చంద్రబాబంటే వీళ్లకి ఇంత అలుసా ?

Written by

కడుపులో నీళ్లు కదలకూడదు. ఒత్తిడి పెరగకూడదు. సీటులోంచి కాళ్లు కూడా కదపరు. ఎక్కడివాళ్లు అక్కడే ఉంటారు. రాష్ట్రం గుర్రెమెక్కి ముందుకు వెళ్లిపోవాలి ! ఎలా సాధ్యం ఇవన్నీ ? దేశాలన్నీ తిరుగుతూ సీఎం ఓపక్క… ఎప్పుడు పనులు మొదలవుతాయా వెనక్కి వద్దామన్న ఆలోచనలో జనం ఇంకోపక్క ఆరాటపడడమే తప్ప… ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రం కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. రాజధానికి రావాలంటే సవాలక్ష కండిషన్లు… అలా అయితే కుదరదు… ఇలా అయితే కుదరంటూ డిమాండ్లు. ఇరుసులా మధ్యలో ఉండి నడిపించాల్సిన ఉద్యోగులే ఇలా ఉంటే రాష్ట్రానికి ఊపెలా వస్తుంది ?

గడగడ లాండించిన చోటే… గప్ చుప్ బాబు

చండశాసనుడు… ఉద్యోగుల్ని గడగడలాడిస్తాడు. పనులు దడదడలాడిస్తాన్న పేరు చంద్రబాబుకి. అదంతా ఫ్లాష్ బ్యాక్. ఇపుడు ఆయన ఎవరినైనా బతిమాలడానికే పరిమితం అయిపోయారు. కొత్తగా బుజ్జగింపులు కూడా నేర్చుకుంటున్నారు. మెప్పు కోసం తాపత్రయపడడం అవసరమైతే తనే కాంప్రమైజ్ అయ్యేందుకు సిద్ధపడడం కొత్త యాంగిల్స్. లేకపోతే ఏంటి ? వస్తారా రారా… అంటూ అల్టిమేటం జారీచేసి ఆర్డర్ వేసి పని చేయించుకోవాల్సింది పోయి… వత్తులు వత్తుతున్నారు కొత్తగా. రాష్ట్రం కష్టాల్లో కొట్టుకుపోతున్నా… అందరి కడుపులూ మాడ్చి మరీ ఇచ్చారు కదా 43 శాతం ఫిట్మెంట్… ఆ కృతజ్ఞత ఏమైపోయింది ? రాష్ట్రం కోసం అవసరమైతే రెండు గంటలు ఎక్కువ పనిచేస్తాం అంటూ కబుర్లు చెప్పారుగా అవన్నీ ఏమైపోయాయ్ ? సమాధానం చెప్పాల్సిన ఉద్యోగులు సణుగుతూ డిమాండ్లు పెడితే ఏపీ గతి ఇలా గాక ఇంకెలా ఉంటుంది ?

ఈ ఊద్యోగులన్నారే…

విభజన, ఆ తర్వాత రాజకీయాన్ని వాటంగా వాడుకోవడంలో నేతలకి ఏ మాత్రం తీసిపోరు మన ఉద్యోగులు, వాళ్ల సంఘాల నాయకులు. అంత చేస్తాం ఇంత చేస్తాం అంటూ కబర్లు చెప్పిన అశోక్ బాబు, విఠల్ లాంటి వాళ్లు స్టేజిలెక్కితే చాలు టీడీపీ ప్రాధమిక సభ్యత్వం తీసుకున్నట్టు ప్రసంగాలు దంచేస్తారు. ఉద్యోగులమన్న మాట కూడా వదిలేసి ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తతేందుకు నిచ్చెనలు వెంట తెచ్చుకుంటారు. అవన్నీ కబుర్లేనా ? పని దగ్గరకొచ్చేసరికి మాత్రం హ్యాండిచ్చేస్తారా ? హైద్రాబాద్ లో దాడులు చేస్తున్నా… వెంటపడి కొడుతున్నా… లంచ్ టైమ్ లో బాక్సులు విసిరికొడుతున్నా తుడుచుకుంటారు తప్పితే… నెత్తిన పెట్టుకుంటామనే అమరావతివైపు మాత్రం చూడరన్నమాట. వీళ్ల కోసం ఎన్ని మీటింగ్ లు పెట్టాలి ? ఇంకెంతని హామీలివ్వాలి. ఉద్యోగులంటే ప్రభుత్వానికి సైన్యం. సొంత సైన్యాన్నే ఒప్పించలేనప్పుడు యుద్ధం ఏ మాత్రం చేయగలం ?

పిల్లల చదువులు, ఉండడానికి వసతులూ అన్నీ నేల్లోంచి మొలుచుకొచ్చే విషయాలు కాదు. మొదట్లో కొద్దోగొప్పో ఇబ్బంది ఉంటుంది ఎక్కడైనా. తట్టుకోవాలి… సర్దుకోవాలి… అధిగమించాలి. ప్రభుత్వానికి కళ్లు చెవులూ లాంటి ఉధ్యోగులే ఇలా మొండికేస్తే రాష్ట్రం అచేతనం అయిపోతుంది. కేంద్రం సాయం చేయడం లేదంటూ ఆందోళనలు ఓపక్క… సాధించాల్సిన భారీ లక్ష్యాలు ఇంకోపక్క సవాల్ విసురుతున్నాయ్. పాతాళానికి పడిన రాష్ట్రాన్ని ఆదుకోడంలో ముందుండాల్సిన ఉద్యోగులే ఇలా బేరాలాడితే జనాగ్రహం నషాళానికంటుతుంది. ఆ ఎఫెక్ట్ ముందు ప్రభుత్వం మీద ఆ తర్వాత ఉద్యోగులకీ తగులుతుంది. అంత వరకూ రాక ముందే జాగ్రత్తపడితే బెటర్.

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title