంగాణ ఏర్పడిన సంవత్సరం తరువాత కూడా దేశంలో ఏమీ జరగలేదు. విదర్భ, గూర్ఖాల్యాండ్, బుందేల్ ఖండ్ సహా ఎక్కడా కూడా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు లేవు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చినా.. మిగలిన రాష్ట్రాలు ఏమీ అట్టుడికి పోవు. హైదరాబాద్ ను కోల్పోయిన ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చారు అని సరిపెట్టుకుంటారు. ఏడాది తరువాత ఆంధ్రప్రదేశ్ దాదాపు రూ.12 వేల కోట్ల రెవిన్యూ లోటులోకి వెళ్లే సూచన కనిపిస్తోంది. జూన్ త్రైమాసికంలో రూ.3 వేల కోట్ల లోటు వచ్చింది. నాలుగు త్రైమాసికాలు కలిపితే లోటు రూ.12 వేల కోట్లు అవ్వొచ్చు. రాష్ట్ర విభజన జరిగిన సంవత్సరంలో లోటు సుమారు రూ.15 వేల కోట్లు. వచ్చే ఐదేళ్లలో కూడా ఆంధ్రప్రదేశ్ ఆదాయ లోటు నుంచి బయట పడే సూచనలు కనిపించడం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. పైగా ఏపీకి హామీల కోసం పట్టుబట్టిన వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీలు.. కేంద్రంలో కీలక మంత్రి పదవుల్లో ఉన్నారు. తమంతట తాముగా రాబట్టిన హామీలను అమలు చేయకపోతే ప్రజలు ఎలా ప్రశ్నించకుండా ఉంటారు? నరేంద్ర మోదీ.. ఏపీలో ఆరు చోట్ల మీటింగులు పెట్టి హామీల మీద హామీలు ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా మోదీ ఇచ్చిన ప్రధాన హామీల్లో ఏదీ నెరవేరలేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏపీని బంగాళాఖాతంలోకి తోసేస్తే.. ఇప్పుడు బీజేపీ మరింతగా రాష్ట్రాన్ని ముంచే ప్రయత్నం చేయడం సమంజసం కాదు.

సీమాంధ్రులు దేశాభివృద్ధిలో అద్భుతమైన పాత్ర పోషిస్తారు. వారికి తగిన అవకాశాల్ని కల్పించాల్సిన బాధ్యత మోదీ సర్కారు మీద ఉంది. ప్రత్యేక హోదా, పోలవరం, రాజధానికి నిధులు, విశాఖకు రైల్వే జోన్ లాంటి హామీలు నెరవేరిస్తే.. బీజేపీని సీమాంధ్రులు ఆదరిస్తారు. దేశ జీడీపీ రెండంకెల స్థాయికి చేరుకోవడానికి మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ప్రజలు ఎక్కువ కృషి చేస్తారు.

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title