ఆయనకి ఆయాసం… మంత్రులకి అలసత్వం…

Written by

90ల మొదట్లో ఓ కళ్ల జోడు కంపనీ యాడ్ వచ్చేది. అప్పటి ఇండియన్ క్రికెట్ టీమ్ ఓపెనర్ శ్రీకాంత్ … తనే బ్యాటింగ్ చేస్తాడు. తనే బౌలింగ్ చేస్తాడు. తనే ఫీల్డింగ్ చేస్తాడు. అంపైర్ కూడా తనే! ఇన్ని పనులు చేయాలంటే చూపు చురుగ్గా ఉండాలి కదా..అందుకే మా కళ్లద్దాలు వాడండి

ఇది యాడ్ సారాంశం. ఇపుడు మన కేబినెట్ లో కూడా ఇలాంటి ఫీటే చేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఆయనే సీఎం.. ఆయన హోం… ఆయనే రెవిన్యూ… ఆయనదే టూరిజం… కేంద్రం నుంచి నిధులు తేవాలన్నా ఆయనే… రాజకీయంగా చిక్కులొచ్చిపడి కౌంటర్ చేసుకోవాలన్నా ఆయనే. ఆఖరికి పుష్కరాల్లో బస్సులు ఆపి… జనాన్ని ఎక్కించే బాధ్యత కూడా ఆయనదే. ఏమంటారు దీన్ని ? స్వయంకృతం. వాడుక భాషలో… చేజేతులా కొని తెచ్చుకున్న పరిస్థితి.

చంద్రబాబు డమ్మీ కేబినెట్ కి మమ్మీ. మీడియా ఫ్రెండ్లీ ఐటీ మినిస్టర్ ని అడగండి… ఏపీలో సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ పుంజుకోవాలంటే ఏం చేయాలో ?అడ్డగోలుగా ఛార్జీలు బాదేయడం కాకుండా ఆర్టీసీ ఆర్టీసీ పనితీరు మెరుగుపరచడం ఎలాగో రవాణా మంత్రితో మాట్లాడి చూడండి. డీఎస్పీ స్థాయి అధికారిని మన హోంమంత్రి గైడ్ చేయగలరా ? విద్యాశాఖ మంత్రి… పోటోలకి దండలేసి దండం పెట్టడం కాకుండా ఇంకేం చేశారో కనుక్కోండి. ఆదాయం పెంపులో పైసా పాత్రలేని ఎక్సైజ్ మినిస్టర్ దగ్గర నుంచి గృహనిర్మాణం, పౌరసరఫరాల వరకూ ప్రతి శాఖా… కెవ్వు కేక !

ముగ్గురు నలుగురు సీనియర్లు మినహా మిగతా వాళ్లంతా… అయితే అధికారుల మీద లేదంటే పక్కనున్నవాళ్లపైన ఆధారపడేవాళ్లే తప్ప సొంతంగా అడుగేసేవాళ్లు కాదు. ఇలాంటి వాళ్ల మీదా శైశవ దశలో ఉన్న ఏపీ ఆశలు పెట్టుకునేది ? కుల సమీకరణాలో రాజకీయ ఒత్తిడులో అంతకు మించి భవిష్యత్ వ్యూహమో కానీ చంద్రబాబు మంత్రివర్గం చమమ్ చమక్ అంటోంది.

నువ్వేమి చేశావు నేరం… నీకెక్కడ తగిలింది శాపం…

చంద్రబాబు సింహం లాంటోరు. అంటే అడవిలో పెత్తనం చేయడం కాదు. ఎదురుదెబ్బ తగిలితే తెలుస్తుంది సింహం బతుకెంత దుర్భరమో ! మందురాచే దిక్కుండదు. మిగతా ప్రాణులేవీ సాయం చేయవు. తన గాయాలని తానే నాకుతూ… లాలాజలంతో తగ్గించుకోవాల్సిందే. అప్పటి వరకూ కడుపు మాడుతూ గుహలో ఉండాల్సిందే. చంద్రబాబు కూడా ఇంతే ! సంక్షోభమొచ్చినా ఆయనే ఉండాలి… సమస్యొచ్చినా ఆయనే ఉండాలి… విదేశీటూర్లకి వెళ్లితీర్చిదిద్దాల్సింది ఆయనే… శాఖల వారీ ఫైళ్లతో ఢిల్లీ చుట్టూ తిరగాల్సిందీ ఆయనే ! ఆఖరికి పుష్కరాల పనుకు కూడా ఆయనే చూసుకోవాలి. మంత్రులు మణిపూసలు. తుఫానొచ్చి కొట్టేసినా… పక్క రాష్ట్రం రాజకీయ ఉచ్చు పన్నినా… దుర్ఘటనలు జరిగినా సరిదిద్దడంలో ప్రతిచోటా ఆయనే… ఆంతా ఆయనే ! అంటే… సర్వాంతర్యామి కాదు సర్వం జగన్నాథం టైపు.

