ఏపీకేల… హైద్రాబాద్ మీడియా గోల ?

Written by

వోటుకు నోటు వ్యవహారంపై జాతీయ భధ్రతా సలహాదారుతో మోడీ చర్చ

ఏపీ సీఎంను సాగనంపేందుకు రంగం సిద్ధం

ఆధారాలన్నీ ఉన్నాయ్… ఏ క్షణంలో అయినా చంద్రబాబును అరెస్ట్ చేయొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది

సమావేశం తర్వాత చంద్రబాబుతో ఫోటో దిగిన గవర్నర్… అంటే ఏపీ ముఖ్యమంత్రి మారబోతున్నారా ?

ఇలా… లాకులెత్తితే లారీడున్నాయ్ ఇలాంటి బ్రేకింగ్ లు, స్టోరీలు. ఇదంతా కొన్ని ఛానెళ్ల స్వయంతృప్తి. ఏసీబీ స్టింగ్ ఆపరేషన్ నిజానిజాలు బైట పెట్టిందా… కొందరు నాయకుల్ని లోపల పెట్టిందా అనేదాని కన్నా మీడియా నిజస్వరూపాన్ని మాత్రం కళ్లకి కట్టిందని ఠక్కున ఒప్పుకొని తీరాలి. ఎవడి ఆనందం వాడిది… ఎవడి యాంగిల్ వాడిది. ఏ ఛానల్ క్రియేటివిటీ ఆ ఛానల్ ది. చూస్తున్నదెవరు… ఆ జనం గురించి ఆలోచించమా ? ఆ జనం గురించి మాట్లాడమా ? ఇలా ప్రవర్తిస్తే… ఎవరి రాజకీయం వాళ్లు రాసుకుంటూ పోతే సిగ్గుపోతుందన్న ఇంకితం కూడా లేదా ? మీడియా తీరు చూస్తే ఇలాంటి ప్రశ్నలు సవాలక్ష వస్తున్నాయ్. సమాధానం మాత్రం లేదు కనుచూపు మేరలో.

మీడియా ఎథిక్స్…జర్నలిజం…జనం పాయింట్ ఆఫ్ వ్యూ…మోరల్ రెస్పాన్సిబిలిటీ…లాజికల్ థాట్ ప్రోసెస్… ఇలాంటివన్నీ అల్పపీడనంలో ఒక్కసారిగా కొట్టుకుపోయాయ్. రేవంత్ వీడియా బైటకి రావడం మొదలు ప్రతి సీనూ క్లైమాక్సే ! దొరికిపోయాడు… అడ్డంగా బుక్కైపోయిన చంద్రబాబు… ఏపీలో బాబుపై భగ్గుమంటున్న జనం…రాజీనామా తప్ప మరో దారి లేదా ? ఇదే వరస. సగటు మనిషికి ఇక్కడ అర్థంకానిదొక్కటే… వీళ్లు సమాచారం చెప్పాలనుకుంటున్నారా ? పెదరాయుడు తీర్పు ఇవ్వాలనుకుంటున్నారా ? అక్కడున్నది చంద్రబాబు కావొచ్చు… కేసీఆర్ అవ్వొచ్చు… ఇంకెవరైనా గానీ చలించని దృఢవైఖరి… నిస్పాక్షిక దృష్టికోణం అవసరం జర్నలిజానికి. అది లేనప్పుడు ఏం చూసినా ఏం చెప్పినా కబోదితనమే కనిపిస్తుంది. ఎంత మొత్తుకున్నా లబోదిబోమనే అనిపిస్తుంది.

జర్నలిజం…తొలి పాఠాల్లో కఠోరమైన ఓ పదం వాడేవారు దిగ్గజాలు. నార్ల, బూదరాజు లాంటి పితామహుల పాఠశాలలో… అసిధారా వ్రతం అనే మాట గోడ మీద నీతివాక్యం. రోజూ కనిపించాల్సిందే… ప్రతిక్షణం వెంటుండాల్సిందే ! అసిధారావ్రతం అంటే…కత్తి అంచున గమనం అని అర్థం. అంతటి నిబద్ధత, సచ్చీలత ఇపుడు సెలవు తీసుకున్నాయ్. ఇది ఒక్కరోజులోనో ఒక్క పూటలో జరిగింది కాదు. ఓటుకు నోటు కేసు తర్వాత మీడియా అమాంతం శిఖరం నుంచి పాతాళం నుంచి పడలేదు. దశాబ్దాలుగా కొద్దికొద్దిగా దిగజారుతూ వస్తోంది ప్రమాణం. ఇప్పుడా ప్రయాణం వేగవంతం అయ్యిందంతే ! ఓ పార్టీకి కొమ్ముకాసే పత్రిక… ఓ నాయకుడి భజన చేసే కరపత్రం లాంటి మాటలు పదేపదే అదే పనిగా వినిపించడం దీనికి తొలి అడుగు. నిరంకుశత్వం, నీతిమాలినతనం, కనబడితే కలబడతా అన్నట్టుండే బరితెగింపు ఉన్న చోట ఇలాంటివీ ఉంటాయ్. పదేపదే ఓ మాట చెప్పడం … అదే మాటని నిజం చేసేందుకు స్వయంగా రంగంలో దిగడం. ఇక్కడే పడతాయ్ పూర్ణకుంభంలో విషపు చుక్కలు.

