తెలంగాణని బీట్ చేసిందా ఏపీ ?

Written by

పన్ను వసూళ్లలో ఆశ్చర్యకరమైన లెక్క కనిపిస్తోంది. రాబడిలో తెలంగాణ కన్నా ఐదారువేల కోట్లు వెనకబడిన ఆంధ్రప్రదేశ్ సడెన్ గా జూలు విదిలిస్తోంది. తొలి త్రైమాసికంలో తెలంగాణని మించి పోయింది. జూన్ 30 నాటికి తెలంగాణ పన్ను వసూళ్లు 10,580 కోట్లు ఉంటే, ఏపీ ఆదాయం 10, 806 కోట్లు. ఏంటి 226 కోట్లేగా తేడా ఈ మాత్రం దానికేనా… అంటారా ? కచ్చితంగా సెలెబ్రేట్ చేసుకోవాల్సిన విషయమే. తెలంగాణకి తక్కువొచ్చినందుకు కాదు. ఏపీకి ఎక్కువొచ్చినందుకు. ఎందుకంటే అక్కడ అక్షయపాత్ర లాంటి హైద్రాబాద్ ఉంది. మన దగ్గర రాజధాని లేదు… ప్రత్యేక వ్యవస్థ అంతా ఇప్పుడిప్పుడే పునాది వేసుకుంటోంది. ఇలాంటి సమయంలోనే జోరు ఈ స్థాయిలో ఉంటే ముందు ముందు మరింత గేరప్ అవ్వడం ఖాయం. పైగా విభజన తర్వాత గుండె కోతకి కూడా ఇదే మందు. హైద్రాబాద్ పోతే ఆదాయం పోయినట్టే… అందుకే వెనకబడిపోతాం అనుకున్న వాళ్లకి ఇపుడు … ఎస్… వి కెన్… అనే స్లోగన్ వినిపిస్తోంది. స్లోగా !

ఏపీ పండగ చేస్కోచ్చా ?

ఆదాయం అయితే అంచనాలను మించిపోలేదు కానీ అంచనాలకి తగ్గట్టుగానే పెరుగుతోంది. రిజిస్ట్రేషన్లు పెరగడం, వాణిజ్యపన్నులు సంవృద్ధిగా ఉండడం… వ్యాట్ లాంటివన్నీ పక్కా పాలసీ ప్రకారం ఉండేసరికి జోరు కనిపిస్తోంది ఏపీలో. భూ కొనుగోళ్లు ఏపీలో ఊపందుకున్నాయ్. ఆ మేరకి తెలంగాణలో స్పీడుకి కళ్లెం పడింది. హైద్రాబాద్ రంగారెడ్డిల్లో కొనుగోళ్ల పెద్దగా తగ్గలేదని చెబుతున్నా ఆదాయం పడింది. అంటే కొత్త కొనుగోళ్ల మందం తగ్గుతోందిప్పుడిప్పుడే. ఏపీవైపు దృష్టిసారించడం… ఏపీ వాళ్లు ఖర్చులు, కొనుగోళ్లు అన్నీ ఏపీలోనే చేస్తే రాష్ట్రానికే మేలన్న ఆలోచన రావడం కూడా దీనికి కారణమే. అయితే వాహనాల రిజిస్ట్రేషన్ల విషయంలో మాత్రం ఇప్పటికీ హైద్రాబాద్ ఆధిపత్యమే కొనసాగుతోంది. హైద్రాబాద్ లో ఉద్యోగాలు,వ్యాపారాలు చేస్తున్నవాళ్లు అక్కడే కార్లు కొంటున్నారు. రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఇలాంటి వాళ్లని ఆకర్షించేందుకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ రాయితీలు, సింప్లిఫైడ్ విధానం ప్రవేశపెడితే ఫలితం ఉండొచ్చని కూడా ఏపీ ఆలోచిస్తోందిప్పుడు. విశాఖ, విజయవాడ, తిరుపతి, కడప లాంటి చోట్ల ఇలాంటి ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

మనమేం చేయాలి ?

మనం ఏపీకి మేలు చేయడం అంటే ప్రత్యేకించి ఏం చేయక్కర్లేదు. సింపుల్. మన వెహికిల్ మన ప్రదేశ్ అనుకొని ఏపీలో కొంటే మేలు చేసినట్టే. వేలు లక్షలు పెట్టి కొనే వస్తున్నవులన్నీ ఏపీలోనే తీసుకుంటే ఆదాయం పెంచినట్టే. వ్యాపారాలు, వ్యవహారాలు కంపెనీ రిజిస్ట్రేషన్లు అన్నీ ఏపీలో చేయిస్తే ఏపీ పైకి రావడానికి ఓ చెయ్యివేసినట్టే. ఓ చిన్న ఉదాహరణ ఉంది. విభజనకి ముందు బాడీ బిల్డింగ్ కోసం హైద్రాబాద్ వచ్చేవి వాహనాలు. చెన్నైలో కొన్నా కోల్ కతా నుంచి తెచ్చినా… వచ్చేది మాత్రం పటాన్ చెరుకే. ఇపుడు ఆ యాక్టివిటీ బెజవాడ చుట్టుపక్కలే జరుగుతోంది. ఇంతకు ముందు కూడా అక్కడ ఉన్నా… ఏడాది కాలం నుంచి స్పీడ్ పెరిగింది. వర్క్ షాప్ లు పెరిగాయ్. వర్కూ పెరిగింది. ఇలాంటి కార్యకలాపాలన్నీ మన రాష్ట్రంలో చేయగల్గితే ఏపీ పునాదుల్లో మనవంతుగా ఓ ఇటుక వేసిన్టటే ! అప్పుడు నిజంగానే ఏపీ పండగ చేస్కోచ్చు.

Comments

comments

Article Tags:
· · · ·
Article Categories:
Anything Everything

Comments

Menu Title