ఈ బాబు … ఆ బాబేనా..!?

Written by

చంద్రబాబునాయుడు.. ఈ పేరు వినగానే లోటు బడ్జెట్ ఉన్న రాష్ర్టాన్ని టాప్ ఫైవ్ లో నిలిపిన నేత.. రెడ్ టేపిజానికి అలవాటుపడ్డ అధికారయంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన నేత.. హైదరాబాద్ ను సాఫ్ట్ వేర్ కు చిరునామాగా మార్చిన నేత.. జన్మభూమి కార్యక్రమ రూపశిల్పి.. సమర్థుడైన పరిపాలనాదక్షుడు గుర్తుకొస్తాడు.. కానీ ఇదంతా పదిహేనేళ్ల క్రితం మాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పాలించిన ఆ నేతను, ప్రస్తుతం పదమూడు జిల్లాల ఎపిని పాలిస్తున్న ఈ నేతను ఏ విషయంలో కూడా బేరీజు వేసే పరిస్థితి కనిపించడం లేదు.

45 ఏళ్ల వయస్సులో సీఎం పదవి చేపట్టిన చంద్రబాబు పరిపాలనలో పలు మార్పులు తీసుకొచ్చారు. సంస్కరణలు చేపట్టారు. ఆకస్మిక తనిఖీల పేరుతో ఉద్యోగులను పరుగులు పెట్టించారు. ఎంతో ముందు చూపున్న యువనేతగా ఎపికి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. సమర్థులైన మంత్రులతో పరిపాలనపై పట్టు సాధించారు. ఆ రోజుల్లో ప్రజల మధ్య నుంచే వచ్చిన సీనియర్ నేతలే ఆయనకు కోటరీగా ఉండేవారు. దీంతో క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందనే దానిపై ఎంతో కొంత అవగాహన ఉండేది. ఒత్తిళ్లు, మొహమాటాలకు లొంగే పరిస్థితి ఉండేది కాదు. అప్పట్లో చంద్రబాబు వ్యవహారశైలి, ఇప్పటి ధోరణిని దగ్గర నుంచి చూసిన వారికి కచ్చితంగా మార్పు కనిపిస్తోంది.

అప్పట్లో గుంటూరు ఎస్పీ సీతారామాంజనేయులు కౌన్సెలింగ్ పేరుతో ఫ్యాక్షన్ నేతలను పోలీస్ డార్మిటరీల్లో పెట్టి వారం రోజుల పాటు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుండేవారు. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలతో సమానంగా టిడిపి నేతలకు కూడా ఈ మర్యాదలు చేసేవాడు. అప్పటి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి దుర్గాంబ కుమారుడు (ఈయన తరువాత తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కూడా) జూలకంటి బ్రహ్మారెడ్డిని, గుంటూరు నగరంలో పేరొందిన తెలుగుదేశం నేత వాసిరెడ్డి జయరామయ్య లాంటి వారిని వారం రోజుల పాటు ఇలాగే కౌన్సెలింగ్ పేరుతో చిత్రహింసలకు గురిచేశారు. అప్పుడు మంత్రిగా ఉన్న కోడెల, మాజీ మంత్రిగా ఉన్న ఆలపాటి రాజా వీరిని వదిలేయాలని స్వయంగా ఎస్పీని కలిసినా ఫలితం లేదు. సీఎం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. కోడెల లాంటి బలమైన నేత చెప్పింది కూడా ఆ రోజున బాబు పట్టించుకోలేదు. అయినా ఆ నేతలు పార్టీకి నష్టం చేసే కామెంట్లు కానీ, అధినేతను ధిక్కరించే సాహసం కానీ చేయలేదు. అప్పుడు పార్టీలో ఆయన మాట శిలాశాసనం. కానీ ఇప్పుడు…

