ఏపీ కోసం అడుగేద్దాం… కేంద్రాన్ని అడిగేద్దాం…!

Written by

హోదా హాహాకారాలు రీసౌండ్ వస్తున్నాయ్. సర్దిచెప్పాల్సిన కేంద్రంలో అసహనం కట్టలు తెంచుకుంటోంది. చంద్రబాబులో సహనం నశించింది. తిరుపతి ఆత్మహత్య తర్వాత మూడు ముక్కల్లో సీన్ ఇది. సంబరపడుతున్న వాళ్లు కొందరు. చోద్యం చూస్తున్నవాళ్లింకొందరు. 15తర్వాత పిలుపు వచ్చింది. అప్పుడే మలుపు ఉంటుందని చంద్రబాబు చెబుతున్నారు. ఇంతకీ స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందా ? ఏపీని ప్రత్యేకంగా చూడాలన్న విన్నపం కేంద్రం వింటుందా ? ఉంటేఉండు… లేకపోతే, అవతల మూణ్నెల్లకోసారి ప్రదక్షిణ చేస్తున్న పార్టీ ఎలాగూ ఉందని లెక్క చూసుకుంటుందా ? స్టేట్ పరిస్థితి ఏంటి ? స్టేటస్ ఏం చెబుతోంది ?

ప్రత్యేక ప్యాకేజీ స్టేటస్సా ? హోదానా ?

అసలు ఈ రెండింటికీ తేడా ఏంటి ? డిమాండ్ చేసేశామంటే చేశామని కాదు. పార్టీల మీటింగుల్లో ఎవరో ఏదో అంటే జిందాబాద్ అంటారు మిగతావాళ్లు. ఇలాంటి డిమాండ్ల విషయంలో అలా ఉండకూడదు మనవాటం. హోదా వస్తే ఏం జరుగుతుంది? ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటో చూద్దాం ! హోదా వస్తే రెండు లాభాలుంటాయన్న ప్రచారం ఉంది. కేంద్ర గ్రాంటులో 90 రాయితీ అందులో మొదటిది. రెండోది… ఎక్సైజ్ పన్ను మినహాయింపు. అంటే పరిశ్రమల మీద భారం తగ్గుతుంది కాబట్టి ప్రొడక్షన్ యాక్టివిటీ పెరగడానికి ఉపయోగం కావొచ్చన్న ఆలోచన. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం… 40 % వరకూ పన్నుల ఆదాయం రాష్ట్రాలకే ధారపోస్తామంది కేంద్రం. దెబ్బతో కేంద్రం ఆదాయంలో 2 లక్షల 30 వేల కోట్లు కోతపడింది. అందుకని కొత్త కేటాయింపులు చేసేందుకు విలవిల్లాడుతున్నారు జైట్లీ. ఇక ఎక్సైజ్ పన్నుల్లో మినహాయింపనే కాన్సెప్టే లేదిప్పుడు. వస్తుసేవల పన్ను – జీఎస్టీ ఇవాళ కాకపోతే రేపట్నుంచి అయినా అమల్లోకి వస్తుంది. అదొస్తే ఇక ఎక్సైజ్ డ్యూటీ అనే మాటేలేదు. ఎక్సైజ్, సేల్స్ టాక్స్ అన్నీ అందులోనే ఉంటాయ్. మినహాయింపులకి కూడా కొత్త మార్గదర్శకాలు వస్తాయ్. అంటే… హోదాతో వచ్చేది గ్రాంటులో రిబేటు మాత్రమే. అణాపైసలతో లెక్కేసుకున్నా…ఐదు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా వస్తుందని లెక్కేసుకున్నా ఏపీకొచ్చే బెనిఫిట్ 30, 35 వేల కోట్లు దాటదు.

