ఆయుధాలున్నా… చంద్రబాబు వాడుకోడా ?

Written by

ప్రత్యర్థి దాడి చేస్తున్నాడు. పరువు తీస్తున్నాడు. మూలాల మీద దెబ్బ కొట్టేందుకు విఫలయత్నం చేస్తున్నాడు. అయినా చంద్రబాబు ఆయుధాలు వాడుకోలేదా ? అందుబాటులో ఉన్న అస్త్రాల్ని కూడా… ఆయిలేసి తుడిచి పక్కన పెట్టుకున్నారా ? పరిస్థితి చేయిదాటి పోయి జుట్టు ఇపుడు కేంద్రం చేతిలోకి పోయింది. వాటంగా వాడుకునేందుకు బీజేపీ స్కెచ్ గీస్తోంది. అంటే ఇపుడు వ్రతం చెడినా ఫలితం దగ్గనట్టు అనుకోవాలా ? లేదంటే ఇప్పటికీ పుంజుకునేందుకు అవకాశం ఉందా ?

ఇంతకీ విషయం ఏంటంటే… తెలంగాణ ప్రభుత్వంతో వివాదం వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ కి అధారాలున్నాయంటూ ఏపీ ప్రభుత్వం ముందు నుంచి చెబుతోంది. దయాకర్ రెడ్డి లాంటి నాయకులు గట్టిగా ప్రకటనలు చేయగానే తెలంగాణలో పరిస్థితి సద్దుమణిగిపోయింది అమాంతం. ఇంటెలిజెన్స్ ఐజీ సెలవులో వెళ్లడం… డీజీపీ అసలు ఆ విషయాన్నే ప్రస్తావించకపోవడం లాంటివన్నీ ఆ ప్రకటన తర్వాతే. నలుగురు సీనియర్ ఐపీఎస్ లు, ఓ జూనియర్ ఆఫీసర్, ఇద్దరు మంత్రులకి ప్రత్యక్ష ప్రమేయం ఉందని… అందుకు ఆధారాలు ఉన్నాయని కేంద్రంతోనే కాదు గవర్నర్ తో కూడా చెప్పింది ఏపీ ప్రభుత్వం. కానీ వాటిని బైటపెట్టేందుకు మాత్రం ఇష్టపడినట్టు కనిపించలేదు. కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వస్తే రాజకీయంగా ఇబ్బందిలో పడతామని మరోసారి సానుభూతిని రెచ్చగొట్టి టీఆర్ఎస్ బలపడుతుందనే అభిప్రాయంతో కావొచ్చు బాబు కాస్త నెమ్మదించారని సన్నిహితులు అంటున్నారు.

మరిప్పుడు వ్యవహారం హోంశాఖ పరిధిలోకి వెళ్లింది. ఏకంగా కేంద్రమంత్రి ఫోనే ట్యాప్ అయినట్టు ఆధారాలున్నాయని కేంద్ర వర్గాలు సూచన ప్రాయంగా చెబుతున్నాయ్. ట్యాపింగ్ డేటా ఇపుడు టెలికాం కంపెనీల దగ్గర కూడా లేదు తెలంగాణ ప్రభుత్వం దగ్గరే ఉందంటూ ట్యాపింగ్ జరిగిందని నిర్ధారిస్తోంది కేంద్రం. అంటే ఏపీ, తెలంగాణ గుట్టు ఇపుడు కేంద్రానికి బలం అవుతున్నట్టే కనిపిస్తోంది. మొత్తం ఎపిసోడ్ లో నిందలు మోసి… ప్రత్యర్థిని దెబ్బకొట్టే అవకాశాన్ని వదిలేసి చంద్రబాబు అక్కడ భవిష్యత్ కోసం వ్యూహాత్మకంగా అడుగేశారనుకోవాలా ? అవకాశాన్ని వదులుకున్నారనుకోవాలా ?

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title