ఆషాడం లో – అందానికి గోరింటాకు ఆరోగ్యానికి మునగాకు

Written by

ఆషాడం ఆదివారం అంటే అతివలకు సందడే సందడి. చక్కని లేత గోరింటాకు రుబ్బి , తమ అరచేతిని ఆకాశాన్ని చేసి అందులో చందమామని,చుక్కలని అందంగా తీర్చిదిద్దుతారు. మెహంది కోన్ లు తెచ్చి జిగిబిగి అల్లికలా ఎంతో ముచ్చటైన ఆకృతులను వేసుకుంటారు. పెళ్ళికాని అమ్మాయిలు తమ చేతులు ఎర్రగా పండితే అందాల రాకుమారుడు తనకి భర్తగా వస్తాడని నమ్ముతారు. అలా పండిన తమ చేతులను అందరికి  గొప్పగా చూపిస్తూ ఆ విషయాన్ని చెప్పకనే చెప్తారు. ఆ సమయములో వారి చేతులకన్నా, సిగ్గు తో వారి బుగ్గలు ఎక్కువ ఎర్ర బడతాయంటే అతిశయోక్తి కాదు.

ఇహ కొంతమంది పెళ్ళైన ఆడవాళ్ళూ ఎర్రగా పండిన తమ చేతులని వాళ్ళ స్నేహితురాళ్లకి చూపిస్తూ తమ భర్తకు తన మీద అంతటి ప్రేమ ఉందని చెబుతూ బడాయికి పోతారు కూడా. హ..హా…ఇలాంటి అపురూపమైన సన్నివేశాలు మన తెలుగు ఇళ్ళలో ఎన్నో తారసపడతాయి. చూసేందుకు ముచ్చటగా !!! పంచుకునేందుకు సంతోషంగా !!! కాదంటారా?

ఆషాడమాసంలో  ప్రత్యేక వంటకం

ఆషాడమాసం లో మునగాకు తినడం శ్రేష్టం. ఎందుకంటే ఈ మాసం లో ఎక్కువగా వచ్చే జలుబు,దగ్గు,జ్వరాలకు ఇది మంచి ఔషధంగా   పనిచేస్తుంది. మునగాకును పప్పులోనూ వేసుకుంటారు మరియు కూరగాను చేసుకుంటారు. ఇప్పుడు మనము ఆషాడ మాస ప్రత్యేక వంటకం అయిన మునగాకు శెనగపప్పు కూర తయ్యారి విధానం తెలుసుకుందామా  మరి…

మునగాకు శెనగపప్పు కూర :
కావలసిన పదార్ధాలు
మునగాకు – 2 కప్పులు
ఉడికించిన శనగపప్పు- 1/2  కప్పు
పచ్చికొబ్బరి – 1/2 కప్పు
పోపుదినుసులు – 1చెమ్చాడు
ఎండు మిర్చి- 2
పచ్చిమిర్చి- 2
కరివేపాకు- 2రెమ్మలు
నూనె  – 2 చెమ్చాలు
ఉప్పు – తగినంత

తయ్యారి విధానము
ముందుగ స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి నూనె వెయ్యాలి. కాస్త వేడెక్కాక  పోపుదినుసులు వేసి కాస్త చిటపటలా డిన తరువాత ఎండుమిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉడికించిన శనగపప్పు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకు వేసి కాసేపు వేయించాలి తరువాత అందులో  తగినంత ఉప్పు, కొబ్బరి తురుము వేసి ఒక్క నిముషం సేపు బాగా  కలిపి స్టవ్ ఆపేసి  కూరను  గిన్నెలోకి తీస్కోవాలి. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన మునగాకు సెనగపప్పు కూర సిద్ధం.

Comments

comments

Article Tags:
·
Article Categories:
Anything Everything

Comments

Menu Title