ఒకరిని చూసి మరొకరు…వాళ్లన్నారు కదా… వాళ్లు రాశారు కదా మేం రాస్తే తప్పేంటి… అయినా రాయని వాడు ఎవరు ? రాయకపోతే మేం ఉండి ఉపయోగం ఏముందన్న మాటలు ఎక్కువైపోయాయ్…ఆ తర్వాత్తత్వాత. తమిళనాడు లాంటి చోట్ల సొంత మీడియాలున్నాయ్. కేరళలోనూ పార్టీల వారీగా ఛానళ్లు పెట్టేశారు. కానీ దిగజారుడులో మాత్రం మనదే రికార్డ్. పశ్చిమబెంగాల్లో కూడా ఇంచుమించు ఇలాంటి పరంపరే కొనసాగుతోంది. చిట్ ఫండ్ స్కామ్ లో దోచిన సొమ్ముతో పేపరు టీవీ ఛానెళ్లు పెట్డడం… మిగతా మీడియా మీద కక్ష కట్టడం అక్కడా కామన్ అయిపోయింది. కళ్లకి గంతలు కట్టుకుంటుంది కాబట్టి నేషనల్ మీడియాకి ఇలాంటి కంతలు కనిపించవ్.

ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో మొదలైన దిగజారుడు… ఎన్నికలొచ్చేసరికి ఎక్కువైపోయేది. ఇందులోనూ ఒకే వర్గాన్ని అనడానికి లేదు. సోల్ అని చెప్పుకునే పత్రికలు కూడా కొందరికి సోల్ మేట్ అయిపోయే సరికి నిందించడానికి మాటలు వెదుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎన్నికలు సంగతి అటుంచితే ఉద్యమం అంటూ జరిగిన హడావుడి మీడియాని అమాంతం ఒకమెట్టు రెండు మెట్లు కాదు ఏకంగా వందల మెట్లు కిందకి గుంజి పారేసింది. జర్నలిస్టులా కార్యకర్తలా ? (కాట్లకుక్కలంటే బ్లూ క్లాస్ గొడవ చేస్తుంది) అనిపించే స్థాయిలో మారిపోయింది మీడియా. కనిపిస్తే దాడి చేయడం… నిలదీస్తాం అంటూ సొంత అజెండాలతో జెండా ఎగరేయడం అలవాటుగా మారిపోయింది. ఇదే సమయంలో అడ్డగోలు దోపిడీ గాళ్లు… నిన్నమొన్నటి వరకూ ఏం చేశారో చెప్పుకోడానికి జంకేవాళ్లు కూడా ఛానెళ్లు మొదలుపెట్టేసరికి అగమ్యగోచరం అయిపోయింది. ఇలాంటి పావలా మనస్తత్వాలున్న అర్భకులు అధినేతలమని ట్యాగ్ లు తగిలించుకుంటే… మేమే ఉద్యమం చేయిస్తున్నాం అంటూ ప్రగల్భాలు పోతే ప్రమాణాలు పతనం కాక… పండగ చేసుకుంటాయా ?

ఓ నాయకుడికి సొంత భజన బృందం ఉంటుంది. దానిపేరు మీడియా. కదిలితే మెదిలితే అవినీతి అంటుంది. అదొక్కటే ప్రపంచంలో మిగిలి ఉందనుకోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. అటు పక్కన మరో భజన బృందం ఉంటుంది. మన మీద పడ్డారు… పడి ఏడుస్తున్నారంటుంది. అందరూ తమ లాగే ఉంటానుకోవడం వల్ల వచ్చిన సిండ్రోమ్ ఇది. ఇక ఈ రెండూ ఏకమైపోతే ఇంకేముంటుంది ? నాలుగు వారాలుగా తెరల మీద పేపర్లలోనూ కనిపిస్తున్న నరకానికి అసలు కారణం ఇదే. ఎదుటివాడు బురదజల్లుతుంటే మనం కనీసం అడ్డుపెట్టుకోవద్దా అంటూ కొందురు, వాడు కొడితే రెండో చెంప చూపిస్తామా అంటూ ఇంకొందరూ ఒక్కో మెట్టూ దిగడం మొదలు పెట్టేశారు.

మొత్తం ఈ ఎపిసోడ్ లో బైటపడిన విషయం మరోటుంది. ఇందులో ఎక్కడా ఏపీ కోణం లేదు. అక్కడి జనం ఏమనుకుంటున్నారు… వాళ్ల మనోగతం ఏంటి… రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్రచేసినా, సొంత రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రంలో సాము చేసే ప్రయత్నంలో అధికార పక్షం బొక్కబోర్లా పడినా ఐదు కోట్ల గొంతు మాత్రం మ్యూట్ లోనే ఉంటుంది మీడియా దృష్టిలో. ఎందుకంటే ఛానెళ్లు ఉన్నది హైద్రాబాద్ లో… మార్కెట్ ఉందని చెప్పుకునేది హైద్రాబాద్ లోనే కాబట్టి. ఏం చెప్తే ఎవరేమంటారో… ఎన్నాళ్లీ సంకెళ్లని మొత్తుకోవాల్సి వస్తుందేమోనన్న భయంతో లక్క సీలు వేసేసుకుంది ఓ వర్గం మీడియా ! ఆంధ్రా విషయానికొచ్చేసరికి ఇదే వరస. అందుకే మన వాయిస్… మన ఛాయిస్ వినిపిించే మీడియా ఇపుడు తక్షణ అవసరం. మన దగ్గర నడిచే ఛానల్ ఉంటే మన పల్స్ తెస్తుంది కానీ… ఆన్ లైన్ లో ధర్మామీటర్ పెట్టి చెక్ చేశాం అని చెప్పే ఈ దిగజారుడు మీడియాని మనం నమ్మాలా ?

అభి

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title