అవసరమా ఏపీకి స్పెషల్ స్టేటస్ ?

Written by

ఓ పక్క నుంచి బస్సు యాత్ర. ఇంకోపక్కన ఢిల్లీ మినీ దీక్షతో కొత్త పాత్ర. హోదా ఇవ్వాల్సిందేనంటూ విఫల హీరోలు, లేత నాయకుల డిమాండ్లు.
వెంకయ్య ఏం చేస్తున్నారంటూ పల్లెతుమ్మల పాలెంలో ఎవరో మీడియా ముందు చెలరేగిపోతాడు. కేంద్రం మోసం చేసిందంటారు కొందరు. కాదు చంద్రబాబు అసమర్థుడు అంటూ ముద్ర గుద్దుతారు ఇంకొందరు. కేంద్రం నుంచి తప్పుకోవాలన్న డిమాండ్లు… మాట ఇచ్చారు కాబట్టి కేంద్రం ఒప్పుకోవాలన్న సుతిమెత్తని సవరింపులు. హోదా వాయుగుండం తుఫాన్ గా మారుతుందో… తీరాన్ని దాటుతుందో ఇప్పటికిప్పుడైతే ఏం చెప్పలేం. హోదా అవసరమా ? కాదా ? అంటే చెప్పేయొచ్చు సింపుల్ గా. మనకి కావాల్సింది ఏపీకి ప్రత్యేక హోదానా ? రాష్ట్రం లాభపడడమా ? అనే ప్రశ్నకీ ఈజీగానే సమాధానం దొరుకుతుంది.

హోదా ఎందుకు బ్రదర్ ?

విభజన సమయంలో చెప్పారు కాబట్టి ఇవ్వాలి అని మాత్రం చెప్పకండి సమాధానం. ఆ డిమాండ్ ఒక్కటే తెలుసు కాబట్టి అదే చేస్తున్నాం అని కూడా చూస్తూచూస్తూ ఒప్పుకోనివ్వదు రాజకీయం. దాని ఫలితమే ఇంత గందరగోళం. హోదా అంటే ఆంధ్రుల హక్కు అనే నినాదం మొలకెత్తింది ఇలాంటి పరిస్థితి నుంచే ! ఆంధ్రుల హక్కు హోదా కాదు. డెవలప్ కావడం… దానికి కేంద్రం సాయం కోరడం. ఆ సాయం హోదా వల్ల వస్తుందా… లేదంటే రాయితీలతోనా … లేదంటే పరిశ్రమలకి ఇచ్చే ప్రత్యేక ప్రోత్సాహకాలతో సాధిస్తామా అనేది ఇపుడు చర్చించాల్సిన విషయం. మట్టానికి పడిన ఏపీ లాంటి రాష్ట్రానికి పిల్లర్లలా పనిచేసి, అమాంతం పైకి లేపే విషయాలు కొన్నున్నాయ్. పారిశ్రామిక ప్రోత్సాహకాలు, ఆర్థిక సాయం లాంటివి. ఇలాంటి వాటి మీద దృష్టిపెడితే… హైబ్రీడ్ మొక్కలతో కాపు కాయించినట్టే. ఏపీకి అమాంతం ఊపు వచ్చేసినట్టే !

ప్రస్తుతం ఆర్థికంగా ప్రపంచం కుదేలైపోయి ఉంది. దేశంలో ఎక్కడా ఫినాన్షియల్ యాక్టివిటీ, ఇన్వెస్ట్ మెంట్ లేదు. సాక్షాత్తూ కేంద్రమే స్వచ్ఛ్ భారత్, పెంక్షన్ యోజన లాంటి ఫంక్షన్లు చేస్తోంది తప్ప భారీ ప్రణాళికల జోలికి వెళ్లకపోవడానికి కారణం ఇదే. ఇలాంటి సమయంలో మనం కనుక అద్భుతమైన పారిశ్రామిక రాయితీలతో పరిశ్రమల్ని ఆకర్షించగల్గితే ఏపీకి జవసత్వాలు రావడానికి కనీసం 30 % శాతం అవకాశాలు మెరుగుపడతాయ్. అభివృద్ధికి ప్రొటీన్ లాంటి ఇన్వెస్ట్మెంట్, ఇండస్ట్రీ ఫస్ట్ ప్రయారిటీ కావాలి ఇలాంటప్పుడు. దీంతోపాటు ఆర్థికసాయం. ప్రణాళికలో ఇస్తారో… ప్రత్యేక ప్యాకేజీగా ఇస్తారో… పాలసీనే తెస్తారో… చూడాలి. ఇప్పటికిప్పుడు ఓ 50 వేల కోట్లు కేంద్రం ఇస్తే… అమాంతం అద్భుతం చేస్తుంది ఏపీ. ఇక ప్రత్యేక హోదా లాంటివన్నీ దీనిముందు దిగదుడుపే !

హోదా ఏంటి ?

