ఏపీ పేర్లలో నేముంది ?

Written by

ఏపీలో పేర్లమార్పు మహా యజ్ఞం జరుగుతోంది. ప్రస్తుతమున్న పేర్ల స్థానంలో పాత పేర్లు మళ్లీ పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇదంతా లేని పోని రగడ అంటూ కొందరు… కాదు సాంస్కృతిక పునరుద్ధరణ అంటూ ఇంకొందరు వాదిస్తున్నారు. ఇంతకీ పేర్ల మార్పు ఎందుకు ? మార్చితే ఒరిగేదేంటి ? మార్చకపోతే జరిగేదేంటన్న ప్రశ్నలకి సమాధానాలు కావాలిప్పుడు. కొత్తగా ప్రయాణం మొదలు పెట్టిన ఏపీ… కొత్త పేర్లతో వెళితే… అందులోనూ తెలుగుదనం ఉట్టిపడితే ఐడెంటీగా ఉంటుందని, ఆత్మగౌరవ సూచకమని ప్రభుత్వం భావిస్తోందంటున్నారు. ఇంతకీ వెనక కథేంటి ?

టైటిల్ ఫైట్ ఎందుకు ?

ఊళ్ల పేర్ల మార్పు భారీ స్థాయిలోనే జరగబోతున్నట్టు కనిపిస్తోంది. రాజమండ్రి పేరు రాజమహేంద్రవరంగా మారుస్తామని పుష్కరాలు ముగిసిన తెల్లారి చెప్పారు మఖ్యమంత్రి. నెల్లూరు పేరు కూడా సింహపురిగా మార్చాలన్న ప్రపోజల్ అప్రూవల్ వరకూ వెళ్లింది. జిల్లా పేరు మార్చాలని కాదు… పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అలాగే ఉంటుంది. కాకపోతే పట్టణం పేరు మారుతుంది సింహపురిగా ! దాంతోపాటు ఏలూరు పేరును హేలాపురిగా… మచిలీపట్నాన్ని మళ్లీ బందరుగా పున: ప్రతిష్టిస్తే బావుంటుందన్న మాటలు కూడా ఇటునుంచి ఇటు నుంచి వినిపిస్తున్నాయ్. ఇంతకీ ఎందుకు మార్చాలనుకుంటున్నారు అనే ప్రశ్నకి సమాధానం చెప్పేదెవరు ? తెలుగు చరిత్ర, సంస్కృతి, భవిష్యత్ అనే మూడు కోణాల నుంచి ఆలోచించి మార్పుల రూటు ఎంచుకున్నట్టు చెబుతున్నారు. తెలుగు జాతి తెలుగు జాతి అనుకుంటున్నాం కానీ తెలంగాణ వేరు తెలుగు వేరు అనే వాతావరణం ఓ పక్క నుంచి వస్తున్నప్పుడు మనం మనలా ఉందాం – అంటూ మార్పును సమర్థిస్తున్నవాళ్ల గొంతు వినిపిస్తోంది. గతాన్ని తలపించేలా, వైభవాన్ని పునరుద్ధరించేలా సన్నాహాలు చేద్దాం. దాని కోసమే ఈ మార్పులన్నీ అంటున్నారిప్పుడు. రాజధాని పేరులో తెలుగుదనం ఉట్టిపడేలా అమరావతి అని పెట్టుకున్నప్పుడు… ఇదీ మన చేవ, ఇదీ మన ఘనత అని చాటుకునేలా మిగతా పేర్లు కూడా ఉంటే ఆదో ఆత్మీయానురాగాన్ని ముడివేస్తుందని… దూరతీరాల్లో ఉన్న ఆంధ్రుల్ని కూడా ఆకర్షిస్తుందనే ఆశ ఇందులో ఉన్నట్టు కనిపిస్తోంది.

పేర్లు మార్చడం రాజకీయమా ?

