ఏపీ గుండె ధైర్యం… రాయల సీమ

Written by

తెల్ల లుంగీలు… ఖద్దరు చొక్కాలు… మెలి తిరిగిన మీసాలు…రాటుతేలినట్టు కనిపించే మనుషులు… చేసినాడు… వచ్చినాడు… అని పలికే యాస. ఇదా సీమ ఇంట్రడక్షన్. ఇదా రతనాల సీమని చూసే దృక్కోణం. సినిమాల పుణ్యమా అని ఇదే దృశ్యం ముద్రపడుతోంది మిగతా ప్రాంతాలకి. రాజకీయం చలవతో సీమ బ్యాక్ సీట్ లో ఉండిపోతే… భౌగోళిక అవరోధం వెనకబాటుకి మైలురాయిగా చూపిస్తోంది. నిజానికి వీటిలో ఏది వాస్తవం ? నిఖార్సైన సీమ దృశ్యాన్ని నిలువెత్తు ఠీవీతో ఆవిష్కరిస్తోంది కోస్తా లైఫ్. చెడుకి చెరుపెక్కువ. మంచికి మరుపెక్కువ. అందుకే నెగెటివ్ కి వచ్చే ప్రాధాన్యం పాజిటివ్ కి రాదా అనిపిస్తుంది కొన్నిసార్లు ! సీమ మీద ఎప్పుడూ ఏదో ఓ క్రీనీడ పరుచుకోవడం వందల ఏళ్లుగా అలవాటైంది. దశాబ్దాలు కాదు శతాబ్దాలు గడుస్తున్నాయ్. తెరలు తొలగించి.. పొరలు తెగ్గొట్టే ప్రయత్నమే ఇది.

సీమంటే ఇదేరా …!

పెత్తనం చేస్తారట… దబాయించి దంచేస్తారట… కండబలంతో కోటలు కడతారట.. హైద్రాబాద్లోనూ జెండా ఎగరేస్తారట. ఎన్ని చెప్తాం ? ఎంతని చెప్తాం ? ఒకటారెండా ? ఎవడి ఊహాగానాలు వాడివి. ఇవన్నీ పడిన ముద్రలే. పాదముద్రలు కాదు. సుమో అంటే సీమ అధికారిక వాహనం అయినట్టు… ఫ్యాక్షనిజానికి సీమదే కాపీ రైట్ అయినట్టు చెప్తారెందుకు ? పల్నాడు కనిపించదా ? దివి సీమలో లేదా ఇలాంటి వాతావరణం ? ఇది సీమ మీద రుద్దిన ముద్ర అనడానికి ఇదే సాక్ష్యం. ఆ సంగతి అటుంచి వాస్తవంలోకి వద్దాం. !

రాయలేలిన నేల రతనాల సీమ విశిష్టతలు పొదిగిన వజ్రాభరణం. శతాబ్దాల నాడే వైభవంతో మెరిసిన తెలుగుజాతి కంఠాభరణం. ఒంటరిగా ఎదగడం ఎలాగో చూపిస్తుంది కోస్తా. గుంపుగా గెలిచేది తెలంగాణ. అటు ఒంటరిగా కాక.. ఇటు గుంపు దగ్గరే ఆగిపోక సమూహాల్ని శాసించే నాయకత్వం రాయలసీమ. ఇది నాయకులు పుట్టిన గడ్డ. ఓ రాష్ట్రపతిని ఐదుగురు ముఖ్య మంత్రుల్ని అందించిన నేల. ఉమ్మడి రాష్ట్రంలో సగ కాలం నడిచింది సీమ ఏలుబడే. నాయకత్వ నేర్పు… పరిస్థితులకి తగ్గట్టుగా నాటుకుపోయే తీరు సీమని సింహంలా నిలబెడుతుంది. కల్మషం లేని మనుషులు… కాలుష్యంలేని పరిసరాలు… ప్రకృతి రంగేసినట్టు కనిపించే పచ్చదనంలో నగిషీలు మొలిచినట్టు అనిపించే కొండలు… ఒడిదుడుకుల్ని తట్టుకొని రాటు తేలినట్టు కనిపించే రాళ్లూ రప్పలు. మోటబావులు… తేనెలూరే ఊటల్లాంటి నీటిపాయలు. ఇదీ సీమంటే !

