ఒకరిది అస్తమయం… ఒకరిది చావు…

Written by

జూలై 30 చరిత్రలో నిలిచిపోయే రోజు అయ్యింది. అంతులేని శోకం ఓ వైపు. అలాగే జరగాలన్న కసి మరోపక్క. విషయాలు వేర్వేరు. మరణాలు వేర్వేరు. పోయిన ప్రాణాలు రెండు. ఒకరిది మహాభినిష్క్రమణం. మరొకరిది ఉరికొయ్యకు వేలాడిన ఉత్సవం. కలాం అస్తమయాన్ని యాకూబ్ తో కలిసి చెప్పకూడదు కానీ… ఇందులో కూడా ఇండియా ఔన్నత్యం కనిపిస్తోంది. వైవిధ్యం వికసిస్తోంది. ఓ కత్తికి ఉన్న రెండు పార్శ్వాల్ని స్మృశిస్తోంది. కాదన్నా ఇది వాస్తవం. ఒప్పుకోలేకపోయినా ఇది కట్టెదుట కనిపిస్తున్న వర్తమానం.

మతం గురించి మాట్లాడ్డం కొన్నిసందర్భాల్లో సమ్మతం కాదు. నెగెటివ్ ప్రచారం చేస్తున్నప్పుడు… విద్వేషానికి వాడుకుంటున్నప్పుడో అయితే ! కానీ ఇపుడు చర్చ దేశంలో కనిపిస్తున్న వాస్తవ పరిస్థితి గురించి. ఇదో చిత్రమైన పారడాక్స్. వైచిత్రి. ఇద్దరు ముస్లింలు. ఒకరు దేశాన్ని మహోన్నంతగా నిలిపిన మహాత్ముడు. మరొకరు దేశాన్ని ఛిన్నాభిన్నంచేసిన ఉగ్రవాది. ఒకరి కోసం దేశమంతా శోకసంద్రమైంది. ఇంకొకరిని ఉరి తీస్తుంటే అదే దేశం బిక్కుబిక్కుమంటూ చూస్తోంది ఏం జరుగుతుందోనన్న ఆందోళన. ఒకరి కోసం ఐక్యరాజ్యసమితి కూడా విచారం ప్రకటించింది. వైట్హౌస్ జెండాని సగం కిందికి దించింది చరిత్రలోనే తొలిసారిగా. గౌరవ సూచకంగా. మరొకడి ఉరిపై ప్రతీకారంగా కత్తులు నూరుతున్నాయ్ ఇంకొన్ని దేశాలు. రెండూ అంతర్జాతీయ పరిణామాలే ! ఒకరి అంతమ యాత్ర… చరిత్రలో నిలిచిపోయే విషాద ఘట్టం. జాతి యావత్తుని ఏకం చేసిన దృశ్యమ్. మరొకరి అంతిమ యాత్ర ఓ నిషేధాజ్ఞ.

ఇద్దరు చదివిన గ్రంథమొక్కటే. ఇద్దరు పీల్చిన గాలొక్కటే. ఇద్దరు తిరిగిన నేలొక్కటే. దేశ మొక్కటే. మంచి మహనీయతను సంతరించుకుంది. చెడు ఘోరాతిఘోరంగా అంతమైంది అనేందుకు జూలై 30 ప్రత్యక్ష సాక్షి. కాలంకన్నా కఠినంగా తీర్పు ఇచ్చేందుకు నిగ్గుతేల్చేందుకు మరో మార్గం లేదు. ఇది ఇండియా. ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి… అరాచకాన్ని కూకటివేళ్లతో పెకలించేందుకు సిద్ధపడే గడ్డ. ఇంత వైవిధ్యం..ఇంతటి వైరుధ్యం ఇక్కడే ఉంటుందేమో !

Comments

comments

Article Tags:
· ·
Article Categories:
Anything Everything
Menu Title