ఏపీ సంక్షోభానికి షష్టిపూర్తి

Written by

తెలుగు సంవత్సరాలు అరవై ఉంటాయ్. ప్రభవ… విభవ వగైరా. ఉగాది ఉగాదికీ ఏడాది మారుతుంది. అరవై కాగానే మళ్లీ మొదటి ఏడాది వస్తుంది. ఏపీ గతి కూడా అలాగే ఉంది. గతి అంటే మనకి తెలిసిన అర్థమే కాదు గమనం అని కూడా. సరిగ్గా అరవై ఏళ్లు అయ్యేసరికి మళ్లీ అక్కడికే వచ్చింది ఆగింది మన బతుకు. అవును. తొలి రీఆర్గనైజేషన్ తర్వాత ఏపీగా ఏర్పడి ఈ సంవత్సరానికి సరిగ్గా 60 ఏళ్లు. నవంబర్ నాటికి పూర్తవుతున్నా.. స్వతంత్రదినోత్సవం కాబట్టి మన ఫేట్ ఏంటో గుర్తుచేసుకుంటే బావుంటుంది. అందుకే సంక్షోభానికి షష్టిపూర్తి !

అరవై ఏళ్ల నాడు తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన రికార్డు మనదే. అప్పటికే కోస్తా సీమలకి మరో రికార్డు కూడా ఉంది. ఉన్న కేపిటల్ ని వదులుకొని… అలా పక్క ప్రాంతంలో కలవడం కూడా రికార్డే. అప్పటికి గానీ ఆ తర్వాత కానీ అలా ఏ ప్రాంతామూ సొంతకాళ్లని వదులుకొని అద్దె కాళ్లని అతుక్కోలేదు. మళ్లీ ఇలా తన కాళ్ల మీద తాను నిలబడేందుకు తంటాలు పడలేదు. అందుకే సీమాంధ్రకి అప్పుడూ ఇప్పుడూ రికార్డే ! ఇలా రికార్డే రికార్డే అంటుంటే కారం పూసినట్టు ఉంటుంది కానీ కాదనలేని వాస్తవం ఇది. ఇదొక్కటే కాదు ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయ్ మన రికార్డులు.

అరవై ఏళ్లలో మూడు రాజధానులు మారడం… అదే సమయంలో రెండు ప్రాంతాల నుంచి మన ప్రమేయం లేకుండా వేరు పడడం (అప్పట్లో చెన్నై నుంచి ఈ మధ్య హైద్రాబాద్ నుంచి)… రెండు సార్లు ఢిల్లీ చేతిలో వంచన ఎదుర్కోవడం… దక్షిణాదిలో ఏ రాష్ట్రానికీ లేనంత వనరు, వాటం ఉన్నా ఎటూ కాకుండా మొదటి నుంచి అడుగేయాల్సి రావడం … అవసరాలు పాతాళంలో… ఆదాయం దివాళా స్థాయిలో … ఇలా చెప్పు కుంటూ పోతే మనకి చాలానే ఉన్నాయ్ రికార్డులు. ఇవన్నీ షష్టిపూర్తి కానుకలు. గుర్తుపెట్టుకోవాల్సిన జ్ఞాపికలు.

జెండా పండగ రోజున ఈ ఏడుపు గొట్టు సొద ఎందుకంటారా ? అంటారు మీరు కచ్చితంగా. ఎందుకంటే ఆంధ్రావోళ్లు కదా. ఆ మాత్రం ఇసురు ఉంటుంది. అవును. ఎందుకిప్పుడు ఇవన్నీ…? ఏమిచ్చావని ఎదురడగకుండా జెండా ఎగరేద్దాం…వందనం చేద్దాం…! అదే చేయి పిడికిలా బిగించి అందరం ఓమాట కూడా అనుకుందాం! ఈజెండానే కాదు ఏపీ జెండాని కూడా ప్రపంచం అంతా తలెత్తిచూసేంత ఎత్తులో ఎగరేద్దాం. కష్టపడదాం… కళ్లుతెరిచి… ఒళ్లొంచి… కష్టనష్టాలు పంటి బిగువన భరించి. ఏపీ జెండా ఎగరేద్దాం. ఆగస్ట్ 15 సాక్షిగా అదే మన అజెండా. ఏపీ జెండా అంటే ఏదో కాదు… మన కీర్తి పతాక. ఆంధ్రావోడి కీర్తి బావుటా !

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title