ఏపీ రాజకీయాన్ని శాసిస్తున్న బిజినెస్ మేన్

Written by

రాష్ట్రం రెండు ముక్కలైంది. ఏపీ కుప్పకూలింది. ఓ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఐదు కోట్లమంది ప్రస్థానం మొదటి అడుగు నుంచి స్టాటైంది. ఇంత అల్లకల్లోలంలో అన్ని వర్గాలూ దెబ్బతిన్నాయ్. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు లాంటి వాళ్లైతే దారుణంగా ఎఫెక్ట్ అయ్యారు. ఇంత తుఫాన్ లోనూ ఓ వర్గం ప్రభావం మాత్రం చెక్కు చెదరలా ! పైగా పెరిగింది. అదే పొలిటికల్ బిజినెస్ కమ్యూనిటీ. వ్యాపారం చేసేవాళ్లు చేసుకున్నట్టు ఉంటే పర్వాలేదు. రాజకీయం చేయాలనుకుంటారు. రాష్ట్రంతో చెలగాటం ఆడేస్తారు. ఇదే అసలు సమస్య. పార్టీకి పెట్టుబడులు పెట్టి పదవులు అడుగుతారు. పదవులు అడిగి రాష్ట్రాన్ని పణంగా పెడతారు. ఇపుడు ఏపీ వీళ్ల దెబ్బకి మరోసారి విలవిల్లాడుతోంది. పురిటిలో ఉన్న రాష్ట్రానికున్న పుట్టెడు కష్టాల్లో ఇదే ఇపుడు మేజర్ ఇష్యూ.

చంద్రబాబు కోటరీ. చంద్రబాబు కళ్లకి కొందరు గంతలు కట్టారు లాంటి విమర్శలో మాటలో వినిపిస్తుంటాయ్. ఎవరి వాళ్లు ? ఇదే బిజినెస్ కమ్యూనిటీ. రాండమ్ గా లెక్క తీయండి. చంద్రబాబుకి దగ్గరగా ఉండి… నిర్ణయాల్ని ప్రభావితం చేయగల్గిన టాప్ ఫైవ్ లో ఉండేది వ్యాపారాలు చేసుకునే వాళ్లే ! సుజనా, నారాయణ, సీఎం రమేశ్, గరికపాటి, కంభంపాటి. అంతా వ్యాపారస్తులే. రాజకీయంలో రిటర్న్స్ రావాలనుకునేవాళ్లే ! పదేళ్లు పార్టీని నడిపేందుకు తలో చెయ్యీవేశామంటూనో మరో కారణంతోనో ఊరుకుంటే రాష్ట్రం రోడ్డునపడ్తున్న పరిస్థితి తరుముకొస్తోంది. రాజధాని ఏరియాలో మున్సిపల్ మంత్రి పెత్తందారీతనం మొదలు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రమంత్రి సొంత పెత్తనం… కాలేజీల కోసం ఒకరు… కాంట్రాక్టుల కోసం మరొకరు. ఏపీ ప్రయోజనాలతో ఆడుతున్న చెలగాటం అడ్డగోలుగా శృతి మించుతోంది. కేబినెట్ లో ఉన్న గంటా లాంటి మంత్రులు కూడా సొంత పనులు చేసుకోడానికే అధికారం అన్నట్టు ఉండిపోతే ఇక ఏపీకి ఎవరు దిక్కు ?

చంద్రబాబుతో ఇదే సమస్య !

పార్టీ కోసం పనిచేశారంటే వాళ్లకి ఆర్థికంగా లబ్దిచేకూర్చే అవకాశాలు చాలానే ఉంటాయ్. పక్క రాష్ట్రాల్లో ప్రాజెక్టులు. కేంద్రం కేటాయించే టెండర్లు లాంటివి రాజకీయాల్లో ఎంత కాదన్నా లేదన్నా నడుస్తూనే ఉంటాయ్. ఇవే కాకుండా సాయపడినవాళ్లందరికీ మంత్రి పదవులు, ఎంపీ పదవులు కట్టబెట్టుకుంటూ పోతే పరిస్థితి ఇప్పటిలాగే దారుణంగా దిగజారిపోతు్ంది. చెప్పాలంటే ఉదాహరణలు తొంభై. రేవంత్ వివాదంలో ప్రభుత్వం పరువు పోతుంటే ఈ వ్యాపారులెవరు ముందుకు రాలేదెందుకు ? నారాయణకి కాలేజీలపై దాడులు జరుగుతాయని భయం. ఇరుక్కున్న కంతలు బైటపడతాయని సుజనాకి బెంగ. ఆరోపణలు డిఫాల్టర్ ముద్ర ఉందని అభ్యంతరాలొచ్చినా… వీటో చేసి మరీ పదవి ఇప్పించుకొని ఏం లాభం ? ఆ మంత్రి కేంద్రాన్ని నిలదీయగలడా… ప్రత్యేక హోదా విషయంలో ? ఇక్కడ ప్రభుత్వానికి అండగా ముందుకొచ్చి మాట్లాడగలరా ?