నిన్న గాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన కేశినేని నాని కూడా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నాడు. ఇక చింతమనేని ప్రభాకర్ దూకుడు తెలిసిందే. (సరిహద్దు గొడవను పక్కనపెడితే) ఒక మహిళా అధికారిపై దాడికి పాల్పడినప్పుడు కనీసం అరెస్టు కూడా చేయించలేకపోయాడు. కొడుకు లోకేష్ తో చింతమనేనికి ఉన్న సన్నిహిత సంబంధాలే ఇందుకు కారణమంటున్నారు. అతన్ని రక్షించేందుకు ఉద్యోగసంఘం నేతలను బతిమాలుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆ రోజుల్లో ఆయనకు పార్టీపై ఉన్న పట్టు ఇప్పుడు లేదని చెప్పడానికే ఇంతకంటే ఉదాహరణ ఏముంటుంది?

ఇక ఉద్యోగులు ఆ రోజుల్లో విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండేవారు. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో అవినీతి పెరిగిపోయింది. ఉద్యోగసంఘాల నేతలు ఏది చెబితే దానికి సీఎం తలాండించే దుస్థితి ఏర్పడింది. సాక్షాత్తు సీఎం కు చెప్పుకో పో అని ఎమ్మార్వోలు ఈసడిస్తున్న సంఘటనలున్నాయి. యంత్రాంగంపై అప్పుడు ఉన్న పట్టు ఇప్పుడు లేకుండా పోయింది. అప్పట్లో నేతలు, యంత్రాంగం ఆయన పేరు చెబితే ఎటెన్షన్ లో ఉంటే ఇప్పుడు డోంట్ కేర్ అంటున్నారు. ఇక అప్పట్లో గుళ్లు, గోపురాలు పట్టుకు తిరగడం, వాస్తు, హోమాల్లాంటి సెంటిమెంట్లు తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు నిద్ర లేస్తే చుట్టూ పండితులు, ముహూర్తాలు. అప్పుడు కోటరీగా ప్రజల నాడి తెలిసిన నేతలుంటే, ఇప్పుడు ప్రజలతో ఏ మాత్రం సంబంధం లేని ఎసి రూముల స్పెషలాఫీసర్లు కోటరీగా మారారు. దీంతో క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో తెలియని దుస్థితి.

అప్పుడు ఎవరి ఒత్తిళ్లూ ఉండేవి కాదు. ఇప్పుడు కుమారుడు లోకేష్ ప్రభావం బాగా పనిచేస్తోంది. కీలక నిర్ణయాల్లో లోకేష్ భాగస్వామ్యం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. పోనీ లోకేష్ కన్నా గ్రౌండ్ లెవల్ ఇన్ఫో ఉందా అంటే అదీ లేదు. ఇప్పుడున్న మంత్రుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దుర్భిణితో వెదికినా సమర్థులు కానరారు. ప్రతి విషయంలో, వివాదంలో మాకేం పట్టిందన్నట్టు వ్యవహరిస్తున్నారు. సంక్షోభ సమయాల్లో అక్కరకొచ్చేవారు లేరు. ఓటుకు నోటు వ్యవహారంలో కెసిఆర్, ఆయన అనుకూల మీడియా సంస్థల మైండ్ గేమ్ లతో పార్టీ, ప్రభుత్వం తల్లడిల్లుతున్న సమయంలో కీలక మంత్రి (ఏ చెట్టూ లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షమన్నట్టు) అని చెప్పుకుంటున్న నారాయణ ఎక్కడున్నాడు. అసలు ఏమైనా మాట్లాడారా? మాట్లాడరు. ఎందుకంటే ఆయనకు తెలంగాణలో విద్యాసంస్థలున్నాయి. వాటి జోలికొస్తారేమోనన్న భయం. ఈ వ్యవహారంలో పయ్యావుల కేశవ్ మీడియా ముందుకొచ్చి మా జోలికొస్తే తెలంగాణ ప్రభుత్వం కూలిపోతుందని ఘాటైన హెచ్చరికలు చేసేవరకు టిడిపి డిఫెన్స్ లోనే ఉంది. ఏ పదవీ లేని కేశవ్ మాట్లాడేవరకు ఈ మంత్రులేమి చేస్తున్నారు? ఇక ఈ వ్యవహారంపై స్ర్టాటజీ సమావేశాలను చంద్రబాబు మంత్రులు పుల్లారావు, మృణాళిని, శిద్ధా, చినరాజప్ప లాంటివారితో నిర్వహించారు. వీళ్లా ప్రభుత్వానికి వ్యూహరచన చేసేది? వీరి ఆధ్వర్యంలోనా ఎపి 2029 నాటికి అగ్రరాష్ర్టమయ్యేది? ఓటుకు నోటు వ్యవహారంలో చినరాజప్ప మీడియా ముందుకొస్తే ఏమి మాట్లాడి ఇరికించేస్తాడోనన్న భయపడిన టిడిపి అభిమానులున్నారు. ఇలాంటివారంతా మంత్రులుగా ఉండడానికి కారణం సీఎం కుమారుడు లోకేష్ కాదా? సమర్థులకిస్తే తన కుమారుడ్ని ఎక్కడ డామినేట్ చేస్తారోనన్న తండ్రి బలహీనత కాదా?

