కేసినో వస్తోంది… కాసుకో వైజాగ్

Written by

టూరిజం కోసం కొత్తగా ఆలోచించాలనుకుంటున్న ఏపీ ప్రభుత్వం ఇపుడు తీరంలో వెరైటీగా లంగరేయబోతోంది. కాస్మోపొలిటన్ సిటీ విశాఖ కి కొత్త హంగులద్దేందుకు సిద్ధమవుతోంది. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే త్వరలో విశాఖ తీరంలో కేసినోలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏపీ టూరిజం పాలసీపై 15 రోజులకోసారి సమీక్షలు కొత్తగా మార్పులు జరుగుతున్నాయ్ కొన్ని నెలలుగా. ఇపుడు పాత ప్రపోజల్ ని కొత్తగా చేర్చి చర్చకి తెరదీయబోతున్నట్టు కనిపిస్తోంది. విశాఖ తీరంలో మన ప్రాదేశిక జలాల్లో కేసినో ప్రారంభించాన్న ప్రతిపాదన దాదాపు ఏడాది కిందటి నాటిది. రకరకాల ప్రచారాలు… ఆలోచనలతో అప్పటికి బ్రేక్ పడింది. ఇపుడు మళ్లీ కదలిక వస్తున్నట్టు కనిపిస్తోంది.

కేసినో వస్తే టూరిజం డెవలప్ కావడంతోపాటు అంతర్జాతీయ లుక్ కూడా వస్తుందని… ఆకట్టుకోవడానికి కొత్తగా ఎట్రాక్షన్ కూడా ఉంటుందన్నది ప్రతిపాదన. అయితే దీని మీద సవాలక్ష అభ్యంతరాలున్నాయ్. గోవా లాంటి చోట్ల మాత్రమే ప్రస్తుతం మన దేశంలో కేసినోలు ఉన్నాయ్. అక్కడున్న ప్రత్యేక కల్చర్ శాంతిభద్రతల పరిస్థితి దృష్ట్యా అది సాధ్యమైంది. పైగా గోవా ప్రధాన ఆదాయ వనరు టూరిజమే కాబట్టి తప్పనిసరి కూడా. మరి మనకి మాత్రం అలా సాధ్యపడుతుందని చెప్పలేం. తూర్పు తీరంలో వ్యూహాత్మకంగా కీలకం కావడంతోపాటు నౌకా కేంద్రం సమీపంలో ఉండడం లాంటివన్నీ విశాఖకి ప్లస్ పాయింట్స్. ఈ కేసినో ఏర్పాటు విషయంలో అయితే ఆలోచించాల్సిన విషయాలివన్నీ.
దీనికోసం రక్షణ శాఖ క్లియరెన్స్ తోపాటు టూరిజం పాలసీ సమీక్ష… కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పరిశీలన అన్నీ అవసరం అవుతాయ్.

కేసినో వస్తే…

కాసినో ఒకవేళ ప్రారంభమైతే కనుక… సాయంత్రం 6 గంటలకి వైజాగ్ తీరంలో ఓ షిప్ బయల్దేరుతుంది. అది కేసినో వద్దకి చేరుస్తుంది. అక్కడ ఎంజాయ్ మెంట్… హంగామా అంతా ఉంటుంది. మళ్లీ ఉదయం 6 గంటలకి తీరానికి తిరిగొస్తారు. ఇలాంటి నోవేర్ షిప్ లు ఏర్పాటు చేసి హడావుడి చేసే రేంజ్ ప్రస్తుతం మకావ్ లాంటి కొన్ని చోట్ల మాత్రమే ఉంది. లాగ్ వెగాస్ లో ఇంకా డిఫరెంట్ మోడ్ నడుస్తోంది. ఇపుడు గోవా తర్వాత విశాఖలోనూ నీటిమీద తేలియాడే ఇలాంటి కాసినోలు పుట్టుకొస్తే ఇక ఎలా ఉంటుందో అంటూ ఊహలు ఓ పక్క… అభ్యంతరాలు వస్తాయన్న ఆందోళనలు ఇంకోపక్క పెరుగుతున్నాయ్ క్రమంగా.

ఒకవేళ అంతా క్లియర్ అయి..కేసినో స్టార్ట్ అయితే కలర్ మారుతుంది. కల్చర్ మారుతుంది. విశాఖకి వెయిట్ పెరుగుతుందన్నది ఎంత నిజమో… కలకలం వస్తుందన్నది కూడా అంతే వాస్తవం. మన సంప్రదాయమా? కాదా ? ఇంతకన్నా మనకి మరో మార్గం లేదా ఆకట్టుకోవడానికి లాంటి దుమారం రేగుతుంది. అందుకే ప్రస్తుతానికి వ్యూహాత్మకంగా అడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది. కేసినో వచ్చినా తీరానికి దూరంగానే ఉంటుంది. దానికోసం ప్రత్యేకంగా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటారు. అందుకని ఆందోళన పడాల్సిన అవసరంలేదంటున్నారు సపోర్ట్ చేస్తున్నవాళ్లు.
చూడాలి కేసినో స్టోరీ తీరంలో కనిపిస్తుందేమో !

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title