ఆత్మహత్యలు కాదు… ఆత్మవిశ్వాసమే ఆంధ్రా సమాధానం…

Written by

రాజకీయ రాకాసి మళ్లీ కోరలు చాస్తోంది… ప్రత్యేక హోదా ముసుగులో కబళించేందుకు సిద్ధమవుతోంది. ఆత్మహత్యల పేరుతో పొరుగు రాష్ట్రంలో పేర్చిన చితి మంటలు ఆరనేలేదు. రాష్ట్రమొచ్చినా… ఏడ్చి ఏడ్చి కన్నవాళ్ల కళ్లల్లొంచి రక్తధారలు కురిసినా చలనం లేదు. ప్రాణాలు తీసుకున్న వాళ్ల ఆశయాలు… కుటుంబ సభ్యుల ఆశలు నెరవేరనేలేదు. రాతి హృదయ రాజకీయాలతో కోసం రాలిపోయే యువకులకి నిలువెల్లా అన్యాయమే తెలుస్తూనే ఉండగా మళ్లీ ఇపుడు అలాంటి అలజడెందుకు ? ఏపీలో అలాంటి పరిస్థితి రగిలించేందుకు రాజకీయ
కుట్ర జరుగుతోందా అనే అనుమానాలు ముదురుతున్నాయ్ తిరుపతి ఘటన చూశాక ! బ్రదర్… రాజకీయం రెచ్చగొడితే ఉచ్చులో పడొద్దు.

మిత్రమా… ప్రత్యేక హోదా అయినా ఢిల్లీ నుంచి అందాల్సిన సాయం అయినా ఆంధ్రుల హక్కే. దాన్ని పోరాడి సాధించుకోవాలి. బతికి సంతోషించాలి. చచ్చి ఏం సాధిస్తాం ? ప్రాణం మీదకి తెచ్చుకొని… ప్రాణాలు తీసుకొని ఏం సందేశం ఇస్తున్నాం ? మన కోరిక ఎప్పటికీ నెరవేరదని చెప్పుకుంటున్నామా ? అయినా… ఆంధ్రుల డిమాండ్ శిలాశాసనం కావాలి కానీ మరణశాసనం కాకూడదు. ఒత్తిడి తెచ్చి… చచ్చినట్టు దిగొచ్చి కేంద్రం దిగొచ్చేలా ఏపీకి సాయపడేలా చూడాలి గానీ.. మనం చచ్చిపోకూడదు. సమస్యల్ని ఉరితీయాలి. సంక్షోభాల్ని వెలివేయాలి. హామీల కోసం పోరాడాలి. ఆశయాలు నిలబెట్టాలి. ఇన్ని చేయాలంటే నువ్ ప్రాణాలతో ఉండాలి. చూస్తుండాలి. నీ కలలు నీకళ్ల ముందే నిజమవ్వాలి. నువ్ నీ వాళ్ల కళ్లల్లో కన్నీరు కావొద్దు. అసలు అలాంటి ఆలోచనే రానీయొద్దు.

హోదా కోసం మంటలెందుకు ?

అయినా ప్రత్యేక హోదా వస్తే ఒరిగేదేంటి ? రాజకీయ రాబందులు పబ్బం గడపుకోవడం తప్ప ? ఇప్పటికే ప్రత్యేక హోదా ఉన్న 12 రాష్ట్రాల పరిస్థితి ఏంటి ? ఇప్పుడున్న పోటీలో ఏపీకి వచ్చినా ఇప్పటికిప్పుడు రాత మారిపోదు. కావాల్సింది హోదా కాదు… అంతకు మించిన కమ్మిట్మెంట్. దానికి తోడు కాస్తోకూస్తో సాయం. కమిట్మెంట్ మనకుంది. మన గుడ్ విల్ చూసి… ఇక్కడి అవకాశాలు చూసి పెట్టుబడులు పెట్టేందుకు ఆర్థికంగా మద్దతిచ్చేందుకు దేశవిదేశాలు ఎలాగూ సిద్ధం. సమస్యలకి ఎదురొడ్డి… గెలిచి చూపించాల్సిందిపోయి ఇలా ప్రాణత్యాగాలు చేయాలనుకోవడం అమాయకత్వం. అన్నెంపున్నెం ఎరుగని యువకులకి రాజకీయ పార్టీలు మరో సారి చేస్తున్న ఘోరాతిఘోర అన్యాయం.

రెచ్చగొట్టే రాజకీయంతో జాగ్రత్త !

రాజకీయ నిరుద్యోగులు మంటలు రగిలిస్తారు. అందులో పడి అమాయక యువకులు ఆత్మాహుతి చేసుకుంటారా ? ఇదెక్కడి అనాలోచితం. ప్రత్యేక హోదా పోరాటం ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా రాజకీయ నిరుద్యోగుల ఆరాటంగా మారిపోయింది. వాస్తవం కళ్ల ముందు కనిపిస్తోంది.
తాడూబొంగరం లేని విఫల నటులు…. మట్టానికి తెగిపడిన మొండెం లాంటి కాంగ్రెస్ పార్టీ… ఎప్పటిలాగే చారిత్రక సందిగ్ధంలో ఉన్న తోకపార్టీలు కలిసి కొలిమి రాజేసేందుకు… మన మనశ్శాంతిని కాజేసేందుకు ఊరూరా వస్తున్నారు. మోసపోవద్దు మిత్రమా ! ఆవేశం పెరిగితే… అన్యాయం జరిగిందనిపిస్తే నిలదీద్దాం.. నినదిద్దాం… చివరికంటా పోరాడుదాం ! ఆ పోరాట ఫలాలు అందుకునేందుకైనా మనం ప్రాణాలతో ఉండాలి.

ఆత్మహత్య పిరికితనం. నా మీద నాకు నమ్మకం లేదంటూ ఎవరికి వారు రాసుకునే వీలునామా ఆత్మహత్య. అంత నమ్మకంలేని స్థితిలో ఉన్నామా మనం ? అంత ఆత్మవిశ్వాసం లేనివాళ్లా ఆంధ్రులు ? పోరాటం ఫలిస్తుందని నమ్మితే… పాజిటివ్ దృక్పథమే ఉంటే ఆత్మహత్యల వరకూ ఎందుకు వెళతాం… ఫలితం సాధించేందుకు సంతోషించేందుకు బతికే ఉంటాం. ఉందాం !! నవ్యాంధ్ర నిలబడాల్సింది ఆత్మహత్యల సమాధుల మీద కాదు… నవయువకుల ఆశల పునాదులపైన. తమ్ముడూ గుర్తుంచుకుందాం. పిడికిలి బిగిద్దాం. నిర్మాణానికి సన్నద్ధమవుదాం. రాజకీయాల్లో సమిథలం కావొద్దు. వాస్తవాలు మరవొద్దు.

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title