చూస్తూనే ఉండండి… జీరోని హీరో చేసే ప్రయత్నంలో న్యూస్ ఛానెల్

Written by

అతనికి మంచి వాచికం ఉంది. అందుకే నటుడిగా హీరోగా అవకాశాల్లేకపోయినా… డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇప్పటికీ బిజీనే ! కానీ ఆయనకి డైరెక్ట్ గా నటించడమే ఇష్టం. సినిమాల్లోనా ఛాన్స్ లేదు. అందుకే ఇక రాజకీయాల్లోకి రాక తప్పదనే దురభిప్రాయంతో దూకేశాడు. రోజుకో రకం ఫీట్ తో ఇపుడు కనిపించిన వాళ్లమీదల్లా కామెంట్లు విసురుతున్నాడు. విసుగెత్తిస్తున్నాడు. దెబ్బకి ఏపీ ప్రత్యేకహోదా సాధన పప్పెట్ షోఅయిపోయింది. బస్సు యాత్రలు… కొత్త పాత్రలు… అంతా గందరగోళం. ఎవరు మాట్లాడుతున్నారో ఎందుకు మాట్లాడుతున్నారో తెలియనంత కన్ఫ్యూజన్. ఎందుకు ఇదంతా ? ఈ మధ్యన చూస్తూనే ఉండండి అంటూ ఓ ఛానెల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఆ అరనటుడి సంగతేంటి ?

వర్కవుట్ మానేసి ఒళ్లు పెంచి ఇపుడు రాజకీయం పండించేందుకు రెడీ అయిపోయాడు అతను. ఓ అపరిచితుడు… ఓ గజినీ…ఓ నేను. నాకు చాలా ఆలోచనలున్నాయ్ రా… త్వరలోనే ఓ కొత్త లోకం కూడా సృష్టించాలనుకుంటున్నార్రా… అంటాడు మెక్ డొనాల్డ్ మూర్తి. ఇంకా మనం గ్రహించడం లేదు కానీ మన చూస్తూనే ఉండండి ఛానెల్ కూడా… ఇపుడు అదే ప్రయత్నాల్లో ఉంది. అరకొర సినిమాల్తో నెట్టుకొచ్చిన నటుడితో ఇపుడు కొత్త నటన మొదలు పెట్టించింది ఆ ఛానెల్. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు… ఎందుకు రాదు..రాజీనామా చేద్దాం… నామాలు పెడదాం అంటూ ఆక్రోశం, ఆందోళన రకరకాల హావభావాలతో ఊగిపోతున్నాడు ఆ నటుడు. అరెరె… సినిమాల్లో ఉన్నప్పుడు ఇంత వేరియేషన్ చూపించి ఉంటే ఈపాటికి ఎక్కడో ఉండేవాడు కదా అనిపించే రేంజ్ లో కనిపించే సీన్ ఇది. ఈఛానెల్ ని నడిపిస్తున్న మూలపురుషుడూ..ఇప్పుడు రోడ్డున పడ్డ ఈ నటుడు పదిహేనేళ్ల కిందట ఓ ఛానెల్లో కలిసి పనిచేశారు. ఆ నాటి అనుబంధం… రకరకాల రంగులు మారి ఇప్పుడు ఇక్కడ తేలింది. అదీ అసలు లింక్. అందుకే జల దీక్ష అంటూ హంగామా చేస్తే… అదే స్పాట్ లో కుర్రాళ్లని కూలికి మాట్లాడి మరీ క్రిష్ణలోకి దూకించి లైవ్ ఇవ్వడం హంగామా హైప్ క్రియేట్ చేయడం ఇవన్నీనూ !

పెద్ద మనిషైపోవడం ఇలాగేనా ?

పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడు ? చంద్రబాబు తక్షణం నిలదీయాలి.. .జగన్ ఏం చేస్తున్నట్టు ? మోడీ దిగి వచ్చే వరకూ పోరాటం ఆగదు ! ఇలా ఉంటాయ్ డైలాగులు. పెద్దోళ్ల మీద రాయివేసి పెద్దోడు అయిపోదామన్న తాపత్రయం చూస్తే ముచ్చటేస్తుంది. మరు క్షణం… రాష్ట్రంతో ఎవరెలా ఆడుకుంటున్నారా అని ఆలోచిస్తే ముచ్చెమటలూ పడతాయ్. అసలే ఆపసోపాలు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ని అడ్డంపెట్టుకొని అడ్డగోలుగా ఎదిగిపోవాలనుకొని చేసే చిల్లర ప్రయత్నాలు ఇవన్నీ. ఏపీకి ముందునుంచి ఇదేసమస్య. ఎనిమిదిమంది కేంద్రలో మంత్రులుగా ఉండి అడ్డగోలు విభనకి గుడ్డి కాపలా కాసినట్టు ఉంటాయ్ మన బాగోతాలు. ఇప్పుడీ వీధి డ్రామా అలాంటి సీక్వెలే ! కాకపోతే వాళ్లు లోపలుండి కాపలా కాశారు. ఇలాంటి వాళ్లు ఏపీకి అన్యాయం చేసేందుకు కొత్త దారి చూపిస్తున్నారు. అంతే తేడా ! ఇలాంటి తాటాకు చప్పుట్లతో ఏపీకి దక్కాల్సిన ప్రయోజనాలు దక్కకపోగా అన్యాయమే జరుగుతుంది. అదెలాగో చూద్దాం !

