అమరావతిని కమ్మేస్తోందా అరాచకం ? – నిజమేంటి ?

Written by

వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ … అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై ! ఈ వ్యాఖ్యనికి అర్థం చెప్పగలదా అమరావతి ? ఆశల స్వర్గం, అవకాశాల అద్భుతం అంటూ మనం గొప్పగా చెప్పుకుంటున్న అమరావతి ఇప్పుడెక్కడుంది ? ఏ స్థితిలో ఉంది ? ఓ ఆడపిల్ల నిర్భయంగా కంప్లైంట్ చేయలేని చోటు… ఓ ఆడపిల్ల వేదనని తీర్చలేని చోటు… ఓ ఆడపిల్లకి భరోసా ఇచ్చి రక్షణ కల్పించలేని చోటు రాజధాని అయితేనేం? రచ్చ బండ అయితేనేం? ఇంత గొప్పగా చెప్పుకుంటున్న అమరావతి అసలు స్వరూపం ఇదేనా ? అమరావతి క్రిష్ణానది ఒడ్డున కాదు ప్రమాదపు అంచుల్లో ఉందనేందుకు ఇదే ఉదాహరణ అంటోంది రిషితేశ్వరి ఎపిసోడ్. – ఇదంతా సోషల్ మీడియాలో… పక్కలో బల్లెం చేస్తున్న కామెంట్స్.

ఇదే హాట్ టాపిక్. ఇదే లైన్ మీద జరుగుతోంది చర్చంతా! నిజమేనా? నాగార్జున క్యాంపస్ లో గర్జనల వెనకున్నది ఎవరి ఘోష ? రిషితేశ్వరి మరణం ఘోర విషాదం. బతుకును తీర్చిదిద్దాల్సిన క్యాంపస్ ఇలా సమాధికి వేదిక కావడం ఇంకా దారుణం. ఇద్దరి విద్యార్థుల వేధింపులు… ఓ సీనియర్ సహచరి సాధింపులు.. ప్రిన్సిపాల్ పట్టించుకోనితనం ప్రాణం మీద్కి తెచ్చాయని సూసైడ్ లెటర్ రిషితేశ్వరి ఆత్మఘోషని కళ్లకి కడుతోంది. క్యాంపస్ రెండుగా చీలిపోవడం… కులాల వారీగా ఆందోళనలు ఇదంతా తర్వాత కథ. చర్చంతా అమరావతిపైకి… ఓ సామాజిక వర్గం మీదకి మళ్లుతోంది. అసలు కారణమేంటి ?

అసలేమైంది ? కావాలి ప్రశ్నలకే జవాబులు…

రిషితేశ్వరి ప్రాణం ఊరికే పోలేదు. వేధింపులు, సాధింపులు బలితీసుకున్నాయ్. ఇంత జరుగుతున్నా… వర్సిటీ అధారిటీ ఏమైందో… యంత్రాంగం ఎక్కడుండో అర్థంకాదు. రాష్ట్ర మంత్రి వెళ్లి నివాళులు అర్పించి… దండం పెట్టి వచ్చేశాడు. వర్సిటీకి ఏకంగా పదిరోజుల సెలవులు ఇస్తేగానీ పరిస్థితి అదుపులోకి రాదంటే ఉన్మాదం ఏ స్థాయిలో ఉన్నట్టు ? వర్సిటీ రెండుగా చీలిపోయినపుడు… ఓ వర్గం ఏంచేసినా చెల్లుబాటు అయ్యే పరిస్థితి నడుస్తున్నప్పుడు ఇలాకాక ఇంకెలా ఉంటుంది ? కంప్లైంట్ తీసుకోమంటే ప్రిన్సిపాల్ తీసుకోడు. ఆ ప్రిన్సిపాల్ మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా వీసీ పట్టించుకోడు. టీచింగ్ స్టాఫ్ లో దాదాపు 60% అదే వర్గం. స్థానిక రాజకీయం సపోర్ట్. ఇది కూడా సమస్యకి చాలా వరకూ కారణమే ! ఓ వర్గం ఓ వర్గం అంటూ వేలెత్తి చూపించడానికి అసలు అవకాశం ఇక్కడే దొరుకుతోంది.

