ఏవరా శవానందం? ఏమా కథ?

Written by

వెనకటికి అమరపురిలో ఓ తండ్రి, కొడుకులు ఉన్నారు. తండ్రి పంచాయతీ సర్పంచ్‌. కొడుక్కి ఏ పదవి లేకపోయినా తండ్రితో పాటు అన్ని వ్యవహరాల్లో తలదూర్చేవాడు. వారిద్దరూ కలిసి ఊరికి మంచి జరిగేందుకు దేవుడి గుడి అభివృద్ధి చేస్తామని చందాలు వసూలు చేసేవాళ్లు. వసూలైన డబ్బులు తెచ్చి ఆ తండ్రి గుడి మండపం మధ్యలో ఓ గుండ్రటి గీత గీసేవాడు. హే భగవాన్‌ “నాదీ దేవుడి పాలన. నీ నిర్ణయమే నా నిర్ణయం. ఆలయ అభివృద్ధి విషయంలో నువ్వేం చెబితే అదే చేస్తా” అనే వాడు.

“ఓ దేవుడా నీ ముందు ఓ గుండ్రని గీత గీశాను. వసూలైన డబ్బులన్నీ దాంట్లోకే విసురుతాను. ఆ గీతలో పడినవి అన్నీ నువ్వే తీసేసుకో. నా భుక్తి కోసం దాంట్లోంచి బయటపడినవి మాత్రమే నేను తీసుకుంటాను అని ప్రార్థన చేసేవాడు. నువ్వు ఎలా చెప్తే అలా చేస్తా దేవుడా’ అని విసిరేవాడు. సహజంగానే దూరం నుంచి విసిరినప్పుడు గీత బయటే ఎక్కువ డబ్బులు పడేవి.

పదోపరకో గీతలో పడేవి. “దైవ నిర్ణయం శిరోధార్యం” అంటూ బయటపడ్డ డబ్బులన్నీ మూటకట్టి కొడుక్కి ఇచ్చి రహస్యంగా దాచమనే వాడు. ఆ గీతలో పడిన డబ్బులతో గుడిలో రోజుకో రుచికరమైన ప్రసాదం ఊళ్లోవాళ్లకి పెట్టేవాడు. చక్కటి రుచికరమైన ప్రసాదాలు ఊరివాళ్లకి రోజూ అందటంతో గుడి బానే అభివృద్ధి చేస్తున్నట్టు కొంతకాలం నమ్మించాడు.అందరికీ “నాదీ దేవుడి పాలన..దేవుడు చెప్పినట్టు నడుచుకుంటున్నా అని ప్రచారం చేసుకునేవాడు.కొంతకాలనికి అతడి పాపమో..దేవుడి శాపమో ఆ పెద్దమనిషి పోయాడు.

తర్వాత కొడుకు వచ్చాడు. నా తండ్రిలాగే నేను గుడిని బాగు చేస్తానని తండ్రి పేరు చెప్పి బాగా డబ్బులు వసూలు చేశాడు. వసూలు చేసిన డబ్బులను గుడి ముందుకు తెచ్చి “ఓ దేవుడా..వచ్చిన డబ్బును గాల్లోకి విసురుతాను. నీక్కావాల్సినంత నువ్వు తీసేసుకో, నువ్వు తీసుకోగా మిగలినవి, కింద పడ్డవి మాత్రమే నేను తీసుకుంటా’ అని మొత్తం గుడిసొమ్ము నొక్కేశాడు.

కొద్దిరోజులకే ఇతగాడి వ్యవహారం జనానికి అర్థం అయి ఊరి నుంచి తరిమేసి మరో పెద్దమనిషిని ఎన్నుకున్నారు. దాంతో నిలువెళ్లా అమరపురి వాసులపై విషం నింపుకున్న ఆ పుత్రరత్నం పక్కనే ఉన్న భాగ్యపురి పంచాయతీతో చేతులు కలిపాడు. తమ ఊరి గుట్లన్నీ ప్రత్యర్థులకి చేరేసేవాడు. ప్రతి విషయంలోనూ సొంతూరిపై కయ్యానికి కాలు దువ్వసాగాడు. ఆలయనిర్మాణంలో, నీళ్లలో, నిధుల్లో గ్రామాభివృద్ధికి అడ్డుపడేవాడు. ఊరికి నిధులు ఇచ్చే పై వాళ్ల దగ్గరకి వెళ్లి మా ఊరి వాళ్లని బాగా ఎండపెట్టండి. వాళ్లకి నిధులివ్వద్దు. వచ్చే పంచాయతీ ఎన్నికలో మనం మనం కలిసుందాం, మీకు నేను మద్దతిస్తాను అని రాయబారాలు నెరిపేవాడు. ఎక్కువగా పక్క ఊర్లోనే ఉంటూ అప్పుడప్పుడు ఊరి పెద్దలను తిట్టడానికి మాత్రం ఆ ఊరికి వచ్చేవాడు. ఎప్పుడు చూసినా ఆ నోటి నుంచి అన్నీ అశుభాలే తప్ప ఒక్క మంచి మాట మాట్లాడేవాడు కాదు. ఏదైనా మంచి పనితలపెడితే అడ్డంకులు సృష్టించేవాడు.

ఊరిపై వాడి ఏడుపు చూడలేక జనం విసిగి వాడికి “శవానందం” అని పేరు పెట్టారు. గ్రామవాసులు అందరూ సమావేశమై ఒక తీర్మానం చేశారు. “ఊరు బాగవుతుంటే వాడేడుపు చూడ లేక ఛస్తున్నాం. ఎప్పుడు చూసినా నెత్తిన శని తాండవిస్తున్నట్టు విషాద ముఖంతో ఊర్లో అడుగుపెడతాడు. వీడిని ఇకనుంచి ఊరిలో చావులకి తప్ప వేరే ఎక్కడికీ రానివ్వద్దు. ఎప్పటిలాగే వాడిని ఆ పక్క ఊరు భాగ్యపురిలోనే ఉండనిద్దాం. వాడికి ప్రీతిపాత్రమైన అశుభాలకి మాత్రం కబురుపెడదాం” అని ఊరంతా ఒక్క తాటిపైకి వచ్చి తీర్మానం చేశారు. అప్పట్నుంచి ఆ పుత్రరత్నం అమరపురిలో అశుభాలకి మాత్రం హాజరవుతూ సార్థక నామధేయుడిగా పక్క ఊరి చరిత్రలో నిలిచిపోయాడు.

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title