అసలు సీమంటే వాస్తవం వేరు. విస్తృతి వేరు. ప్రకృతి వేరు. మనుషుల తీరూ వేరు. రాయలగడ్డ. దేవుడు కాలుమోపిన సీిమ. వైకుంఠం నుంచి శ్రీనివాసుడు తొలిసారి కుడి కాలుమోపిననేల తిరుమల. అదీ రాయల సీమంటే ! అహోబిలం నారసింహుడు ఆవేశాన్ని రగిలిస్తే… చలువచూపుల మల్లన్న సీమ శైలానికి కాపలా. మంత్రాలయం రాఘవేంద్రుడి బుద్ధి కుశలత పుట్టపర్తి విశ్వాసాల కోవెల. తిరుమల వేంకటేశ్వరుడి వైభవం వెంట రాగా దేవుని గడపలో కడపలో కాలుపెట్టాయ్ సిరిసంపదలు. ఇంత వైవిధ్యం ఇంత ధార్మిక విశిష్టత…ఇన్ని మహిమాన్విత ప్రదేశాలు తెలుగునేలపై మెరెక్కడా లేవు. అందుకే రతనాల సీమ అయ్యిందేమో ! వేంకటేశ్వరుని భక్తికీర్తనలో ఓలలాడించిన అన్నమాచార్యుడు. కలంతో కలకలం రేపిన కడప ఆడపడుచు కవయిత్రి మొల్ల… వీర బ్రహ్మేంద్రుడి భవిష్యత్ కాలజ్ఞానం అన్నిటికీ ఆలవాలం సీమే ! ఇవి రతనాల సీమ ధార్మిక మేథకు కొన్ని ఆనవాళ్లు.

చరిత్ర శిఖరం… వర్తమానం ఘోరం…

ఇంద్ర ధనస్సుతో పోటీపడే జిలుగులతో వెలిగిన విజయనగర సామ్రాజ్య కాలం వరకూ సీమది తిరుగులేని చరిత్ర. అదో శిఖరం. ఆ తర్వాతే తిరోగమనం. రాజనాలు, రతనాల వైభవాన్ని… విజయ నగర సామ్రాజ్య తేజోవిరాజాన్ని సుల్తానుల అండతో కొల్లగొట్టింది నిజాం సంస్థానం. అప్పడు పట్టింది గ్రహణం. పాలెగాళ్ల సాలెగూళ్లు పట్టి పీడించాయ్ కొన్నాళ్లు. అటు పై సంస్థానాలు మారినా సంగతులు మాత్రం మారలా..!. ఏలుబడి మద్రాసుదైనా… ఆంధ్రులదైనా… ఆఖరికి ఆంధ్రప్రదేశ్ దైనా సీమకి పలుకుబడి ఉందిగానీ…గిట్టుబడి లేదు. మాట చెల్లింది. మూట కొందరికే ముట్టింది. సీమకి ఒరిగింది లేదు. గుండె రాయి చేసుకొని సవాళ్లతో సహజీవనం సాగుతోంది దశాబ్దాలుగా ! ఓ ప్రాంతం నీడలో… ఓ పంతం క్రీడలో… భౌగోళిక సమీకరణాల క్రీనీడలో… సీమకి సంకెళ్లు పడ్డాయ్. నిరంతర యుద్ధాలు… అసహనంతో సహజీవనం… పాలెగాళ్ల ముద్రని వదిలించుకునేందుకు పడరాని పాట్లు… అటు తెలంగాణలో ఇమడలేక ఇటు కోస్తాలో కలవలేక రెండావుల దూడలా… అల్లాడిపోతున్న లేగగా సీమ గమనం వర్ణనాతీతం.