పుష్కరాల్లో సీఎం రాజమండ్రి బస్టాండులో దీనమైన మొహంతో, నిద్ర లేకుండా అర్థరాత్రి బస్సులను కంట్రోల్ చేస్తుంటే రవాణా మంత్రి శిద్దా రాఘవరావు హైదరాబాద్ లో హాయిగా నిద్రపోతున్నారు. అప్పుడుఅశోక్ గజపతిరాజు, కోటగిరి విద్యాధరరావు, వడ్డే శోభనాద్రీశ్వరరావు, కోడెల శివప్రసాద్, సోమిరెడ్డి చంద్రమోన్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, మాధవరెడ్డి, దేవేందర్ గౌడ్ లాంటి క్యాబినెట్ మంత్రులుంటే ఇప్పుడు కిమిడి మృణాళిని, పీతల సుజాత, పరిటాల సునీత, రాజప్ప, మాణిక్యాలరావు, పుల్లారావు, రాఘవరావు లాంటి వారు మంత్రులు. వారికి వీరికి పోలికెక్కడ?

అప్పట్లో చంద్రబాబు మంచి మీడియా మేనేజ్ మెంట్ చేస్తారనేవారు. కొంతవరకు నిజమేనేమో.. కానీ ఇప్పుడు చూస్తే అదంతా అబద్ధమేమో అనిపిస్తుంది. తెలుగుదేశం ప్రతిపక్షంలో పదేళ్లు నానా తంటాలు పడుతుంటే ఎంతోకొంత అండగా నిలబడిన విలేకరుల వైపు ఇప్పుడు కన్నెత్తి చూడడం లేదు (యాజమాన్యాలు ఇందుకు మినహాయింపు) అప్పుడు వైఎస్, కిరణ్‌, వారి మంత్రుల కొమ్ముకాసి, వారి అడుగులకు మడుగులొత్తి, పైరవీలు చేసుకున్న వారు, వ్యక్తిగత ద్వేషంతో విలేకరులమని మరిచిపోయి బాబుపై విషం కక్కినవారు ఇప్పుడు ఆయనకు , ఆయన కుమారుడికి ప్రీతిపాత్రులయ్యారు. అసలు నిజంగా మీడియాను మేనేజ్ చేసే సీన్ ఉంటే జాతీయ ఛానళ్లలో చర్చలకు పార్టీ నుంచి ఇంగ్లీష్ రాని సీఎం రమేష్, పల్లె, వర్ల, నాలుకమందం నారాయణ లాంటి వారిని పంపిస్తారా? తద్వారా తెలుగుదేశం పరువు, ఎపి పరువు తీస్తారా?

అందుకే అనిపిస్తోంది … అసలు ఈ బాబు ఆ బాబు కాదని? నేను మారాను.. మారాను అని చెప్తుంటే చివరకు ఇలా మారారా అని ఆశ్చర్యపోవాల్సి వస్తోంది..

-కల్లూరి

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title