అవునని చెప్పేందుకు ఆధారం లేదు. ఎందుకంటే రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చి చంద్రబాబు ఏం బావుకుంటారు ? నెల్లూరు పేరు సింహపురి అయితే ప్రభుత్వానికికి కలిసొచ్చేది ఏముంటుంది ? ఇవన్నీ నిజానికి వందల వేల ఏళ్ల కిందట ఆ ఊళ్లకి ఉన్న పేర్లే ! సౌలభ్యం కోసం పలికేందుకు సులభంగా ఉందని ఇంగ్లిషు వాడే రాజమహేంద్రని రాజమండ్రిగా మార్చేశాడు. విక్రమసింహపురి పేరు కాలక్రమంగా నెల్లూరుగా మారింది. అలాగే వేంగీ చాశుక్యులు ఏలిన రోజుల్లో హేలాపురిగా పట్టణం క్రమంగా ఏలూరు అయిపోయింది. ఇపుడు మళ్లీ ఆ పేర్లు పెట్టడం అంటే చారిత్రక ప్రాధాన్యాన్ని పునరుద్ధరించడమే అంటోంది ప్రభుత్వం. కాదూ అవునూ అనే వాదనలు ఎప్పుడూ ఉంటాయ్. కడపని కుడప్ప (cuddapah) అని రాశాం దశాబ్దాల పాటు. kadapa అనడానికి మహా యుద్ధం అయిపోయింది. మద్రాస్ చెన్నై అయినప్పుడు… కలకత్తా కోల్ కతాగా మారినప్పుడు… మొన్నీ మధ్య ఒరిస్సా… ఒడిషా అయినప్పుడు కూడా భిన్నాభిప్రాయాలొచ్చాయ్. సహజం.

పేరు మారితే తీరు మారుతుందా ?

పేరు ఎలా వచ్చింది… ఎందుకొచ్చింది… ఎప్పుడొచ్చిందనేది కూడా ఉంటుంది చరిత్రలో. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఎగ్జాంపుల్ కోసం… బెజవాడనే తీసుకోండి. ఎలా వచ్చిందా పేరు ? ఇంద్రకీలాద్రి రెండు భాగాలుగా కలిసిపోయి ఉండేది. ఇప్పుడు గుడి ఉన్నదొకటి. సీతా నగరం కొండ మరొకటి. ఈ రెండింటి మధ్యా చిన్న బెజ్జం గుండా క్రిష్ణ పారుతుండేదట. అది క్రమంగా పెద్దదై రెండూ వేరుపడ్డాయ్. అప్పుడు బెజ్జం ఉన్న ప్రాంతం కాబట్టి బెజ్జవాడ అయ్యింది. కాలక్రమంగా బీజాపూర్ నవాబుల ఏలుబడి ప్రభావం కోస్తా మీద కూడా కొన్నాళ్లు పడింది. ఆ టైమ్ లో ఇది బీజాపూర్ వాడ అని చెప్పుకోవాలన్న తాపత్రయం ప్రభావం చూపింది. అటు బీజ కాకుండా… ఇటు బెజ్జ గానూ కాకుండా మధ్యస్తంగా బెజవాడని కాయిన్ చేసింది. అలాంటి ఊరు పేరుని విజయవాడగా మార్చేసుకున్నాం. అర్జునుడు తపస్సుచేసిన కొండ ఇంద్రకీలాద్రి. అర్జునుడు అంటే విజయుడు కాబట్టి ఆ పేరు అని సరిపెట్టేశారు. విజయ అనేది సంస్కృతపదం. వాడ అంటే తెలుగు. మరి తెలుగు సంస్కృతాల్ని కలిపి దుష్టసమాసాన్ని పుట్టిస్తే దుష్ర్పభావాలు ఉంటాయని కొందరు సంప్రదాయవాదులన్నారు. అందుకే ఇపుడు బెజవాడ మళ్లీ కావాలన్న డిమాండ్ కూుడా వినిపిస్తోంది. చెప్పుకుంటూ పోతే పేరు మార్పులో చాలా కోణాలుంటాయ్.

తెలుగుదనం కావాలి… తెలుగుదనం రావాలి… తెలుగు వాడీవేడీ కనిపించాలి అంటే… కచ్చితంగా కనిపించాల్సిందే ! అది పేర్ల మార్పుతోనే వస్తుందా లేదంటే తీర్చిదిద్దే తీరులోనా అనేది క్రమంగా తేలే సంగతి. ప్రజాభిప్రాయం…పండితాభిప్రాయం…చారిత్రక ప్రాధాన్యం. వీటన్నిటి తర్వాతే రాజకీయం. కడప జిల్లా పేరు మార్చినంత కవ్వింపుగానో… యాదగిరి అంటే తక్కువ చేసినట్టు… అంటూ సంస్కృతిని కించపరుచుకున్నట్టుగానో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇన్ని అనుకుంటాం గానీ అయినా… నేములోనేముంది ? నేమే ఉంది. అంతకు మించి ఏం లేదు.

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title