సీమలో ప్రతి ఇలాకాలో ఖనిజం ఓ నిజం… బైరటీస్ ఇక్కడి భాగ్యరేఖ. సిమెంట్ ఫ్యాక్టరీలు… అగ్రి ప్రోసెస్ యూనిట్లకి సీమ ఆలవాలం. ఇన్ని వనరులున్నా గుత్తాధిపత్యం గుప్పిట పట్టేసరికి నట్టేట మునిగినట్టు ఒడ్డునపడలేకపోతోంది. అవస్థల పాలవుతోంది సీమ. ఇన్ని వనరులున్నాయ్. ఇచట చిగురు కొమ్మలకైనా చేవ ఉండు… అంటూ శివాలెత్తే పౌరుషరాజసాలున్నాయ్. అన్నిటికీ మించి ఉమ్మడి రాష్ట్రమైనా ముక్కుగా మిగిలిన కొత్త ఆంధ్రప్రదేశ్ నైనా నడిపిస్తున్నది సీమే ! ఇంత హంగూ ఆర్భాటం ఉండి అడుగు ముందుకు పడదెందుకనే ప్రశ్న ఎదురైనప్పుడు సమాధానం తడబడుతుంది. ఆలోచిస్తే అనిపిస్తుంది… అస్థిత్వం కోసం పోరాడే పరిస్థితిలో పడుతోందా రాయల సీమ అని !

అంతేగా ! సంప్రదాయమో… భౌగోళికమో తెలంగాణ అని చెప్పుకుంటోంది ఓ ప్రాంతం. కోస్తా అంటూ ప్రత్యేకత చాటుకుంటోంది మరో చోటు. మరి రాయలసీమ ? గత వైభవానికి చిహ్నంగా అదే ఘనతని గుర్తుచేసుకుంటున్నట్టు ఉంది ప్రాంతం పేరే ! తీరు కూడా అంతే ! రాజధాని త్యాగం చేసి… రాజకీయంలో నలిగి… నీళ్ల కోసం రగిలి ఆక్రోశంతో చూస్తోంది నేటి సీమ. ఇదే వాస్తవం. చరిత్రనెప్పుడూ త్యాగాలతో భోగాలతోనో తూచలేం. వాస్తవాలే కొలమానం. హంద్రీనీవా తప్ప చెప్పుకోదగ్గ ప్రాజెక్టు ఎక్కడ ? సాగరమున్న తీరనిదే నీ దాహమురా అని గుర్తుచేస్తుంది శ్రీశైలం ఆనకట్ట. ప్రాజెక్టు ఉన్నది సీమలో తరలిపోయేది తడిసి పోయేది మాత్రం నైజాం, కోస్తాంధ్రలు. ఇంత కన్నా గుండె కోత ఇంకేముంది ? పోతిరెడ్డి పాడులు పూటకోటిగా పుట్టుకొచ్చే ప్రాజెక్టులన్నీ రాజకీయ కరకట్టలే కానీ… కార్యరూపం దాల్చే ఆనకట్టలు కాదు. దశాబ్దాలుగా వాస్తవం తెలుస్తూనే ఉంది. నీళ్ల మాటెత్తితే సీమ చెంపన జారే కన్నీటి చుక్కలు లీలగా కనిపిస్తాయ్. కన్నీరు కడుపు నింపదు. కసి రగిలించి వదిలేస్తుందంతే !

ఫ్యూచర్ ఆఫ్ రాయలసీమ…

అందిపుచ్చుకునేంత దూరంలో బెంగళూరుంది. ఇటు పక్కన చెన్నై చేతికందుతోంది. అందుకే తిరుపతి ఎదగడం లేదప్పా… అని సరిపెట్టుకునే రోజులకి సెలవు ఇద్దాం ! వలసలతో పలచబడుతూ… సమస్యలతో సలసలమంటున్న సీమకి కావాల్సిందిప్పుడు అభివృద్ధి, ఉపాధి, భవిష్యత్. దాని కోసం ఏం చేయాలన్నదే ఇపుడు అజెండా ! ఏపీకి రెవిన్యూ లోటు ఈ నాల్గు జిల్లాల వల్లే అంటూ ఎర్రచందనం ఎక్స్ పోర్ట్ చేసి సొమ్ముచేస్కుంటే సరిపోదు. రాగి సంకటిని రాష్ట్ర ఆహారంగా ప్రకటిస్తేనో… పట్టిసీమతో ఎత్తిపోస్తేనో… ఒక నాటితోనో ఒక ప్రకటనతో తీరిపోయే సమస్యలు కావివి. కొత్త ప్రయాణంలో అయినా సీమ వాటా సీమకిద్దాం ! గుండె ధైర్యాన్ని నిలబెట్టుకుందాం !

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title