చూసినప్పుడు అనిపిస్తుంది. కళ్లు లోపలికిపోయి… ముఖం పీక్కుపోయి కోటిలింగాల రేవులో రాత్రి పన్నెండప్పుడు పనులు పర్యవేక్షిస్తుంటే ఓ పెద్దావిడ అడిగింది… నీకేం కర్మ బాబూ ఎందుకిదంతా ? చెప్పొచ్చుగా ఎవరికన్నా అని. ఆమె ఆప్యాయతతో అనుండొచ్చు. వాత్సాల్యంగా ఆయన తీసుకొనీ ఉండొచ్చు. కానీ సమాధానం వేరు. చెప్పడానికి ఎవరున్నారు… సంభాళించేది ఎవరు ? ఆ జిల్లాలో ఉన్న హోం ని నమ్ముకోలేడు. మరో సీనియర్ ని నిలదీయలేడు ఏదైనా పొరపాటు జరిగితే ! ఇలా ప్రతి చోటా లక్షా తొంభై లిమిటేషన్స్. అందుకే అవన్నీ కలిసి ముందు చంద్రబాబుకి ఆ తర్వాత ఏపీకి స్పీడ్ బ్రేకర్లు అవుతున్నాయ్. ఈ బాబు ఆ బాబేనా అనిపిస్తున్నాయ్. ఉదయం క్రిష్ణా జిల్లాలో.. అదే మధ్యాహ్నం అదిలాబాద్ లో పర్యటించి… సాయంత్ర సుదీర్ఘ సమీక్షలు చేసినప్పుడు కూడా కనిపించని అలసట, పెయిన్ ఇపుడు కనిపిస్తోంది ఆ ముఖంలో ! సీఎం తలనొప్పి అంటే శారిడాన్ తో తగ్గేది కాదు… రాష్ట్రానికి చుట్టుకునేది. అందుకే ఇంత డిస్కషన్.

బాధలు తగ్గాలంటే… భవిష్యత్ నెగ్గాలంటే…

ఏం లేదు సింపుల్. ఆయనకో లెక్కుంటుంది. వారసత్వ వివాదం మళ్లీ రేగకుండా ట్రాన్సిషన్ స్మూత్ గా సాగిపోవాలనో … మరోటో ! దాని కోసం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరనే ఉద్దేశంతో కావొచ్చు ఇలాంటి టీమ్ ని తీర్చిదిద్దుకున్నారు. నేలది తీసి నెత్తికి రుద్దుకున్నారు. సొల్యూషన్ ఈజీనే. ప్రతి మంత్రి పక్కనా ఆల్టర్ నేటివ్ కచ్చితంగా ఉంది. గుంటూరు, ఒంగోలు, వెస్ట్ గోదావరి ఎటు చూసినా పరిష్కారం పక్కనే కనిపిస్తుంది. ఏమనుకుంటారోనన్న మొహమాటమో… లేదంటే ఇంతకు ముందు ఇచ్చిన హామీలో, అదీ కాదంటే అదోరకం బలహీనతనో పక్కనెట్టి… పని తీరు ఆధారంగా బిలో యావరేజ్ ని పక్కకునెట్టి టీమ్ ని ఎనర్జైజ్ చేయాలి. స్టేట్ కి బూస్ట్ ఇవ్వాలి. లేకపోతే నీరసంలోంచి నిస్పృహలోకి జారుకోవడానికి ఎంతోసేపు పట్టదు.

ఉద్యోగుల్ని కదిపితే కోపం. ఎమ్మెల్యేల్ని, మంత్రుల్ని గద్దించాలంటే బెరుకు. కరుకైన నిర్ణయం తీసుకోవాలంటే లేనిపోని ఆలోచన. ఇంత అవసరమా ? “రాజకీయాల్లో సవాలక్ష పరిస్థితులుంటాయ్. ఎవరినీ నొప్పించకుండా …ఒక్కోసారి బాధ కల్గించకుండా నిర్ణయాలు తీసుకోవాల్సుంటుంది. నువ్ బైట నుంచి చూపి మాట్లాడ్డం కాదు. చాలా చూశాం… చాలా మాట్లాడతాం. కడాన కఠిన నిర్ణయాలు కూడా ఉంటాయ్” ఏమైనా అడిగితే ఇలాగే ఉంటుందా రిప్లై కూడా ! అధికారం చేతిలో ఉంది. జనం వెన్నంటి ఉన్నారు… కొండంత లక్ష్యాలున్నాయ్. ఇలాంటప్పుడు కూడా మీనమేషాలు లెక్కపెడితే ఆయాసమే మిగులుతుంది. ఒక్కడే ఎంత చేసినా లేనిపోని ప్రయాసే అవుతుంది. అయినా వన్ మే షో అంటే… ఒక్కడే చేయడమని కాదు అర్థం. అన్నీతానై ఒక్కడే చేయించడం. డిక్షనరీ చూసుకోండి… ప్లీజ్ !

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title