ప్రత్యేక హోదా అంటే ఇప్పుడు మనం చూస్తున్న రిజర్వేషన్ లాంటిది అనుకుందాం. కేంద్రం వాటాల్లో గ్రాంటుల్లో సాయంలో దాదాపు 90 శాతం వరకూ రాయితీ, వడ్డీ మినహాయింపులు, ప్రభుత్వ సంస్థలూ వస్తాయ్. కేంద్రం ఇపుడు రాష్ట్రాలకి కొత్తగా 32 శాతం వరకూ నిధులిస్తున్నామ్ అంటోంది. సవరణలు చేశాం… ఇక అభివృద్ధి పనులు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అంటూ ప్రణాళికా సంఘమే కాదు మోడీ కూడా ప్రకటనలు చేశారు. కానీ వాస్తవం వేరు. కేటాయింపుల్లో కోత పడింది. వసూళ్లు పడిపోయాయ్ ఇవ్వాల్సినవి ఇస్తాం అంటూ పేపర్ మీద లెక్కలు చూపిస్తూ నెట్టుకొచ్చేస్తోంది కేంద్రం. ఇవ్వాల్సినవే ఇచ్చే పరిస్థితి లేనప్పుడు… కొత్తగా ప్రత్యేక హోదాతో ఏం సాధించేది ఉంటుందో అర్థం కాదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు హోదా వచ్చినా ఎగిరిగంతేసేందుకు ఏం లేదు. మహా అయితే ఇపుడు యాగీ చేస్తున్న రాజకీయ నాయకులకి ఓ ఇష్యూ తగ్గుతుంది. కొత్త గొడవ ఎత్తుకోవాల్సి ఉంటుంది. అంతే !

ఇప్పటికే హోదా ఉన్న 12 రాష్ట్రాలూ గోళ్లు గిల్లుకుంటున్నాయ్. ఈశాన్య రాష్ట్రాలకి అదనంగా ఒరిగిందేేం లేదు హోదాతో ! 30 శాతం కొండ ప్రాంతాలుంటే ఇస్తారు… సగం కరువు జిల్లాలుంటే ఇస్తారు అంటూ పరామీటర్లు చెప్పుకుంటూ సాధించిన రాష్ట్రాలు పొడిచేస్తున్నది ఏమీ లేదు. మరి అలాంటప్పుడు గుడ్డిగా వేలాడ్డం దేనికి ? కేంద్రంలో బీజేపీ మూడ్ హోదా ఇచ్చేలా లేదు… చంద్రబాబు ఇప్పటికిప్పుడు తెచ్చేలా లేడు కాబట్టి ఇంకొన్నాళ్లు ఇది మనకి తెరచాపలా ఉపయోగపడుతుందనే లెక్కతో పార్టీలు హోదాకి ఎదురీదుతున్నాయ్. ఇదే వాస్తవం. హోదా వచ్చినా రేపో మాపో రుజువయ్యే నిజం కూడా ఇదే !

వంతెన కాల్చేద్దామా ? వాదన వినిపిద్దామా ?

హోదా కోసం తెగదెంపులు చేసుకోవాలి కేంద్రంతో… హోదా కోసం రాజీనామా చేయించాలి ఎంపీలతో… లాంటి డిమాండ్లు వస్తున్నాయ్ ఏపీలో. నవ్వాలో ఏడవాలో తెలియని వరస ఇది. రాజీనామాలు చేసి చావుదెబ్బతిన్న అనుభవం ఏడాదిన్నర కిందటే ఎదురైంది. ఏం నేర్చుకున్నాం ? పైగా అప్పటితో పోలిస్తే పరిస్థితి ఇపుడు మరింత రాటుదేలింది. కేంద్రంలో ప్రభుత్వం ఏమైనా ఏపీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉందా ? మద్దతు ఉపసంహరించుకుంటే హోదా ఇవ్వడానికి ? మనసులో ఏదో పెట్టుకొని… మైండ్ లో ఇంకేదో కోరుకుంటూ హోదా సాకుతో చేసే కుటిల రాజకీయం ఇదంతా ! ఇలాంటివన్నీ ఇపుడు జనానికి అర్థమైపోతున్నాయ్. కాబట్టి పెద్ద ఆందోళన అవసరం లేదు.

కేంద్రానికి రాష్ట్రానికి మధ్య చెక్కల వంతెనుంది. అదే మద్దతు. కేంద్రాన్ని చేరడానికి లేదంటే కేంద్రం మనవైపు చూడడానికి కారణం ఇదే. ఆ వంతెన మీద వాటంగా అడుగేసి ఢిల్లీ నుంచి ఏం తెచ్చుకోగల్గుతాం ? ఎంత తెచ్చుకోగల్గుతాం అనేది మాత్రమే పాయింట్ ఇక్కడ. కేంద్రం ఎక్కువ ఇచ్చేయాలని ఒత్తిడి తెద్దామని ఆరాటపడితే ఆ బరువుకి వంతెన విరుగుతుంది. అలా కాదు… అంతు తేల్చుకుందాం అంటూ నిప్పు పెడితే వంతెన కాలుతుంది. కాపురం కూలుతుంది. అంతకు మించి ఏం జరగదు. అంటే ఏ మాత్రం ఎక్స్ ట్రీమ్ కి వెళ్లినా దెబ్బ పడేది… నష్టం జరిగేది మనకే. ఇలాంటప్పుడు పబ్బం గడుపుకొనే రాజకీయాల కోసం హోదాని వాడుకోవడం రియల్లీ ఇంజ్యూరియెస్ టూ ఏపీ’s హెల్త్.

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title