ఇదే అదునుగా కొందరు కడుపు మంట తీర్చుకునే ప్రయత్నమూ చేస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన రిషితేశ్వరి కుటుంబం మూలాలున్నది విజయవాడలోనే. తండ్రి ఉద్యోగం హన్మకొండలో. వేధించిన ఇద్దరు యువకుల్లో ఒకరు తూర్పుగోదావరి ఎస్టీ. మరొకరు ఉత్తరాంధ్ర బీసీ. వేధించిన సీనియర్ విద్యార్థినిది తెలంగాణ రెడ్డి సామాజికవర్గం. కుల సమీకరణాలు చెప్పి… విషయాన్ని దారి మళ్లించడం కాదు. ఓ వర్గం ఓ వర్గం అంటున్న మాటలో వాస్తవం ఎంతో తెలియజెప్పడమే. అయినా ఇక్కడ చూడాల్సింది కులాన్ని కాదు వాస్తవాన్ని.

అమరావతికీ రిషితేశ్వరి ఘోరానికి ఏంటి సంబంధం ?

రాజధానిగా అమరావతి పేరు ప్రస్తావించినప్పుడే కొన్ని కనుబొమ్మలెగిరాయ్. ఓ సామాజికవర్గానికి కిరీటం పెడుతున్నారన్న టాక్ రానే వచ్చింది. రిషితేశ్వరి మరణం ఇలాంటి వాళ్లకి ఆయుధంలా దొరికింది. కానీ… అసలు కారణం వేరు. ఆక్రోశం, అమరావతి ఎక్కడ టేకాఫ్ అవుతుందోనన్న ఆందోళన. రాజమండ్రిలో వంతెన పై నుంచి 18 మంది పడి చనిపోతే కనీస మానవత్వంతో స్పందించని పక్క రాష్ట్రం.. అనంతపురంలో 17 మంది స్కూలు చిన్నారులు చితికిపోతే చలించని పక్క రాష్ట్రం ఇపుడు మాత్రం రిషితేశ్వరి కోసం కన్నీళ్లు కారుస్తోంది. కాదు కాదు నటిస్తోంది. ఎందుకంటే.. ఓ సామాజికవర్గాన్ని టార్గెట్ చేసే అవకాశం వచ్చిందన్న భ్రమ. ఒకరిద్దరు ఓ సామాజికవర్గం నుంచి వచ్చినంత మాత్రాన అందరినీ అదేగాటన కట్టడం అంటే ఒసామా – బబామా ఒకటే అనడమే. ఈ కాస్త ఇంకితం కూడా లేనివాళ్లే ఇలాంటి అరాచకానికి అంకితం అవుతారు.

చదువుకోవాల్సిన చోట కులం కొమ్ములెందుకు మొలుస్తున్నాయ్ ? కొందరు ఎక్కువ … కొందరు తక్కువ అని ఎవరు చెబుతున్నారు ? బోర్డులు కట్టిమరీ పెత్తనం చేసే వరకూ ఎందుకు వెళ్లింది సీన్ ? ఇవన్నీ తక్షణం సమాధానం చెప్పి తీరాల్సిన ప్రశ్నలు. అమరావతి అంటే అమృతం ఒలికిన చోటు… కన్నీళ్లు కారే చోటు కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇపుడు వచ్చిపడింది. రిషితేశ్వరి ఆత్మసాక్షిగా చర్యలకి సిద్ధపడాల్సిన సమయం ఇది. తుఫాన్ లాంటి సంక్షోభంలోనూ అమరావతి జెండా ఎగరేసేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ ఈ ఒక్క వర్గం స్టాంపుతో దెబ్బతింటాయ్. ఓ వర్గం ఓ వర్గం అంటూ ముద్రపడుతున్నా నిద్రలేవకపోతే చంద్రబాబుకి పెనుసవాల్ కావడం ఖాయం. అందుకే ఇపుడు నేరానికి శిక్ష పడితీరాలి. హెచ్చరికలా ఉండే శిక్ష. లేకపోతే తరాలు నష్టపోతాయ్.

-అభి

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title