అమరావతి బండికి గుర్రాలు కడుతున్నారోచ్…

Written by

రాజమండ్రి నుంచి పన్నెండు రోజులు పరిపాలన సాగించాక అమరావతికి దారి తెలిసిసొచ్చినట్టుంది ప్రభుత్వానికి. అందుకే రాజధానికి తరలి వెళ్లేందుకు సాధ్యాసాధ్యాలు చూడాలంటూ వర్క్ స్పీడప్ చేస్తోంది. బెజవాడ, అమరావతి నుంచి పాలన సాగితే కొంత ఊపొస్తుందని… జనంలో నమ్మకం, భరోసా వస్తాయని కొన్ని నెలల నుంచి చర్చ జరుగుతున్నా..ప్రతిపాదనలేవీ మెటీరియలైజ్ కాలేదు. భారీస్థాయిలో షెడ్లువేసి గుంటూరు నుంచి పాలన సాగిస్తారని జనవరిలోనే టాక్ వచ్చినా సిబ్బంది సహకరించడంలేదని… ఇప్పటికిప్పుడు హైద్రాబాద్ వదిలి రమ్మంటే ఎలా అంటూ కొందరు మంత్రులూ సణుగుతున్నారని కొంత స్పీడు తగ్గినట్టుంది. ఏడాది దాటిపోవడం..అమరావతి నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ కూడాజరగబోతున్న సమయంలో ఇక గేర్ మారుతోందిప్పుడు.

అమరావతిలో ఉన్న పరిస్థితులు… ఇప్పటికిప్పుడు రాజధానిని తరలించేందుకు ఉన్న అవకాశాల్ని అంచనా వేసేందుకు ఐదుగురు అధికారులతో కమిటీ వేసింది. పంచాయతీ రాజ్ కార్యదర్శి లవ్ అగర్వాల్, ఆర్ అండ్ బి ముఖ్యకార్యదర్శి శ్యాం బాబు, మున్సిపల్ కార్యదర్శులకి ఆ బాధ్యతలు అప్పగించింది. వీళ్లతోపాటు క్రిష్ణ గుంటూరు కలెక్టర్లు కూడా రంగంలోకి దిగుతారు. సాధ్యమైనంత త్వరగా రిపోర్ట్ ఇవ్వాలంటోంది ప్రభుత్వం.ఈ తతంగం అంతా మరో నెల రోజులు పట్టే అవకాశముంది. అంటే దసరా నాటికి రాజధానికి ఊపొస్తుందని ఆశించవచ్చనే అనిపిస్తోంది.

ఎందుకు ? ఎలా ?

పరిపాలనాపరమైన సమీక్షలన్నీ విజయవాడలో చేసేందుకు నిజానికి అవకాశముంది. నీటిపారుదల శాఖ సమీక్షలు లాంటివన్నీ ఇప్పటికే బెజవాడలో జరుగుతున్నాయ్. మిగతా వ్యవహారాల్లో మాత్రం పెద్దగా చురుకు లేదు. ఆగస్ట్ 15 వేడుకలు వైజాగ్ లో జరపాలనుకున్నప్పుడు పరిపాలన కూడా ఇక్కడ నుంచే చేస్తే ఓ సందేశం వెళుతుంది జనంలోకి. అందుకోసమే ఇపుడు కాస్త జోరు పెరుగుతున్నట్టుంది. అమరావతి చుట్టుపక్కలే కార్యకలాపాలు మొదలైతే… హైద్రాబాద్ చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది. ప్రభుత్వం పనిచేస్తోందన్న నమ్మకం కుదురుతుంది. పైగా అమరావతి పనులు మొదలైతే… ఎలాగూ పదేపదే రావాల్సి ఉంటుంది కాబట్టి ఇక చలో అమరావతి అనేందుకు గ్రౌండ్ రెడీ అవుతోంది.

ప్రభుత్వం వస్తే ఇక రాజకీయ వ్యవహారాలు మీడియా లాంటివన్నీ కూడా గుంటూరు బెజవాడల్లో వాలిపోవాల్సి ఉంటుంది. ఇప్పటికే గుంటూరు వైపు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఏర్పాటు సన్నాహాలు జరుగుతున్నాయ్. సమీక్షలు సమావేశాలు అన్నీ ఇక్కడేనంటున్నారు తమ్ముళ్లు. వ్యవహారాలన్నీ ఇక్కడే ఉంటే మీడియా కూడా చచ్చినట్టు ఇటు రావాల్సిందే. అపుడు హైద్రాబాద్ వాసనలు తగ్గుతాయ్. ఎవరెవరినో మెప్పించేందుకు లేనిపోని రాతలు రాసే నొప్పీ ఉండదు. అంటే అమరావతి తరలింపు ఒక్కపెట్టున నాలుగైదు సమస్యలకి పరిష్కారం చూపించబోతోందన్నమాట. మరింకెందుకు లేట్. అమరావతికి స్వాగతం.

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title