దీని కోసం పాకులాడాలా ? ప్యాకేజీ అనే పేరులో వైబ్రేషన్స్ ఉన్నాయంటూ లాజిక్ వదిలేసుకోవాలా ? పొలిటికల్ సెంటిమెంట్ అయిపోయింది ప్యాకేజీ అని రాష్ట్రప్రయోజనాల విషయంలో సర్దుకుపోవాలా? సాయం చేస్తామన్నప్పుడు… పంజాబ్ తరహాలో భారీ ఇండస్ట్రీలు కేటాయించమనో
బీహార్ తరహాలో ఆర్థిక ప్యాకేజీ ఇవ్వమనో..యూపీయే హయాంలో రాజస్థాన్ కి చేసినట్టు ప్రత్యేక ఇంప్లిమెంటేషన్ స్టేటస్ ఇవ్వమనో అడగాలా? లేదంటే ప్యాకేజీనే కావాలంటూ సంచి పట్టుకొని ఢిల్లీలో తిరుగుతామా ? లాజిక్ వివరిస్తే వర్గాల రంగులేయడం కాదు… కాళ్లు నేల మీద పెట్టి కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవాన్ని గ్రహించాలి. అప్పుడు తెలుస్తుంది మనం ఏం అడుగుతున్నామో… ఏం అడగాలో !

పన్ను మినహాయింపులు సాధించుకుంటే పరిశ్రమల్ని ఆకట్టుకునేందుకు అంతకన్నా సాధనం మరొకటి ఉండదు. సపోజ్… కేంద్రం నుంచి పవర్ రిబేట్ సాధించుకోల్గితే ఏపీకొచ్చే పరిశ్రమల మీద వేల కోట్ల భారం తగ్గినట్టే. సెంట్రల్ గ్రిడ్ నుంచి పవర్ ఇచ్చే బాధ్యత లేదంటే రీయింబర్స్ మెంట్ చూసుకునే డ్యూటీ కేంద్రం చూసుకుంటుంది అప్పుడు. ఇదో మేజర్ ఎట్రాక్షన్ అవుతుంది ఏపీకి. ఏపీ ఇన్ ఫ్రా ఫండ్ పేరుతో ఓ నిధి ఏర్పాటుచేస్తే ఏపీకొచ్చే పరిశ్రమలన్నిటికీ మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత కేంద్రం చూసుకోవాల్సి ఉంటుంది. భారంఅంతా కేంద్రానిది లబ్దిపొందేది
రాష్ట్రం అవుతుందప్పుడు. భారీ ఇండస్ట్రీలకి బాటలు వేసేది ఇలాంటి మార్పులే. సాఫ్ట్ వేర్ లాంటి ఇండస్ట్రీకి ఇచ్చే MAT-మినిమం ఆల్టర్ నేటివ్ టాక్స్ లాంటి రిబేట్లు తెచ్చుకున్నా ఏపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అద్భుతాలు సాధ్యమవుతాయ్. కాకినాడ విశాఖ విజయవాడ చుట్టుపక్కల సాఫ్ట్ వేర్ కేరిడార్లకి ఇది బాటలు వేస్తుంది.

ఎది ఎగ్జాంపుల్స్ మాత్రమే. అసలు వాస్తవాలు తెలుసుకోకుండా ఏం కావాలో అవగాహన లేకుండా ఏదిబడితే అది మాట్లాడేస్తే విభజన టైమ్ లో జరిగినట్టే ఎదురు దెబ్బలు తగులుతాయ్. రంగాల వారీగా… మనకి కష్టం లేకుండా కేంద్రానికి నష్టం లేకుండా సాధించుకునే మార్గాలు చాలానే ఉన్నాయ్. ఇదేం పవన్ కల్యాణ్ పోరాటం కాదు… ఆర్నెల్ల కోసం గడ్డంపెంచి అడ్డాలోకి వచ్చేందుకు. ఇదేం దీక్షకాదు మూడు నెలలకోసారి మూడు గంటలు కూర్చుకునేందుకు. రాష్ట్ర భవిష్యత్తు. అందుకే ఆచితూచి అడుగేయాలి. అవకాశం ఉన్న ప్రతి రంగంలోనూ పాగా వేయాలి. ఒత్తిడి తెచ్చి ఒడుపుగా సాధించుకోవాలి

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title