అమ్మో… గుంటూరు దేశంలోనే టాప్ ?

Written by

వాన దేవుడు హ్యాండిచ్చాడు. ఆగస్ట్ వచ్చినా ఆకుమడులు లేవు. పంట తడులూ కనిపించడం లేదు. కరువుకి ముందు దశలో ఉంది ఏపీ. అసలే రియల్ ఎస్టేట్, రాజధాని, ఎఫెక్ట్ క్రాప్ హాలిడే దెబ్బతో సాగుభూమి డైటింగ్ చేసినట్టు డ్రాస్టిక్ గా తగ్గిపోతోంది. వరికి ఉరి పడుతోంది. ఇదే పెద్ద ఆందోళన అనుకుంటే ఇంతకు మించిన బాంబు పేలుస్తోంది నేషనల్ సర్వే ఒకటి. వరి పండించినా తినడం తగ్గిపోయింది. ఇపుడు ఈ ధోరణి మితిమీరిపోతోందంటూ గుండె చెదిరే లెక్కలు బైటపెట్టింది. కొత్త లెక్కల ప్రచారం కోస్తాలో వరి అన్నం తినడం మానేసిన వాళ్ల సంఖ్య కోస్తాలో వేగంగా పెరుగుతోంది. గత పదేళ్లలో దాదాపు 35 శాతం మంది అన్నం నుంచి ఆల్టర్ నేటివ్స్ వైపు వెళ్లిపోయారు. మంచిదేగా సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయ్ అంటారా ? అదికాదు విషయం. సైడ్ ఎఫెక్ట్స్ తగ్గకపోగా ఖర్చు అమాంతం పెరిగిపోతోంది కొత్త అలవాటుతో.

షుగర్ వచ్చిందనో… బరువు పెరుగుతున్నామనో ఓట్స్ సోయా లాంటివి తింటున్నవాళ్ల సంఖ్య 13 జిల్లాల్లో వేగంగా పెరుగుతోంది. కొత్తగా అర్బనైజేషన్ కనిపిస్తున్న గుంటూరు లాంటి చోట్ల అయితే ఈ మార్పు మరీ ఎక్కువగా ఉంది. ఆహార అలవాట్లు అనూహ్యంగా మారిన ప్రాంతాల్లో గుంటూరు, కరీంనగర్ దేశంలోనే టాప్ లో ఉన్నాయ్. ఇక్కడ అన్నం, ఇతర సంప్రదాయాల ధాన్యాలు మానేసి దిగుమతి చేసుకున్న ఫుడ్ తినేవాళ్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ తిండి మోజులో పడి మన గింజ ధాన్యాల్ని పూర్తిగా వదిలేశాం. కొర్రలు, రాగులు, సజ్జలు, బొబ్బర్లు లాంటివి పూర్తిగా మర్చిపోతున్న పరిస్థితి కనిపిస్తోందంటూ సర్వే హెచ్చరిక చేస్తోంది. ఓట్స్ సోయాకి తోడు ఇపుడు కొత్తగా క్వినోవా వచ్చిపడుతోంది. ఆరోగ్యానికి మంచిందంటే కిలో 1500 పెట్టి కొని జాగ్రత్తగా వాడేందుకు సిద్ధం అవుతున్నాం తప్పితే… మన దగ్గర దొరికే తృణధాన్యాల జోలికి మాత్రం పోవడం లేదు మనం. అందుకే ఇపుడు కంపారిటివ్ స్టడీ వచ్చింది మన కళ్లు తెరిపించేందుకు. మన దగ్గర పండే సజ్జలు కొర్రలు క్వినావోతోనో… వందలు పెట్టి కొనుక్కొనే మరో ధాన్యంతోనో పోలిస్తే ఎంత బెటరో ఈ లెక్క చూస్తే తెలుస్తుంది.

క్వినోవా, సోయాలతో పోలిస్తే...

– మన జొన్నలు కొర్రల్లో బ్లడ్ షుగర్ తగ్గించే గుణం ఎక్కువ
– కొలెస్ట్రాల్ తగ్గించే బరుగు తగ్గేందుకు కొర్రలే ఎఫెక్టివ్ గా పనిచేస్తాయ్
– యాంటీవైరల్, యాంటీ కేన్సర్ గుణాలు కూడా మన కొర్రల్లోనే ఎక్కువ
– క్వినోవా కన్నా కొర్రలే 30 % ఎనర్జీ ఇస్తాయ్
– కీళ్లనొప్పులు తగ్గించే ఫైవర్ కూడా మన గింజధాన్యాల్లోనే అధికం

ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా… ఎక్కువ ఖర్చుపెట్టి మనం ప్యాక్డ్ ఫుడ్, ఫారిన్ బ్రెడ్ కోసమే వెంపర్లాడ్డం ఎందుకు ? దీనికి రెండు కారణాలున్నాయ్. ఎక్కడి నుంచో వచ్చిందని గొప్పకి పోవడం ఒకటి. రెండోది అవగాహన లేకపోవడం… అందుబాటులో దొరక్కపోవడం. గత ముప్ఫై ఏళ్లలో గింజ ధాన్యాల సాగు పూర్తిగా తగ్గిపోయింది. అయితే వాణిజ్యం పంటలు… లేదంటే నీళ్లు ఎక్కువ తాగేసే వరి వేసేందుకే కోస్తా మొగ్గు చూపుతోంది. ఇప్పటికైనా ట్రెండ్ మార్చి ఈ చిరు ధాన్యాలవైపు మళ్లితే ఆదాయంతోపాటు ఆరోగ్యం కూడా వస్తుంది ఏపీకి. పైగా కరువు లాంటి ఎఫెక్ట్ కూడా వీటిమీద కనిపించదు. కాస్త వర్షం పడినా చాలు. ముందు జనం ఆలోచించాలి. అటు ప్రభుత్వం కూడా కళ్లు తెరిచి రంగంలోకి దిగితే బెటర్.

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title