ఆధునిక మహాత్ముడు కలామ్

Written by

శ్రీహరి కోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం. సమయం సాయంత్రం ఏడు గంటలు. చీఫ్ ఇంజినీర్ స్థాయి ఉద్యోగి సీరియస్ గా మానిటర్ మీద పని చేసుకుంటున్నాడు. సడెన్ గా భార్య, పిల్లలూ గుర్తొచ్చారు. ఎక్కడో కలుక్కుమంది. కొడుకు పుట్టిన రోజని సినిమాకి వెళ్లాలని ప్లాన్. ప్రయోగం కోసం తప్పనిసరిగా టార్గెట్ అందుకోవాల్సిన వర్క్. ఇంట్లో పరిస్థితి బాస్ కి చెప్తే… వెళ్లొచ్చుకదా… లెట్ మీ కంప్లీట్ అన్నాడు. వద్దన్నాడు ఇంజినీర్. తన పని తాను చేసుకొని తొమ్మిది గంటలకి ఇంటికి చేరాడు. తీరా చూస్తే పిల్లలు లేరు ఇంట్లో. ఏరి… ఎక్కడ అంటే భార్య చెప్పింది… ఎవరో మీ బాసట… వచ్చి పిల్లలిద్దర్నీ సినిమాకి తీసుకెళ్లారు. ఇదిగో మనిద్దరికీ ఈ స్వీట్లిచ్చారంది. ఆశ్చర్యపోయాడు ఆ ఇంజినీర్. ఆ బాస్ పేరు అబ్దుల్ కలామ్. ఇది జరిగి ఓ నలభై ఏళ్లు అయ్యుంటుంది. ఇస్రో ఉద్యోగులు ఇలాంటి అనుభవాలు, ఆత్మీయ అనుబంధాలు ఎన్నో ఎన్నో చెప్తారు.

వైవాహిక జీవితానికి దూరంగా దేశానికి సన్నిహితంగా ఉన్న కలామ్ ఎప్పుడూ సమూహ వ్యక్తి. సమ్మోహన శక్తి. ఇన్ స్పిరేషన్ కి ఇంజిన్. కాన్సన్ ట్రేషన్ కి కేటలిస్ట్. సైన్స్ గర్వించే శాస్త్రవేత్త గురించి ఇలా కాక ఇంకెలా చెప్తాం ? సైన్స్ కోసం మనిషి కాదు… మనకోసమే సైన్స్ అంటూ ఓ సగటు ఇంజినీర్ గా ఉన్నప్పటి నుంచి కీర్తిపతాకను దిగంతాలకి చేర్చిన భారత రత్నమయ్యేకాదా కలాం జీవితాన్ని తరచి చూస్తే అద్భుతాల ఆనవాళ్లెన్నో ! భారత్, భవిష్యత్ అనే మాటలు లేకుండా ఆయన ప్రసంగం లేదు. సైన్స్, పిల్లలు ప్రస్తావన రాకుండా ఆయన రోజు పూర్తి కాలేదు గత యాభై ఏళ్లలో ! క్లాస్ రూమూ ఓ ప్రయోగశాలే… నాకు ల్యాబ్ అయినా స్పేస్ సెంటరైనా ఒక్కటే. కానీ పాఠశాలంటే అంతకంటే ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ మిస్సైళ్లు కాదు ఇండియా భవిష్యత్ తయారవుతోందనే కలాం మాటల్లో గాఢత ఇప్పటి నాయకులకి ఇక్కడి వ్యవస్థకి సగం అర్థమైనా దేశం ఇంకెక్కడో ఉంటుంది. అప్పటి ఎన్డీయే హయాంలో కలామ్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించి.. బలపరిచి రాజకీయాలంటని ప్రథమ పౌరుణ్ని రాష్ట్రపతి భవన్ కి పంపడంలో ఏపీ పాత్ర ఎంతో కీలకం. అది రాజకీయం.

షార్ తో కలాంది సుమారు యాబై ఏళ్ల ఎమోషన్. ప్రెంచ్ గయనాలో ప్రయోగాలు నిర్వహించే పరిస్థితి మారి… మన తీరం నుంచే గగన తలాన్ని చుంబించే ప్రదేశం -షార్ కాబట్టే ఇది నా జీవితంలో మైల్ స్టోన్ అంటారు కలామ్. అంటే జీవితాన్ని దేశసేవని విడదీసి చూడడం అలాగో తెలియదని ఆ మాటల్లో అర్థమవుతూ ఉంటుంది. పులికాట్ ఆయనకిష్టమైన పర్యాటక స్థలం. హేర్ స్టైల్ గురించి ఆయన్ని ప్రశ్నించిన ఏలూరు చిన్నారులు ఆయన గుండెల్లో పదిలం. కొత్త రాష్ట్రంగా మిగిలి… తొలి అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ వేగాన్ని అందుకునేందుకు ఎంతో సమయం పట్టకూడదని ఆకాంక్షిస్తున్నా – అంటూ విభజన తర్వాత ఆయన ఏపీని ప్రస్తావించిన తొలి, ఆఖరి సారి కూడా ప్రోగ్రెస్ చుట్టూనే తిరిగాయ్ ఆయన మాటలన్నీ ! దటీజ్ కలామ్.

సేవాతత్వానికి మదర్ థెరిస్సా ఎలాగో… విముక్తి పోరాటానికి గాంధీ ఎలాగో… సామాన్యుడి కోసం సైన్స్, దేశం కోసం విజ్ఞానం అనడంలో కలాం అంతకు పదిరెట్లు. అందుకే సైన్స్ లో ఆయన సమోన్నత శిఖరం. అంతరిక్ష ఆవిష్కరణల్లో ఆయన మిలమిల మెరిసే మిల్కీ వే ! మతాలకి అతీతమైన మానవత్వం… రాజకీయాలంటని రాజసం..ఎప్పటికీ వసివాడని పసితనం. ఇవన్నీ కలాం రూపురేఖలు. సౌమ్యుడుగా సామాన్యుడుగా రాష్ట్రపతి భవన్ లోకి ప్రవేశించి… ఐదేళ్ల తర్వాత మళ్లీ అలాగే నిష్క్రమించి… జాతి నిర్మాణంలో మౌనంగా అడుగులు వేసిన మహనీయుడు… ఆధునిక మహాత్ముడు కలామ్.

>>

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title