సోమిరెడ్డో కేశవో వచ్చి… మాట్లాడి ఎదురుదాడి కి దిగే వరకూ వీళ్లకి చేతగాకపోయిందే ? ఇలా ఎవరి యాంగిల్ వాళ్లది. ఇదొక్కటే కాదు… పుష్కరాల తొక్కిసలాట సమస్య అయినా… అసెంబ్లీలో విపక్షానికి సమాధానం చెప్పాల్సింది అయినా… జనంలో వ్యతిరేకత పెరిగితే ఎదుర్కొనేందుకు వ్యూహమైనా వీళ్లెవరకూ తుపాకి గుండుకి కూడా దొరకరు. మళ్లీ పొలిటిక్స్ తెలిసిన జనంతో సంబంధాలున్నవాళ్లు ఆదుకోవాల్సిందే ! పదపదే ఇలాంటి పరిస్థితి వచ్చినా తేరుకోకపోతే తెలుసుకోకపోతే పరిస్థితి చేయి దాటిపోతుంది. ఇప్పటికే సూచనలు కనిపిస్తున్నాయ్.

ముందు నుంచి ఏపీకి ఇదే శాపం …

వైఎస్ హయాంలో కొడుకు జగన్ పెత్తనం, వ్యాపార ప్రయోజనం ఏపీని దారుణంగా దెబ్బతీసింది. సొంత ప్రయోజనాల కోసం భూ కేటాయింపులు, కంపెనీలతో పెట్టుబడి ఒప్పందాలు…అయినవాళ్లకే కాంట్రాక్టులు… జనం భూముల్ని తాకట్టుపెట్టి వేల కోట్లు బ్యాంకు అప్పులు తెచ్చుకున్న బ్రాహ్మణి ఒప్పందాలు… చెప్పుకుంటూ పోతే చాంతాడంత బాగోతం. ఇక్కడ దెబ్బతిన్నది ఏపీ ప్రయోజనాలే. పెట్టుబడిలో కొట్టేసిన భూ ములేమో ఏపీవి… కంపెనీలు అంటూ కాగితాల మీద చూపించి పండగ చేసుకున్న సంస్థలన్నీ హైద్రాబాద్ లో ఉన్నాయ్. అటు తర్వాతా… కాంగ్రెస్ హయాంలో ఇదే దిక్కుమాలిన బాగోతం. రాష్ట్రాన్ని అడ్డంగా కోసేస్తున్నా పట్టించుకోకుండా మాకేంటి మాకేంటి అంటూ పాకులాడిన ఎంపీలు ఆరుకోట్లమందిని బంగాళాఖాతంలో ముంచారు. లగడపాటి, రాయపాటి, కావూరి, మేకపాటి, సుబ్బిరామిరెడ్డి లాంటి వాళ్లంతా సర్దుకుపోదాం మాకేంటి మాకేంటి అంటూ వ్యాపారాలు కోసం మోకరిల్లి ఇంత వరకూ తెచ్చారు పరిస్థితి. ఆంధ్రా ఎంపీలు చూడండి ఏదో పని చేద్దాంలే అంటే మెదలకుండా ఉంటారు… మీరేంటయ్యా ఎప్పుడూ ఏదో ఒక డిమాండ్ చేస్తారంటూ అప్పట్లో ఆర్థికమంత్రిగా ఉన్న ప్రణబ్… ఓ దశలో తెలంగాణ ఎంపీల మీద కస్సుమన్నారంటే మనోళ్ల పరపతి అర్థం చేసుకోవచ్చు.

ఇపుడు మళ్లీ అదే పరిస్థితి వస్తోంది రాజకీయ మారిన తర్వాత కూడా ! పవన్ చెప్పినట్టు వ్యాపారం చేయొచ్చు కానీ వ్యాపారం కోసమే రాజకీయం చేయకూడదు. వ్యాపారం మాత్రమే చేయకూడదు. అందులోనూ ఆ వ్యాపారం కోసం రాష్ట్రాన్నీ రాజకీయాన్నీ వాడుకోకూడదు. వాడుకున్నా… చూస్తూ చేతులు కట్టుకోకూడదు. ఇన్ని దశలు దాటి కూడా ఇలాంటి వాళ్లు పెత్తనం చెలాయించేస్తే … రాష్ట్రానికి పేను కొరుకుడే మిగిలేది. పెట్టుబడిదారుడెప్పుడూ ఖర్చుపెడతారు… లాభం కోసం ఏమైనా చేస్తాడు. ఎంతకైనా తెగిస్తాడు. కానీ ఆ లాభానికి పెట్టుబడికీ మధ్య – రాష్ట్రం… ఐదుకోట్ల మంది జనం ఉండడమే ఇక్కడ అసలు విషయం. ఈ సంగతి చంద్రబాబు తెలుసుకోవాలి. లేకపోతే ముందు ముందు ముసలం ముదిరిపోతుంది.

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title