ఏపీ హోదా అంటే ప్రైవేట్ ఫంక్షన్ కాదు.. బీ కేర్ ఫుల్…

ఎవరో ఏదో ప్రయత్నం చేస్తే మనకేంటి నొప్పి… అని తేలిగ్గా తీసుకుంటే… తెగే వరకూ తేరుకోక పోతే ఎగిరిపోయేది మన గాలిపటమే. మన ప్రమేయం లేకుండానే మన పతంగి వెళ్లి కేంద్రం చిటారు కొమ్మకి చిక్కుకుంది విభజన దెబ్బతో. మన కోరుకున్నది కాదు… కావాలన్నది కాదు. అలాంటప్పుడు ఏం చేయాలి… ఎంత వాటంగా ఎంత ఒడుపుగా విడిపించుకోగలమా అనేది చూడాలి. చంద్రబాబు తేల్చుకోవాలి… తెగదెంపులు చేసుకోవాలి అంటే దారం తెంచుకోమనడం లాంటిదే. అలాగే… పవన్ నిలదీయాలన్నా వేదిక దొరకాలి. టైమ్ రావాలి. ఇప్పటికిప్పుడు తేలిగ్గా తేలే సంగతి కాదు. రాష్ట్రాల ఎన్నికలు..రాజకీయ వ్యహాలు లాంటివన్నీ ఉంటాయ్. ఇవన్నీ ఆలోచించకుండా గుంజేస్తే..దారంతెగి దూరం పెరుగుతుంది. పతంగి కూలబడుతుంది తప్పితే… చెట్టుకి వచ్చే ఇబ్బందేం లేదు. మోటుగా చెప్పాలంటే … చెరువు మీద అలిగితే ఎండేది ఎవరికి ?

పార్లమెంటులో నిలదీయాల్సిందే ! కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే. వ్యూహాత్మకంగా అడుగు పడాల్సిందే. ఒకవేళ హోదా ఇవ్వలేమంటే కనీసం 50,60 వేల కోట్ల పనులు ప్రాజెక్టులు అయినా రాబట్టుకోవాల్సిందే. ఎందుకంటే హోదా ఇచ్చినా కలిసొచ్చేది ఆ మందమే. ఇపుడు ఏపీ ఆదాయానికి ఢోకా లేదు. పెరుగుతోంది. నడవడానికి అది సరిపోతుంది. కానీ పరిపాలనా భవనాలు, రాజధాని, కేంద్ర సంస్థలు లాంటివన్నీ సమకూర్చుకుంటే తప్ప రాష్ట్రం రూపురేఖలు సంపూర్ణం కావు. ఇదంతా మూలధన పెట్టుబడి. దీనికోసమే హోదానో, కేంద్రం సాయమో కావాలి. ఇదంతా పటిష్టమైన ఎత్తుగడతో జరగాల్సిన పని. ఇప్పటికి గడిచించి ఏడాదే. అసహనం ఉండొచ్చు కానీ హద్దు దాటనక్కర్లేదు.

అతనేదో చేసుకుంటే మనకెందుకులే ఎవరి ఓపిక వాళ్లది అనుకోడానికి ఇది ఎవరి పెళ్లికి వాడు పందిరి వేసుకోవడం లాంటిది కాదు. రాష్ట్ర ప్రయోజనం, జాతి భవిష్యత్. ఎవరుబడితేవాళ్లు ఏదేదో మాట్లాడేసి బస్సు మాట్లాడుకొని రాష్ట్రమంతా తిరిగేస్తాం అంటే సరిపోదు. ఐదాగురు కలిసి హడావుడి చేస్తే ప్రత్యేక హోదా పోరాటం తేలిపోయిందన్న ముగింపు వస్తుంది మొదట్లోనే ! ఇది ఇంకా ప్రమాదకరం. ప్రత్యేక హోదా కోసం హడావుడి చేస్తే స్పందన రాలేదు…. జనం కూడా కోరుకోవడం లేదు హోదా అని కేంద్రం వాదించేందుకు అవకాశాలు అవుతాయ్ ఇలాంటివన్నీ ! విభజన సమయంలో ఓ ఎంపీ వేసిన వెర్రి మొర్రి వేషాలు ఏపీ మీద నాన్ సీరియస్ ముద్ర వేసేశాయ్. ఐదు కోట్లమందికి ఇంత అన్యాయం జరగడానికి అవన్నీ పునాదిరాళ్లే! మరి ఇలాంటి యాత్రావేషాలతో మళ్లీ అలాంటిపరిస్థితి రాకుండా జాగ్రత్తపడాలి. అందుకే ఇది చూసీచూడనట్టు ఊరుకోడానికి టీవీలో తేరగా వచ్చే సినిమా కాదు. స్టేట్ స్టేటస్.

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title